తెలుగు రాష్ట్రాల్లో అంగడి సరుకులా శిశువులు.. అతిపెద్ద అక్రమ రవాణా
హైదరాబాద్ మేడిపల్లి పోలీసులు చేసిన ఈ ప్రయత్నానికి సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి
By: Tupaki Desk | 29 May 2024 11:30 AM GMTశిశువుల అపహరణ.. విక్రయానికి సంబంధించి అతిపెద్ద రాకెట్ గుట్టురట్టయింది.. ఎక్కడో ఉన్న ఢిల్లీ, పుణెల నుంచి తీసుకొచ్చి తెలుగు రాష్ట్రాల్లో శిశువులను విక్రయిస్తున్న దందా బయటపడింది. ఈ అక్రమ రవాణా మూలాలు తెలుగు రాష్ట్రాలకు పాకడం కలకలం రేపుతోంది. స్టింగ్ ఆపరేషన్ ద్వారా ముఠా ఆటకట్టించిన పోలీసులు 11 మందిని అరెస్టు చేశారు. 16 మంది శిశువులను శిశు విహార్ కు తరలించారు. హైదరాబాద్ మేడిపల్లి పోలీసులు చేసిన ఈ ప్రయత్నానికి సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి. పసికందులు అంగడిలో సరుకులా మారి అమ్ముడవుతున్న దందా రెండు, మూడేళ్లుగా సాగుతున్నది. ఇలా విక్రయంలో 60 మంది శిశువులు చేతులు మారారు.
అక్కడినుంచి తీసుకొచ్చి..
ఢిల్లీ, పుణె నుంచి పిల్లలను ఎత్తుకుని రావడమో.. లేదా మరే విధంగానో తీసుకొచ్చి.. తెలంగాణ, ఏపీల్లో విక్రయిస్తున్నది ఓ ముఠా. వీరు సుమారు 60 మందిని వీరు అమ్మేశారు. వీరినుంచి 16 మంది కొన్నట్లుగా గుర్తించారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పీర్జాదిగూడ రామకృష్ణానగర్ లో ఫస్ట్ ఎయిడ్ క్లినిక్ నిర్వహించే శోభారాణి, బోడుప్పల్ వాసి హేమలత, షేక్ సలీం, ఘట్‌కేసర్ అన్నోజిగూడకు చెందిన తల్లీ కుమారులు బండారి పద్మ, హరిహరచేతన్ లు ముఠాగా ఏర్పడినట్లు పోలీసు విచారణలో తేలింది.
పిల్లలకు కావాల్సినవారి గుర్తించి..
పిల్లలు లేని వారిని గుర్తించి.. కొందరు అధిక సంతానం, ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న దంపతులు ఉన్నారని.. వారి పిల్లలను అమ్మేందుకు సిద్ధంగా ఉన్నారని.. చిన్నారికి రూ.2 లక్షల నుంచి రూ.6 లక్షలు అవుతుందని చెబుతారు. తమకు కావాలని కొనుగోలుకు అంగీకరిస్తే.. మరో ముఠాకు సమాచారం ఇస్తారు. కాగా, ఈ ముఠాలో విజయవాడకు చెందిన బలగం సరోజ, ముదావత్ శారద అలియాస్ షకీలా పఠాన్, పఠాన్ ముంతాజ్, జగన్నాథం అనురాధ, మహబూబ్‌నగర్ వాసి ముదావత్ రాజు, హైదరాబాద్ చర్లపల్లికి చెందిన యాత మమత ఉన్నారు. వీరు ఢిల్లీకి చెందిన కిరణ్, ప్రీతి, పుణెకు చెందిన కన్నయ్యకు వివరాలు ఇచ్చి..
పిల్లలను తీసుకొని తెలుగు రాష్ట్రాలకు వస్తారు.
కొంటున్నారా? కిడ్నాప్ చేస్తున్నారా?
కాగా, ఢిల్లీ, పుణె వ్యక్తులు పేద తల్లిదండ్రుల నుంచి చిన్నారులను కొనుగోలు చేస్తున్నారా? లేక ఎత్తుకొస్తున్నారా? అనేది తేలాల్సి ఉంది. శిశువుకు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు కమీషన్ అయితే తీసుకుంటున్నారు. ముఠా సభ్యులు ముగ్గురూ పరారీలో ఉన్నారు.
బయటపడింది ఇలా..
శోభారాణి, హేమలతలు కొందరితో కలిసి ముఠాగా ఏర్పడి చిన్నారులను విక్రయిస్తున్నట్లు పీర్జాదిగూడలోని అక్షరజ్యోతి ఫౌండేషన్ నిర్వాహకులు, సాయికుమార్ అనే యువకుడికి తెలిసింది. వీరు మేడిపల్లి ఇన్ స్పెక్టర్ గోవిందరెడ్డిని సంప్రదించారు. పోలీసులు స్టింగ్ ఆపరేషన్ ప్రారంభించారు. పిల్లలు కావాలంటూ శోభారాణిని సంప్రదించారు. అబ్బాయైతే రూ.6 లక్షలు, అమ్మాయికి రూ.4.5 లక్షలు అని.. అడ్వాన్సు కింద రూ.10 వేలు తీసుకొన్నారు. ఈ నెల 21న ఫోన్ చేసి అమ్మాయి ఉందని సమాచారం చెప్పారు. వెళ్లినవారికి శోభారాణి, హేమలత ఓ పాపను చూపించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడం.. వారు చేరుకుని ఇద్దరినీ అరెస్టు చేయడం జరిగిపోయింది. వారు చూపిన అమ్మాయిని తీసుకుని, తమదైన శైలిలో పోలీసులు విచారణ చేయడంతో అసలు లింకు బయటపడ్డాయి. కాగా, పిల్లలను కొన్నట్లు తేలిన 16 మందిపై కేసులు నమోదయ్యాయి. వీరిలో తెలంగాణ వారు 9, ఏపీ వారు ఏడుగురు ఉన్నారు. 11 మందిని అదుపులోకి తీసుకున్నారు.