ఏక్ నాథ్ ను లైన్లోకి తీసుకొచ్చిన మోడీషా.. మహా సీఎంపై క్లారిటీ
మొత్తంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా తమకు ఆప్తుడైన దేవేంద్ర ఫడ్నవీస్ కు కట్టబెట్టే క్రతువు చివరకు వచ్చిందంటున్నారు. ఇక్కడ ఫడ్నవీస్ గొప్పతనాన్ని చెప్పుకోవాల్సిందే.
By: Tupaki Desk | 2 Dec 2024 4:20 AM GMTఎవరు ఔనన్నా.. కాదన్నా మోడీషాల రూటు సపరేటు. అధికారం చేతికి వచ్చే వీలుంటే.. ఎంతటి మిత్రుడికైనా సరే వదులుకోవటానికి సిద్ధమవుతారు. లేదంటే.. తమ దారికి తెచ్చుకోవటానికి శతవిధాలుగా ప్రయత్నిస్తారు. అంతిమంగా తాము కోరుకున్నదే జరిగేలా చేస్తారు.తాజాగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి విషయంలోనూ మోడీషాలు అదే తీరును ప్రదర్శించారని చెప్పాలి. ఇటీవల మహారాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో మహాయుతి కూటమి ఏర్పాటు వేళకు.. ఎన్నికల్లో వెల్లడైన ఫలితాల తర్వాత తీరుకు బీజేపీలో మార్పు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది.
అందితే జుట్టు.. అందకపోతే కాళ్లు అన్నట్లుగా బీజేపీ అధినాయకుల తీరు ఉండటం తెలిసిందే. గత ఎన్నికల్లో సాధించిన సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లేకపోవటంతో.. అవసరమైతే ఏక్ నాధ్ షిండేతో అధికారాన్ని పంచుకోవటానికి సిద్ధమైన మోడీషాలు.. తాజా ఎన్నికల్లో సాధించిన ఘన విజయం తర్వాత మైండ్ సెట్ మారిపోవటం కనిపిస్తుంది. మొదట్లో ఏక్ నాథ్ షిండేను సీఎంగా అనుమతించేందుకు మోడీషాలు పెద్దగా అడ్డుకోరన్న వార్తా కథనాలు ప్రచురితమైనప్పటికీ.. పవర్ ను షేర్ చేసుకునే విషయంలో మోడీషాల తీరు ఎప్పటిలానే ఉంటుందన్న విషయం కాస్త ఆలస్యంగా అందరికి అర్థమైంది.
మిగిలిన వారి మాదిరే తానే మరోసారి ముఖ్యమంత్రి అవుతానని భావించిన ఏక్ నాథ్ షిండేకు.. మోడీషాల తీరు జీర్ణించుకోవటం కష్టమైంది. అందుకే ఆయన.. తన సొంతూరు వెళ్లారు. అనారోగ్యమన్న విషయాన్ని చెప్పినప్పటికీ.. అధికారాన్ని పంచుకునే విషయంలో మోడీషాలు తన పట్టును వీడకపోవటం.. అవసరమైతే మొదటికే మోసం వస్తుందన్న సంకేతాల్ని ఇవ్వటంతో తత్త్వం బోధ పడిన షిండే మాటలోనూ మార్పు వచ్చేసింది. తాజాగా వస్తున్న వార్తల ప్రకారం ఏక్ నాథ్ షిండే కుమారుడు శ్రీకాంత్ షిండేకు డిప్యూటీ సీఎం పదవిని కట్టబెడతారని చెబుతున్నారు.
ప్రస్తుతం ఎంపీగా ఉన్న అతడికి డిప్యూటీ సీఎం పదవిని కట్టబెడితే.. ఏక్ నాథ్ షిండేకు పదవి లేకుండా ఉండే వీలుందంటున్నారు. లేదంటే.. మహాయుతి ఛైర్మన్ లాంటి పదవిని కట్టబెట్టి ఊరుకుంటారన్న వాదన వినిపిస్తోంది. మొత్తంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా తమకు ఆప్తుడైన దేవేంద్ర ఫడ్నవీస్ కు కట్టబెట్టే క్రతువు చివరకు వచ్చిందంటున్నారు. ఇక్కడ ఫడ్నవీస్ గొప్పతనాన్ని చెప్పుకోవాల్సిందే. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా వ్యవహరించిన ఆయన.. కాలం కలిసి రాని వేళలో డిప్యూటీ సీఎంగా సర్దుకుపోవటానికి సిద్ధం కావటం.. తమకు పట్టు వచ్చిన వేళ.. మళ్లీ ముఖ్యమంత్రి అయ్యేందుకు వీలుగా చక్రం తిప్పటంలో సక్సెస్ అయ్యారని చెప్పాలి.
ముఖ్యమంత్రి పదవితో పాటు.. ప్రభుత్వంలో కీలకమైన హోం.. పట్టణాభివ్రద్ధి.. పీడబ్ల్యూడీ.. ఆర్థిక శాఖలతో పాటు అసెంబ్లీ స్పీకర్ పదవిని మిత్రపక్షాలకు ఇచ్చేందుకు బీజేపీ అధినాయకత్వం ససేమిరా అంటున్నట్లు చెబుతున్నారు. ఈ విషయంలో మిత్రుల అభ్యంతరాలకు అవకాశం ఇవ్వకుండా తామే వాటిని చేపడతామన్న విషయాన్ని స్పష్టం చేయటంతో పాటు.. వారిని ఒప్పించే విషయంలో మోడీషాలు విజయం సాధించారని చెబుతున్నారు. మొత్తానికి బీజేపీ అధినాయకత్వం తన తీరును ప్రదర్శించిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ రోజున మహా సీఎం అంశంపై నెలకొన్న సస్పెన్స్ వీడిపోవటం ఖాయమంటున్నారు.