Begin typing your search above and press return to search.

ఆ ఇద్దరూ భారత రత్నలే.. బాబు చేతిలో గొప్ప పని !

తెలుగు జాతి గర్వించే మహనీయులు ప్రతీ తరంలో పుట్టారు. తమ తీపి గురుతులు మిగిల్చి వెళ్లిపోయారు

By:  Tupaki Desk   |   27 Jun 2024 5:15 PM GMT
ఆ ఇద్దరూ భారత రత్నలే.. బాబు చేతిలో గొప్ప పని !
X

తెలుగు జాతి గర్వించే మహనీయులు ప్రతీ తరంలో పుట్టారు. తమ తీపి గురుతులు మిగిల్చి వెళ్లిపోయారు. అలా చూసుకుంటే నందమూరి తారక రామారావు తెలుగు నేల మీద నడయాడిన ఒక అద్భుతం. ఆయన గొప్ప కళాకారుడు. అలాగే రాజకీయాల్లోకి వచ్చాక గొప్ప నాయకుడు అయ్యారు. ముఖ్యమంత్రిగా గొప్ప పరిపాలకుడుగా చరిత్రలో నిలిచారు. ఎన్టీఆర్ అన్న మూడు అక్షరాలు తెలుగు వారి గుండె చప్పుడు.

ఎన్టీఆర్ తెలుగు జాతి నిలువెత్తు సంతకం. ఆయన బహుముఖీయమైన ప్రావీణ్యంతో తరతరాలకు తెలుగు వారి కీర్తిని వ్యాప్తి చేశారు. ఎన్టీఆర్ తెలుగు వారు కాబట్టి మనకు గర్వం . కానీ ఆయన తెలుగు వారిగా పుట్టడం వల్లనే గొప్ప అవార్డులు కొన్ని రాకుండా పోయాయా అన్న చర్చ కూడా అభిమానులతో పాటు తెలుగు వారిలో ఉంది.

ఆయనకు ఏనాడో భారత రత్న వంటి గొప్ప పురస్కారం దక్కాలి. కానీ నేటికీ దక్కలేదు. ఎన్టీఆర్ మరణించి 28 ఏళ్ళు గతించాయి. 2025 గణతంత్ర వేడుకల నాటికైనా ఆయనకు ఈ అవార్డు దక్కితే తెలుగు వారితో పాటు భారత దేశం కూడా గర్విస్తుంది.

ఇక చెరుకూరి రామోజీరావు. ఆయన అక్షర యోధుడు. ఆయన ఇటీవలే పరమపదించారు. అక్షరానికి ఉన్న శక్తి ఎంతటితో రామోజీరావు రుజువు చేసి చూపించారు. ఒక్క అక్షరం కణ కణ మండే నిప్పు కణమని, అది దుర్నీతులను దుర్మార్గాలను ఎలా నిర్జిస్తుందో కూడా ఆయన ఎన్నో సార్లు సమస్త జనాలకూ నిరూపించారు.

రామోజీరావు యాభై ఏళ్ళుగా అక్షర సేద్యం చేశారు. విశాఖ వాటిక ఈనాడు పత్రికను స్థాపించి దానిని దేశంలోనే ప్రముఖ పత్రికగా మలచారు. ఇక ఆయన అనేక రంగాలలో రాణించారు. ఆయన కారణ జన్ముడిగా మిగిలారు. ఇటీవల కనుమూసిన రామోజీరావు తెలుగు జాతి గర్వించే తెలుగు బిడ్డ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఆయనకు కూడా భారత రత్న అవార్డు దక్కాల్సిందే.

ఈ ఇద్దరికీ భారత రత్న అవార్డులను ఇప్పించాల్సిన బాధ్యత ఏపీలో కొలువు తీరిన టీడీపీ కూటమి ప్రభుత్వం మీద ఉంది. తాజాగా విజయవాడలో జరిగిన రామోజీరావు సంస్మరణ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు రామోజీరావుకు ఎన్టీఆర్ కి భారత రత్న అవార్డులు దక్కాలని ఆకాంక్షించారు.

కేంద్రంలో టీడీఎపీ భాగస్వామిగా ఉంది. ఎన్టీఆర్ అన్నా రామోజీరావు అన్నా ప్రధాని మోడీకి ప్రత్యేక అభిమానాలు ఉన్నాయి. ఇదే సరైన తరుణం. ఈ ఇద్దరు మహనీయులకూ ఒకేసారి భారత రత్న అవార్డు దక్కితే అది వారికే కాదు యావత్తు తెలుగు జాతికే గర్వకారణం గా ఉంటుంది. ఈ గొప్ప పనికి పూనుకోవాల్సింది ముఖ్యమంత్రిగా చంద్రబాబే. ఆయన తలచుకుంటే తప్పకుండా ఇద్దరు భారత రత్నలతో తెలుగు వారి గర్వం నిండుగా ఉప్పొంగుతుంది అనడంలో సందేహం లేదు.