Begin typing your search above and press return to search.

బీసీలను చిన్నచూపు చూశారా ?

కేసీయార్ బీసీలను చిన్నచూపు చూశారా ? అవుననే అంటున్నారు బీసీ సంఘాల నేతలు

By:  Tupaki Desk   |   22 Aug 2023 6:26 AM GMT
బీసీలను చిన్నచూపు  చూశారా ?
X

కేసీయార్ బీసీలను చిన్నచూపు చూశారా ? అవుననే అంటున్నారు బీసీ సంఘాల నేతలు. ఎలాగంటే 119 నియోజకవర్గాల్లో రాబోయే ఎన్నికలకు సంబంధించి కేసీయార్ ప్రకటించిన జాబితాలో బీసీలకు కేటాయించిన టికెట్లు 22 మాత్రమే. ఒకవైపు మొత్తం జనాభాలో సగం తమ జనాభానే కాబట్టి టికెట్లను అదే దామాషాలో కేటాయించాలని బీసీ సంఘాల నేతలు పదేపదే డిమాండ్ చేస్తున్నారు. బీసీ సంఘాల నేతల డిమాండ్లను చూసిన తర్వాత ఎక్కువ సీట్లను కేటాయిస్తారేమో అని అందరు అనుకున్నారు.

అయితే కేసీయార్ బీసీ సంఘాల నేతల డిమాండ్లను అసలు ఏమాత్రం లెక్కచేయలేదని అర్ధమైంది. మొత్తం సీట్లలో రెడ్డి సామాజికవర్గంకు 39 సీట్లను కేటాయించారు. నిజానికి బీసీలతో పోల్చితే రెడ్ల జనాభా తక్కువనే చెప్పాలి. అయితే చాలా నియోజకవర్గాల్లో రెడ్డీలదే పెత్తనం సాగుతోంది. కాబట్టి వేరేదారిలేక కేసీయార్ రెడ్లకు ఎక్కువ టికెట్లను కేటాయించినట్లు అర్ధమవుతోంది. అయితే వాళ్ళకి కేటాయించినంత కాకపోయినా తక్కువలో తక్కువ బీసీలకు కూడా దక్కుతుందనే అనుకున్నారు.

తీరాచూస్తే బీసీలు ఆశించినన్ని సీట్లు దక్కలేదని తేలిపోయింది. ఒకవైపు బీసీల జనాభా దామాషా ప్రకారమైతే తమకు 45 సీట్లు దక్కాలని బీసీ సంఘాలు పదేపదే డిమాండ్లు చేస్తున్నాయి. ఇదే విషయం కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతోంది. అందుకనే అధిష్టానం స్పిందించి ప్రతి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో కనీసం 2 అసెంబ్లీ సీట్లను బీసీలకు కేటాయించాలని పీసీసీని ఆదేశించింది.

దాని ప్రకారం 45 సీట్లు దక్కకపోయినా కనీసం 34 సీట్లు దక్కినా గౌరవంగానే ఉంటుందని అందరు సంతోషిస్తున్నారు. బీఆర్ఎస్ ఎన్నిసీట్లు కేటాయిస్తుందో చూడాలని అందరు అనుకుంటున్నారు. కేసీయార్ ప్రకటనతో తాజా విషయం బయటపడింది. సొంత సామాజికవర్గం వెలమలకు 11 నియోజకవర్గాల్లో అవకాశమిచ్చారు. నిజానికి వెలమలు జనాభా రీత్యా మైనారిటీలనే చెప్పాలి. వాళ్ళ జనాభాతో పోల్చితే వాళ్ళకిచ్చిన 11 సీట్లు చాలా ఎక్కువని అనుకుంటున్నారు. అంటే సొంత సామాజికవర్గానికి పెద్ద పీట వేసిన కేసీయార్ జనాభాలో సగం ఉన్న బీసీలకు మాత్రం 22 సీట్లతో సరిపెట్టారు. మరి బీసీలు ఏ విధంగా రియాక్టవుతారో చూడాలి.