Begin typing your search above and press return to search.

సీఎం రేసులో ముగ్గురు.. హైకమాండ్ లిస్టులో ఎవరున్నారు?

సీఎంతో పాటు ఉప ముఖ్యమంత్రిని నియమిస్తారని ప్రచారం నేపథ్యంలో సీఎం, డిప్యూటీ సీఎం చాన్స్ ఎవరికి లభిస్తుందనే చర్చ మొదలైంది.

By:  Tupaki Desk   |   8 Feb 2025 7:30 AM GMT
సీఎం రేసులో ముగ్గురు.. హైకమాండ్ లిస్టులో ఎవరున్నారు?
X

ఢిల్లీలో బీజేపీ విక్టరీ దిశగా దూసుకుపోతోంది. మేజిక్ ఫిగర్ దాటి మంచి మెజార్టీ సాధిస్తోంది. ఆప్ ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన వారిని మట్టికరిపిస్తోంది. ఇక విజయం లాంఛనమే కావడంతో సీఎం పీఠం కోసం పోటీ తీవ్రమవుతోంది. సీఎం అభ్యర్థులుగా ప్రధానంగా ముగ్గురి పేర్లు వినిపిస్తున్నాయి. సీఎంతోపాటు ఉప ముఖ్యమంత్రిని నియమిస్తారని ప్రచారం నేపథ్యంలో సీఎం, డిప్యూటీ సీఎం చాన్స్ ఎవరికి లభిస్తుందనే చర్చ మొదలైంది.

దేశ రాజధాని ఢిల్లీలో కలమం జెండా ఎగురుతోంది. దీంతో ఆ పార్టీ సీఎం అయ్యే చాన్స్ ఎవరకంటూ చర్చ తీవ్రంగా సాగుతోంది. ఎన్నికలకు మందు సీఎం అభ్యర్థిగా ఎవరి పేరూ ప్రకటించలేదు. దాదాపు 27 ఏళ్లుగా ఢిల్లీ పీఠానికి దూరంగా ఉన్న బీజేపీలో సీఎం చాన్స్ కోసం చాలా మంది ప్రయత్నిస్తున్నారు. 1993లో చివరగా అధికారం చేపట్టిన బీజేపీ 1998లో సీనియర్ నేత సుష్మా స్వరాజ్ ను సీఎం చేసింది. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆమెతో కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయించారు. కానీ ఫలితం దక్కలేదు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే బీజేపీ అధికారంలోకి వచ్చింది. దీంతో సీఎం చాన్స్ ఎవరికి ఇస్తుందనే చర్చ నడుస్తోంది.

ప్రస్తుతం ఢిల్లీ శాసనసభకు ఎన్నికైన పలువురు సీనియర్లతోపాటు ఢిల్లీ నుంచి పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఒకరిద్దరు ఎంపీలు సీఎం పదవి కోసం పోటీ పడుతున్నారని సమాచారం. ప్రస్తుతం ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడిగా పనిచేస్తున్న వీరేంద్ర సచ్ దేవ్, సీఎం అతిశీపై పోటీచేసిన రమేశ్ బిదూరీ, ఎంపీలు మనోజ్ తివారీ, ప్రవేశ్ వర్మ సీఎం సీటును ఆశిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో బీజేపీ ఎవరినీ సీఎం అభ్యర్థిగా ప్రకటించకపోయినా, మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మాత్రం బీజేపీ సీఎం అభ్యర్థి రమేశ్ బిదూరీ అంటూ వ్యాఖ్యానించారు. ఇప్పుడు బీజేపీ ఆయన వ్యాఖ్యలను నిజం చేస్తుందా? లేక ఇంకెవరికైనా చాన్స్ ఇస్తుందా? అన్నది చూడాల్సివుంది.

మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, రాజస్థాన్, ఒడిశా ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ ఆయా రాష్ట్రాల సీఎంలుగా ఎవరి అంచనాల్లోనూ లేని నేతలను ఎంపిక చేసింది. అనూహ్య నిర్ణయాలు తీసుకునే బీజేపీ.. ఢిల్లీలోనూ అలాంటి సంచలన నిర్ణయం ఏదైనా తీసుకుంటుందా? అనే చర్చ సాగుతోంది. అంతేకాకుండా డిప్యూటీ సీఎంను నియమించే అవకాశం ఉందంటున్నారు. దీంతో బీజేపీలో పదవుల కోసం ప్రయత్నాలు ముమ్మురం చేస్తున్నారు. ఒకవైపు విజయ సంబరాల్లో మునిగి తేలుతూనే ముఖ్య పదవుల కోసం తమ పేర్లు పరిశీలించాలని అధిష్ఠానానికి విన్నవిస్తున్నారు.

మరోవైపు సీఎంగా మహిళలకు చాన్స్ వస్తుందనే అంచనాలు వెలువడుతున్నాయి. చివరగా సుష్మా స్వరాజ్ చేతి నుంచి అధికారం పోయింది. ఢిల్లీ తొలి మహిళా ముఖ్యమంత్రిగా పనిచేసిన సుష్మా మరణం తర్వాత ఢిల్లీలో సమర్ధురాలైన మహిళా నేత లేకపోయారని అంటున్నారు. ఆ లోటును పూడ్చేలా ఇప్పుడు మహిళా నేతను సీఎంగా ఎంపిక చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది. దీంతో కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ, మీనాక్షి లేఖి, బన్సూరి స్వరాజ్ పేర్లు తెరపైకి వస్తున్నాయి. బన్సూరి స్వరాజ్ దివంగత నేత సుష్మా స్వరాజ్ కుమార్తె కావడం విశేషం. ఇలా బీజేపీలో సీఎం సీటు కోసం తీవ్ర పోటీ కనిపిస్తోంది. అయితే 20వ తేదీ వరకు ప్రభుత్వానికి గడువు ఉండటంతో కేంద్ర నాయకత్వం అన్నివిధాలా ఆలోచించే నిర్ణయం తీసుకుంటుందని అంటున్నారు.