ఆ ఔషధం కోసం చిలుకూరుకు పోటెత్తిన భక్తులు
హైదరాబాద్ సమీపంలోని చిలుకూరు బాలాజీ ఆలయంలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి
By: Tupaki Desk | 19 April 2024 7:21 AM GMTహైదరాబాద్ సమీపంలోని చిలుకూరు బాలాజీ ఆలయంలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. దీనిలో భాగంగా ఈ రోజు ఆలయంలో భక్తులకు సంతాన ప్రాప్తికి దివ్య ఔషధంగా పరిగణించే గరుడ ప్రసాదం పంపిణీ చేస్తామని ఆలయ వర్గాలు ప్రకటించాయి. ఈ విషయం సోషల్ మీడియా ద్వారా వైరల్ కావడంతో ఔటర్ రింగ్ రోడ్, మొయినాబాద్ రహదారులలో భక్తులు పోటెత్తారు.
ఈ తెల్లవారుజాము నుండి ఉదయం 10.30 గంటల వరకు దాదాపు 60 వేలకు పైగా భక్తులు ఆలయం వైపు క్యూ కట్టారు. దీంతో ఆ రహదారులు అన్నీ ట్రాఫిక్ జామ్ తో కిలోమీటర్ల మేర కిక్కిరిసి పోయింది. గరుడ ప్రసాదం పంపిణీ నేపథ్యంలో 5 వేల మంది వరకు భక్తులు వస్తారని ఆలయ అధికారులు చెప్పడంతో ఆ మేరకు పోలీసులు ఏర్పాట్లు చేసినట్లు సమాచారం.
అయితే అంచనాలకు మించి పది, పన్నెండు రెట్లు రెట్టింపు సంఖ్యలో భక్తులు రావడంతో రద్దీ ఏర్పడింది. దీంతో కాస్త ఆలస్యంగా తేరుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ట్రాఫిక్ ను క్రమబద్దీకరిస్తున్నారు. అసలే ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ట్రాఫిక్ లో ఇరుక్కుపోయిన విద్యార్థులు, వృద్దులు, చిన్నపిల్లలు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.