ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై చికోటీ ప్రవీణ్ కీలక వ్యాఖ్యలు!
ఈ విషయంలో ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలలోని కీలక నేతలు ఈ విషయంపై నిప్పులు కక్కుతున్నారు. ఈసమయంలో చీకోటి ప్రవీణ్ తెరపైకి వచ్చారు.
By: Tupaki Desk | 3 April 2024 3:55 AM GMTతెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ వ్యవహారం రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. ఈ సమయంలో తాము కూడా బాధితులం అంటూ ఒక్కొక్కరూ తెరపైకి వస్తున్నారు. ఈ విషయంలో ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలలోని కీలక నేతలు ఈ విషయంపై నిప్పులు కక్కుతున్నారు. ఈసమయంలో చీకోటి ప్రవీణ్ తెరపైకి వచ్చారు.
అవును... తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే పలువురు పోలీస్ అధికారులను అరెస్ట్ చేసి విచారిస్తుండగా.. గత ప్రభుత్వ హాయాంలోని ఇద్దరు మంత్రులు, ముగ్గురు ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీల పాత్ర కూడా ఉందనే కథనాలు వైరల్ గా మారుతున్నాయి. పోలీస్ అధికారులను విచారిస్తున్న సమయంలో సంచలన విషయాలు వెల్లడవుతున్నాయని అంటున్నారు.
ఇదే సమయంలో... బీజేపీ నేత రఘునందన్ రావు ఫోన్ ట్యాప్ చేసినట్లు టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు వెల్లడించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో... తాను కూడా ఫోన్ ట్యాపింగ్ బాధితుడినే అంటూ బీజేపీ నేత చికోటి ప్రవీణ్ కుమార్ ఎంట్రీ ఇచ్చారు! ఈ మేరకు డీజీపీ రవి గుప్తాకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా రాధాకిషన్ రావుపై సంచలన ఆరోపణలు చేశారు.
ఇందులో భాగంగా... ఎస్.ఐ.బీ మాజీ ఓఎస్డీ రాధాకిషన్ రావు వ్యవహారం, ఆయన ఆస్తులపై సమగ్ర విచారణ జరపాలని డీజీపీని కోరిన చికోటి ప్రవీణ్... బీఆరెస్స్ పార్టీ అండదండలతో రాధాకిషన్ రెచ్చిపోయి అనేక అరాచకాలకు పాల్పడ్డారని ఆరోపించారు. తనపై ఈడీ కేసు నమోదైన సమయంలో తన ఫోన్ ని కూడా ట్యాప్ చేశారని ప్రవీణ్ ఆరోపించారు.
ప్రధానంగా కేసీఅర్ నియోజకవర్గం బజ్వేల్ లో శివాజీ విగ్రహం సంఘటన సమయంలో... తనపై పీడీ యాక్ట్ పెడతామంటూ రాధాకిషన్ రావు నేరుగా ఫోన్ చేసి బెదిరించారని.. కేసులు పెట్టకుండా ఉండాలంటే భారీగా నగదు ఇవ్వాలని డిమాండ్ చేశారని సంచలన ఆరోపణ చేశారు. అయితే తాను డబ్బులు ఇవ్వకపోవడం వల్లే అమ్మవారి గుడిలోకి వచ్చిన తన అనుచరుల వద్ద గన్స్ ఉన్నాయంటూ అక్రమ కేసులు పెట్టించారని ఆరోపించారు.
ఇదే సమయంలో సినిమా హీరోయిన్స్ ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్లు వస్తోన్న వార్తలపై స్పందించిన చికోటి ప్రవీణ్... అసలు హీరోయిన్స్ ఫోన్లు ఎందుకు ట్యాప్ చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.