చైనాను నమ్మొద్దు.. బోర్డర్ లో గ్రామాల నిర్మాణం.. మళ్లీ కయ్యం
విశాలమైన టిబెట్ సహా అనేక ప్రాంతాలను కలిపేసుకుంది డ్రాగన్.
By: Tupaki Desk | 31 Dec 2024 12:00 AM IST‘విస్తరణ వాదం..’ తమ దేశాన్ని అంతకంతకూ పెంచుకుంటూ పోవాలనేది దీని ఉద్దేశం. ఆధునిక కాలంలో ఈ కోరిక బలంగా ఉన్న నాయకత్వం చైనా నాయకత్వం. అసలు ఇప్పుడు చైనా భూభాగంలో ముప్పావు వంతు ఇతర దేశాలదే అంటారు. విశాలమైన టిబెట్ సహా అనేక ప్రాంతాలను కలిపేసుకుంది డ్రాగన్. అలాంటి చైనా కన్ను భారత్ పైనా పడింది.
అరుణాచల్ లో గిల్లికజ్జాలు
భారత్ లో సూర్యుడు ఉదయించే అరుణాచల్ ప్రదేశ్ అంటే చైనాకు వల్లమాలిన ఆక్రోశం. ఆ ప్రాంతం తమదే అంటుంది. సౌత్ టిబెట్ గా అరుణాచల్ ను పిలుస్తుంది. ఇప్పటికే పలుసార్లు ఆక్రమణ యత్నాలకు పాల్పడింది. ఇక నాలుగేళ్ల కిందట లద్దాఖ్ లోని ఢోక్లాంలో చైనా ఎలాంటి దుస్సాహసానికి పాల్పడిందో అందరూ చూశారు. మన సైనికులు తీవ్రంగా ప్రతిఘటించడంతో చైనా తోక ముడిచింది.
మూడు నెలల కిందట లద్దాఖ్ ప్రాంతంలో భద్రత విషయమై ఇరు దేశాలు ఒక ఒప్పందానికి వచ్చాయి. ఇప్పుడు అంతా సద్దుమణిగింది అనుకుంటుండగా పెద్ద దుమారమే రేగేలా ఉంది. చైనా మరోసారి కయ్యానికి కాలు దువ్వుతోంది. తాజాగా సరిహద్దులో రెండు పెద్ద గ్రామాలను నిర్మించింది.
ఆక్రమిత అక్సాయ్ చిన్ లో
భారత్ తో నెహ్రూ హయాంలో జరిగిన యుద్ధంలో చైనా లద్దాఖ్ లోని అక్సాయ్ చిన్ ను ఆక్రమించింది. ఇప్పటికీ చైనా ఆక్రమిత ప్రాంతంగా దానిని భారత్ పేర్కొంటోంది. ఇప్పుడు అక్సాయ్ చిన్ లో గ్రామాన్ని నిర్మించింది. కాగా, భారత సరిహద్దుల్లో నిర్మించిన రెండు గ్రామాలకు హియాన్, హెకాంగ్ పేరు పెట్టింది. ఈ విషయాన్ని చైనా ప్రభుత్వ అధికార వార్తాసంస్థ జిన్హువా వారం క్రితమే ప్రకటించింది. ఈ గ్రామాల పరిపాలన కేంద్రాల్లో నిర్మించిన టౌన్ షిప్ లకు హంగ్లియూ, సెయిడుల అనే పేర్లు పెట్టారు. అక్సాయ్ చిన్ లో నిర్మించిన గ్రామం పేరు హియాన్.
భారత్ ప్రతిస్పందన ఏమిటో?
సరిహద్దులో చైనా నిర్మించిన గ్రామాల విషయం భారత ప్రభుత్వం దృష్టికి కూడా వచ్చినా ఇంకా అధికారికంగా స్పందించలేదు. సరిహద్దు వివాదం పరిష్కారానికి ద్వైపాక్షిక చర్చలు జరుగుతుండగా చైనా ఏకపక్ష చర్యలు ఇబ్బందికరమే.
కొసమెరుపు: టిబెట్ ను 1950లోనే ఆక్రమించిన చైనా.. ఇప్పుడు అక్కడ ప్రపంచంలోనే అతిపెద్ద టిబెటన్ బౌద్ధుల స్టడీ సెంటర్ ‘లరుంగ్ గర్ బుద్ధిస్ట్ అకాడమీ’ వద్ద సుమారు 400 దళాలను, హెలికాప్టర్లను మోహరించింది. మతపరమైన కార్యకలాపాలపై గట్టి నిఘా కోసమే ఈ మోహరింపులు అని అంటోంది.