Begin typing your search above and press return to search.

చిన్నారి ఆస్పియా కిడ్నాప్.. పుంగనూరుకు డీఐజీ.. ఎస్పీ

అవును.. ఏడేళ్ల చిన్నారి ఆస్పియా అంజుమ్ కిడ్నాప్ వ్యవహారం ఇప్పుడు పెను సంచలనంగా మారింది.

By:  Tupaki Desk   |   2 Oct 2024 4:22 AM GMT
చిన్నారి ఆస్పియా కిడ్నాప్.. పుంగనూరుకు డీఐజీ.. ఎస్పీ
X

అవును.. ఏడేళ్ల చిన్నారి ఆస్పియా అంజుమ్ కిడ్నాప్ వ్యవహారం ఇప్పుడు పెను సంచలనంగా మారింది. చిన్నారి ఆచూకీని గుర్తించేందుకు.. కిడ్నాప్ లెక్క తేల్చేందుకు చిత్తూరు జిల్లా ఎస్పీ స్వయంగా రెండు రోజులుగా కిడ్నాప్ జరిగిన పుంగనూరులోనే ఉండిపోవటం.. తాజాగా ఈ కేసు ఫాలో అప్ కోసం డీఐజీ సైతం రావటంతో ప్రాధాన్యత సంతరించుకుంది. పోలీసులు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నా.. నిందితుడి ఆచూకీని గుర్తించే విషయంలో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు.

చిత్తూరు జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారిన ఈ చిన్నారి కిడ్నాప్ కేసు ఇప్పుడు ప్రతిష్ఠాత్మకంగా మారింది. కిడ్నాప్ కు గురై రెండు రోజులు అవుతున్నా.. చిన్న క్లూ కూడా దొరక్కపోవటంతో చిన్నారి యోగక్షేమాల మీద ఆందోళన వ్యక్తమవుతోంది. పుంగనూరు పట్టణంలోని ఉబేదుల్లా కాంపౌండ్ కు చెందిన ఏడేళ్ల ఆస్పియా అంజుమ్ కనిపించకుండా పోయింది. ఫైనాన్స్ వ్యాపారం చేసే అజ్మతుల్లా.. షమియా దంపతుల కుమార్తె అయిన ఆస్పియా ఆదివారం రాత్రి ఏడు గంటల నుంచి కనిపించట్లేదని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో ఇంటి ముందు ఆడుకుంటూ ఉందని.. ఆ తర్వాత కనిపించకుండా పోయింది. దీంతో.. అదే రోజు రాత్రి 10 గంటల వేళలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఎస్పీ మణికంఠ చందోలు ఈ మిస్టరీని ఛేదించేందుకు ముగ్గురు డీఎస్పీలు.. ఐదుగురు సీఐలు.. మరో ఐదుగురు ఎస్ఐలను ఏర్పాటు చేసి.. మొత్తం 11 టీంలతో గాలింపు చర్యలు చేపట్టారు.

చిత్తూరు.. రాయచోటి నుంచి రెండు డాగ్ స్వ్కాడ్ లను రంగంలోకి దింపినా ఫలితం లేకుండా పోయింది. బాధితురాలు కనిపించకుండా పోయిన ప్రాంతంలో సీసీ కెమెరాలు పెద్దగా లేకపోవటం ఒక ఎత్తు అయితే.. ఉన్నవి రిపేర్ లో ఉండటంతో అసలేం జరిగింది? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. గడిచిన రెండు రోజులుగా జిల్లా ఎస్పీ పుంగనూరులోనే ఉండిపోయి.. విచారణను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. అంతేకాదు.. చిన్నారి తల్లిదండ్రులు.. బంధువులతోనూ పోలీసులు మాట్లాడుతున్నారు. అన్ని కోణాల్లో పరిశీలిస్తున్నా.. చిన్నారి ఆచూకీకి సంబంధించి ఒక్క ఆధారం కూడా లభించకపోవటం పోలీసులకు పెద్ద సమస్యగా మారింది.

చిన్నారి తండ్రి ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్న నేపథ్యంలో ఆర్థిక లావాదేవీల కారణంగా ఎవరితోనైనా విభేదాలు ఏర్పడి ఉంటాయా? అన్న కోణంలోనూ విచారణ చేస్తున్నారు. ఈ కేసు దర్యాప్తును సమీక్షించేందుకు డీఐజీ షేముషి బాజ్ పాయి మంగళవారం పుంగనూరుకు రావటం ప్రాధాన్యత సంతరించుకుంది. తల్లిదండ్రుల్ని అడిగి వివరాల్ని సేకరించిన ఆమె.. బాలిక ఫోటో.. వివరాల్ని సోషల్ మీడియాలో పోస్టు చేసి.. ఎవరి దగ్గరైనా సమాచారం ఉంటే పోస్టు చేయాలని కోరాలన్న సూచన చేశారు. ఈ కేసు లెక్క తేల్చేందుకు చిత్తూరు.. కడప జిల్లాలకు చెందిన ప్రత్యేక నిపుణుల్ని తెప్పించి.. గాలింపు చేపడుతున్నారు. అయినప్పటికి ఈ కేసుకు సంబంధించి ఎలాంటి వివరాలు బయటకు రాకపోవటంతో పోలీసులకు మహా ఇబ్బందిగా మారింది. ఈ కేసు ను చేధించే విషయంలో పోలీసులు ఏం చేస్తారన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.