చీకోటి ని బీజేపీలో అడ్డుకుంటుంది ఎవరు... ఇదిగో వీడియో!
అవును... మంగళవారం తెలంగాణ బీజేపీ ఆఫీసులో జరిగిన సంఘటన, ఫలితంగా కలిగిన నిరుత్సాహం, దానివల్ల వచ్చిన పట్టుదలపై తాజాగా చీకోటి ప్రవీణ్ స్పందించారు
By: Tupaki Desk | 13 Sep 2023 10:52 AM GMTరాజకీయాల్లోకి రావాలని ఉత్సాహం చూపిస్తున్నట్లు కనిపిస్తున్న చీకోటి ప్రవీణ్ కుమార్.. తాజాగా తనకు, తన అభిమానులకు జరిగిన నిరుత్సాహంపై తాజాగా ఒక వీడియో విడుదల చేశారు. ఇందులో భాగంగా... "కుళ్లు రాజకీయాలు చేస్తున్న వాళ్లకు సవాల్ విసురుతున్నా.. మీలా వెన్నుపోటు రాజకీయాలు నాకు రావు.. మీ రాజకీయం మీరు చేయండి.. నా రాజకీయం నేను చేస్తా" అంటూ ఫైరయ్యారు.
అవును... మంగళవారం తెలంగాణ బీజేపీ ఆఫీసులో జరిగిన సంఘటన, ఫలితంగా కలిగిన నిరుత్సాహం, దానివల్ల వచ్చిన పట్టుదలపై తాజాగా చీకోటి ప్రవీణ్ స్పందించారు. ఇందులో భాగంగా ఒక వీడియో విడుదల చేశారు. ఈ వీడియోలో భారతీయ జనతాపార్టీలో తన చేరికను అడ్డుకున్న వారికంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు!
ఈ సందర్భంగా మాట్లాడిన చీకోటి... మంగళవారం నాడు జరిగిన పరిణామాలతో తన అభిమానులు నిరుత్సాహానికి గురయ్యారని.. అయితే, ఇదీ ఒకందుకు మంచిదేనని, ఈ ఘటనతో మన సత్తా అందరికీ తెలిసిందని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో తన కోసం తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఏపీ నుంచి కూడా అభిమానులు వచ్చారని అన్నారు.
ఇదే క్రమంలో ... చాలామంది నేతలు డబ్బులు ఇచ్చి పిలిపించుకుంటుంటే, తన అభిమానులు మాత్రం ఎవరి వారు స్వచ్ఛందంగా తరలివచ్చారని అన్నారు. అయితే, పార్టీలో చేరిక వాయిదా పడడంతో వారంతా నిరుత్సాహానికి గురయ్యారని.. తాను మాత్రం నిరుత్సాహపడలేదని, మరింత స్ట్రాంగ్ గా మారానని చెప్పారు.
ఈ సందర్భంగా తనను అడ్డుకున్న వారికి తప్పకుండా సమాధానం చెబుతానని చెబుతున్న చీకోటి... జరిగిన ఘటనలతో ఎవరూ నిరుత్సాహ పడాల్సిన అవసరం లేదని అభిమానులనుద్దేశించి వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో... తనను ఇంతగా అభిమానిస్తున్న అభిమానుల కోసం తాను 24 గంటలూ అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు.
కాగా... క్యాసినో కింగ్ గా బాగా ఫేమస్ అయిన చీకోటి ప్రవీణ్ ఇప్పుడు రాజకీయాల్లోకి రాబోతున్న సంగతి తెలిసిందే. కొన్ని రోజుల క్రితం తెలంగాణలోని బీజేపీ పెద్దలను కలిసి ఫోటోలు బయటకు రావడంతో ఈ విషయంపై ఒక స్పష్టత వచ్చింది! ప్రవీణ్ బీజేపీలో చేరడం కన్ ఫా అనే కామెంట్లు వినిపించాయి. ఈ క్రమంలో బీజేపీలో చేరేందుకు జరిగిన ప్రయత్నం.. లాస్ట్ లో పోస్ట్ పోన్ అయ్యింది.
మంగళవారం చీకోటి తన అనుచరులతో కలిసి సంతోష్ నగర్ నుండి పెద్ద ఎత్తున ర్యాలీగా నాంపల్లిలోని బీజేపీ ఆఫీస్ కు చేరుకున్నారు. అయితే అప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం ఎంత సేపు వేచి చూసినా కిషన్ రెడ్డి రాకపోవడంతో అక్కడ నుంచి చీకోటి వెనుదిరిగారు.
ఈ విషయంపైనే ఆయన తాజాగా స్పందించారు. తన అభిమానులను ఉద్దేశించి సోషల్ మీడియాలో ఓ వీడియో సందేశం పోస్టు చేశారు.