Begin typing your search above and press return to search.

ఆరేళ్లు నిండాకే బడి బాట.. కొత్త జాతీయ విద్యా విధానం.. తీవ్ర చర్చనీయాంశం..

ఇప్పటివరకు పిల్లలను మూడేళ్లు నిండితేనే పాఠశాలల్లో చేర్పిస్తున్నారు భారతీయులు.

By:  Tupaki Desk   |   3 Jun 2024 4:30 PM GMT
ఆరేళ్లు నిండాకే బడి బాట.. కొత్త జాతీయ విద్యా విధానం.. తీవ్ర చర్చనీయాంశం..
X

ఇప్పటివరకు పిల్లలను మూడేళ్లు నిండితేనే పాఠశాలల్లో చేర్పిస్తున్నారు భారతీయులు. వారి అల్లరి భరించలేకనో.. త్వరంగా జీవితంలో కుదురుకుంటారనో.. మరో కారణంగానో మూడేళ్లు దాటగానే అక్షరాభ్యాసం చేయించి బడికి తోలుతున్నారు. కానీ, మొన్నటివరకు ప్రభుత్వ లెక్కల ప్రకారం ఐదేళ్లు నిండితేనే స్కూల్ కు పంపాలి. ఇకమీదట మాత్రం ఆరేళ్లు పూర్తయితే స్కూల్ బ్యాగ్ భుజాన వేయాలి. కొత్త జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) ఇదే చెబుతోంది. దీంతో ఈ విధానం తీవ్ర చర్చనీయాంశం అయింది. ఎంతవరకు సమంజసం అనే చర్చ మొదలవుతోంది.

నాలుగేళ్ల కిందటే..

కొత్త జాతీయ విద్యా విధానాన్ని 2020లో మోదీ ప్రభుత్వం తీసుకొచ్చింది. విజ్ఞానం ఆధారిత ప్రపంచంలో అందరికీ నాణ్యమైన విద్య అందించి దేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలపాలనేది దీని ఉద్దేశం. ఇంతకుముందు జాతీయ విద్యా విధానం 1986లో ప్రకటించారు. 1992లో దానికి సవరణ చేశారు. ఇవేవీ ఆశించిన ప్రయోజనాలు అందించలేదంటూ కొత్త పాలసీని తెచ్చారు.

10 ప్లస్ 2 కాదు.. నాలుగు దశలు..

ఇప్పటివరకు భారత విద్యా విధానంలో 10+2 పద్ధతి అమల్లో ఉంది. అంటే పదో తరతి ఆ తర్వాత ఇంటర్. కొత్త విద్యా విధానం మాత్రం 5+3+3+4ను ప్రవేశపెట్టాలని ప్రతిపాదించింది. తొలి అయిదేళ్లు పటిష్ఠమైన పునాది. తర్వాత మూడేళ్లు సన్నాహక, మాధ్యమిక దశలు. చివరి నాలుగేళ్లు సెకండరీ దశలో విద్యాభ్యాసం సాగుతుంది.

కాగా, గతంలో కంటే ఇప్పుడు నేర్చుకోవడం సులభమైంది. ప్రభుత్వ ప్రమేయం లేని పాఠశాల పూర్వ దశలోనే పిల్లలు చాలా అంశాలు నేర్చుకుంటున్నారు. దీనికి మూడేళ్లు అక్కర్లేదు. దీంతో తల్లిదండ్రులు పిల్లలను ఐదేళ్లు రాకముందే స్కూళ్లలో చేరుస్తున్నారు. ప్రి స్కూల్ ను రెండు లేదా రెండున్నరేళ్లలోనే పూర్తిచేయిస్తున్నారు.

విద్యా హక్కు చట్టం-2009 ప్రకారం.. ఆరేళ్ల నుంచి 14 ఏళ్ల వయసు చిన్నారులందరికీ ఉచిత, నిర్బంధ ప్రాథమిక విద్య అందించాలి. కానీ, ఇప్పటికీ అయిదేళ్లు నిండిన పిల్లలనే ఒకటో తరగతిలో చేర్చుకుంటూ వచ్చారు. ఈ నేపథ్యంలో బాలలకు ఆరేళ్లు నిండిన తరవాతే ఒకటో తరగతిలో చేర్పించాలనే ప్రభుత్వ ఆదేశం శాస్త్రీయంగా, తల్లిదండ్రుల ఆకాంక్షలకు అనుగుణంగా లేదు. అయిదేళ్ల వయసులో చదువుకు అడ్డుపడేదేమీ లేదు. పిల్లలు తమ చుట్టూ ఉన్నదాన్ని గమనించి పరిజ్ఞానం సంపాదించగలరు. కొన్ని సార్లు వారి ఊహా చాతుర్యం పెద్దలను సైతం ఆశ్చర్యపరుస్తుంది. రెండు నుంచి అయిదేళ్ల వయసులో పిల్లలు నర్సరీ స్కూళ్లలో చేరుతున్నారు. తల్లిదండ్రులకు దూరంగా కొత్తవారి మధ్య మసలుతూ లోకజ్ఞానం సంపాదిస్తున్నారు. ఉమ్మడి కుటుంబాలు అదృశ్యమైన ఈ రోజుల్లో భార్యాభర్తలు పట్టణాలు, నగరాల్లో వృత్తి ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఇదివరకటిలా పిల్లలను చూసుకోవడానికి పెద్దలు అందుబాటులో ఉండటం లేదు. లేటు వయసు వివాహాలతో తాము విరమణ పొందే లోపే పిల్లలను ఒక దారిలో పెట్టాలని తల్లిదండ్రులు తొందరపడుతున్నారు. కాబట్టి వీరికి ప్రతి సంవత్సరమూ విలువైనదే. అందుకే ఒకటో తరగతి ప్రవేశానికి ఆరేళ్ల వయోపరిమితి విధించడం సరికాదనే భావన వ్యక్తం అవుతోంది. అందుకనే కొత్త నిబంధనను సరిచేయాలనే డిమాండ్ వస్తోంది.