గొంతులో చికెన్ ముక్క ఇరుక్కొని చనిపోయాడు
దీంతో.. హైదరాబాద్ లోని తనకున్న మరో స్నేహితుడి దగ్గరకు వెళ్లేందుకు బయలుదేరాడు. మధ్యలో కోఠిలో దిగి.. మద్యం సేవించి చికెన్ బిర్యానీ తిన్నాడు.
By: Tupaki Desk | 23 Jun 2024 4:32 AM GMTహైదరాబాద్ మహానగరంలో రోడ్డు పక్కన మరణించిన ఒక వ్యక్తి ఉదంతం గురించి పూర్తి వివరాలు తెలిశాక విస్మయానికి గురయ్యే పరిస్థితి. అనుమానాస్పద మరణంగా భావించిన దానికి బదులుగా అతడి మరణం వెనుక షాకింగ్ నిజం వెలుగు చూసింది. పోలీసుల విచారణలో అతడి మరణం వెనుకున్న గుట్టు బయటకు వచ్చింది. సోదరిని కలిసేందుకు హైదరాబాద్ కు వచ్చిన వ్యక్తి.. వారు ఇంట్లో లేకపోవటంతో తినేందుకు బయటకు వెళ్లిన సందర్భంలో అతను తిన్న చికెన్.. అతడి ప్రాణాల్ని తీసింది.
షాకింగ్ గా మారిన ఈ ఉదంతం గురించి సైదాబాద్ పోలీసులు వివరిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని అన్నారం గ్రామానికి చెందిన 39 ఏళ్ల శ్రీకాంత్ కూలీగా పని చేస్తుంటాడు. అతడికి భార్య, ఇద్దరు కొడుకులు, ఒక కుమార్తె ఉన్నారు. సోదరిని కలిసేందుకు అతడు హైదరాబాద్ కు వచ్చాడు. అయితే.. ఇటీవల తన సోదరి ఇల్లు మారటంతో.. కొత్త ఇంటి అడ్రస్ కోసం ఫోన్ చేశాడు.
తాము ఒక ఫంక్షన్ కు వెళ్లామని.. తిరిగి వచ్చేసరికి కాస్త ఆలస్యం అవుతుందని చెప్పింది. దీంతో.. హైదరాబాద్ లోని తనకున్న మరో స్నేహితుడి దగ్గరకు వెళ్లేందుకు బయలుదేరాడు. మధ్యలో కోఠిలో దిగి.. మద్యం సేవించి చికెన్ బిర్యానీ తిన్నాడు. ఫ్రెండ్ ఇంటికి వెళ్లేందుకు ఆటోలో బయలుదేరాడు. సైదాబాద్ పీఎస్ పరిధిలోని లక్ష్మీనగర్ కాలనీకి వచ్చాడు. అయితే.. అప్పటికే అతడి గొంతులో చికెన్ ముక్క ఉండటంతో శ్వాస ఆడక ఆటోలోనే కుప్పకూలిపోయాడు.
ఈ విషయాన్ని గమనించిన ఆటోడ్రైవర్ అతడ్ని కాలిబాట మీద పడుకోబెట్టి తన దారిన తాను వెళ్లిపోయాడు. శనివారం ఉదయం కాలనీ వాసులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అతడి జేబులో ఉన్న సెల్ ఫోన్ లో చివరి కాల్ కు మళ్లీ ఫోన్ చేసిన పోలీసులు.. అతడు ఎవరన్న విషయంపై అవగాహనకు వచ్చారు. అతను చనిపోయిన విసయాన్ని వెల్లడించారు.
సీసీ ఫుటేజ్ ద్వారా ఆటో డ్రైవర్ ను పిలిపించిన డ్రైవర్ కు.. అతను మద్యం కారణంగా మరణించినట్లుగా తొలుత భావించారు. అయితే.. పోస్టుమార్టంలో గొంతులో చికెన్ ముక్క ఇరుక్కున్న కారణంగా శ్వాస ఆడక మరణించిన విషయాన్ని వైద్యులు గుర్తించారు. దీంతో.. అతడిది అనుమానాస్పద మరణం కాదని.. చికెన్ ముక్క గొంతులో ఇరుక్కున్న కారణంగా మరణించిన విషయాన్ని అతడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.