Begin typing your search above and press return to search.

పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు : అర్చకుడు రంగరాజన్ పై దాడి ఎందుకంటే..

అర్చకుడిపై దాడికి దిగిన నిందితుల్లో ఆరుగురిని అరెస్టు చేశారు.

By:  Tupaki Desk   |   10 Feb 2025 3:48 PM GMT
పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు : అర్చకుడు రంగరాజన్ పై దాడి ఎందుకంటే..
X

రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకుడు రంగరాజన్ పై దాడి కేసులో పోలీసులు పురోగతి సాధించారు. అర్చకుడిపై దాడికి దిగిన నిందితుల్లో ఆరుగురిని అరెస్టు చేశారు. ఇందులో ఇద్దరు మహిళలకు ఉన్నారు. కాగా, అర్చకుడిపై దాడికి పాల్పడిన నిందితుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ దాడిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఖండించారు. రంగరాజన్ తో సీఎం రేవంత్ రెడ్డి ఫోన్లో మాట్లాడారు.

చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్ పై జరిగిన దాడికి సంబంధించి నిందితులను అరెస్టు చేశామని రాజేంద్రనగర్ డీసీపీ సీహెచ్ శ్రీనివాస్ వెల్లడించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఏపీలోని అనపర్తి ప్రాంతానికి చెందిన వీరరాఘవరెడ్డిని అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించినట్లు చెప్పారు. మొత్తం ఆరుగురిని అరెస్టు చేయగా, అందులో ఇద్దరు మహిళలు ఉన్నారు. నిందితుల్లో ఖమ్మం, నిజామాబాద్ ప్రాంతాలకు చెందిన వారు ఉన్నట్లు గుర్తించామని డీసీపీ వెల్లడించారు.

రంగరాజన్ పై దాడికి పాల్పడిన నిందితుల విచారణలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. రామరాజ్యం అనే సంస్థను స్థాపించిన ప్రధాన నిందితుడు వీరరాఘవరెడ్డి ఆర్థిక సహాయం కోసం అర్చకుడు రంగరాజన్ ఇంటికి వచ్చాడు. అంతేకాకుండా తమ సంస్థలో సభ్యులను చేర్పించమని కోరితే, రంగరాజన్ నిరాకరించడానే కారణంతో దాడికి తెగబడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. 2022లో రామరాజ్యం సంస్థను వీరరాఘవరెడ్డి స్థాపించాడు. తమ సంస్థలో చేరిన వారికి నెలకు రూ.20 వేల వేతనంగా చెల్లిస్తామని సోషల్ మీడియాలో ప్రకటించాడని డీసీపీ తెలిపారు. తణుకు, కోటప్పకోండ ప్రాంతాలకు వెళ్లి రామరాజ్యం కోసం ప్రచారం కూడా చేశాడు. అదేవిధంగా తమ సంస్థలో చేరిన వారు నల్లని యూనిఫాం కుట్టించుకోవాలని సూచించాడు. అందరూ ఈ నెల 6న యాప్రాల్ లో కలిసేలా ప్లాన్ చేశాడని డీసీసీ వెల్లడించారు. యాప్రాల్ రామరాజ్యం బ్యానర్ ఆవిష్కరించడంతోపాటు ఫోటోలు, వీడియోలు తీసుకున్నారు. వాటిని షోల్ మీడియాలో షేర్ చేశారు. ఇక 7వ తేదీన ముందస్తు వ్యూహం ప్రకారం చిలుకూరులో అర్చకుడు రంగరాజన్ ఇంటికి మూడు వాహనాల్లో 25 మంది చేరుకున్నారు. డబ్బు ఇవ్వనందుకు ఆయనపై దాడిచేశారంటూ డీసీపీ తెలిపారు. కాగా, తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం కొప్పవరం గ్రామానికి చెందిన ప్రధాన నిందితుడు వీరరాఘవరెడ్డి హైదరాబాద్ లోని మణికొండలో నివసిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

కాగా, దాడి ఘటనను సీరియస్ గా తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి నిందితులను తక్షణం అరెస్టు చేయాలని ఆదేశించారు. అర్చకులు రంగరాజన్ తో ఫోన్ మాట్లాడి పరామర్శించారు. సీఎం ఆదేశాలతో ఆగమేఘాలపై కదిలిన పోలీసులు ప్రధాన నిందితుడిని పట్టుకుని అరెస్టు చేశారు. అదేవిధంగా రంగరాజన్ పై దాడిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని, భవిష్యత్తులో మళ్లీ జరగకుండా కట్టడి చేయాలని పిలుపునిచ్చారు.