వీధి కుక్కల నుంచి కాపాడాలంటూ పోలీస్ స్టేషన్ లో చిన్నారుల ర్యాలీ
ఇటీవల కాలంలో ఒకటి తర్వాత ఒకటి చొప్పున వీధి కుక్కల కారణంగా చిన్నారుల ప్రాణాలు పోతున్న వైనం తెలిసిందే.
By: Tupaki Desk | 22 July 2024 4:48 AM GMTఇటీవల కాలంలో ఒకటి తర్వాత ఒకటి చొప్పున వీధి కుక్కల కారణంగా చిన్నారుల ప్రాణాలు పోతున్న వైనం తెలిసిందే. ఇటీవల ఇలాంటి దారుణం చోటు చేసుకోవటం తెలిసిందే. ఇలాంటివేళ.. హైదరాబాద్ మహానగరంలోని కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఎన్సీఎల్ కాలనీ నార్త్ కు చెందిన పలువురు చిన్నారులు.. తాజాగా చేపట్టిన ఒక ర్యాలీ అందరిని ఆకర్షించింది.
సీఎం రేవంత్ అంకుల్.. మమ్మల్ని కాపాడండి అంటూ ప్లకార్డులు పట్టుకున్న చిన్నారులు తమ బుడిబుడి అడుగులతో స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి ర్యాలీ చేపట్టారు.వీరికి వారి తల్లిదండ్రులు తోడయ్యారు. రెండు రోజుల క్రితం కాలనీలోని బుక్ స్టోర్ లో పని చేసే మన్సూర్ పై వీధి కుక్క ఒకటి దాడి చేసి తీవ్రంగా గాయపర్చింది. దీంతో.. కాలనీలోని పిల్లలంతా ఒకటి చేరి.. తాము ఎదుర్కొంటున్న వీధి కుక్కల సమస్యను ప్రభుత్వం వరకు వెళ్లేందుకు వీలుగా వినూత్న రీతిలో ర్యాలీ చేపట్టారు.
సీఎం అంకుల్.. ఎమ్మెల్యే అంకుల్.. కమిషనర్ అంకుల్.. అంటూ తమ సమస్యను తెలిపేలా ప్లకార్డులు పట్టుకున్న పిల్లలు పెద్ద ఎత్తున చేపట్టిన ర్యాలీ హైదరాబాద్ లోని మిగిలిన కాలనీలకు స్ఫూర్తిగా మారింది. తాము ఎదుర్కొంటున్న సమస్య మీద పలుమార్లు ఫిర్యాదులు ఇచ్చినా పరిష్కరించని కొంపల్లి మున్సిపల్ కమిషనర్ శ్రీహరిపై చర్యలు తీసుకోవాలంటూ కాలనీ పేరెంట్స్ పలువురు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. గడిచిన రెండున్నరేళ్లలో 70 మందిని వీధి కుక్కలు గాయపర్చినట్లుగా పేర్కొన్నారు. వాటి బెడద లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.