చైనా పిల్లలను దత్తత ఇవ్వడానికి ఇక వీల్లేదు
అభివృద్ధిలో చైనా ప్రపంచంతో పోటీపడుతోంది. అగ్రదేశం అమెరికా లక్ష్యంగా దూసుకెళ్తోంది. అలింటి ఇప్పుడు ఆందోళనలో పడిపోయింది.
By: Tupaki Desk | 7 Sep 2024 4:30 PM GMTఅభివృద్ధిలో చైనా ప్రపంచంతో పోటీపడుతోంది. అగ్రదేశం అమెరికా లక్ష్యంగా దూసుకెళ్తోంది. అలింటి ఇప్పుడు ఆందోళనలో పడిపోయింది. గత 60 ఏళ్లలో ఎన్నడూ ఎదుర్కోలేని పరిస్థితి ఎదుర్కొంటోంది. అంతటి చైనా దేశంలో ఆ పరిస్థితులు ఎందుకు వచ్చాయి..? దానికి గల కారణాలు ఏంటి..? ఈ క్రమంలో అక్కడి దేశం కీలక నిర్ణయం తీసుకుంది.
జనాభా వృద్ధిలో ఒకప్పుడు చైనా దేశం టాప్ ప్లేసులో ఉండేది. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం ఏదయా అంటే చైనా అని మొన్నటి వరకు మాట. కానీ.. ఇప్పుడు పరిస్థితులు తలకిందులయ్యాయి. డ్రాగన్ దేశం చైనా దేశంలో జననాల రేటు ఆందోళనకరంగా మారింది. అక్కడి జనాభా సహజ వృద్ధి రేటు 43 ఏళ్ల కనిష్టానికి తగ్గింది. 2020లో అక్కడి జననాల రేటు ప్రతీ 1000 మందికి 8.52 కాగా.. జనాభా సహజ వృద్ధిరేటు ప్రతీ 1000 మందికి 1.45 అని జాతీయ గణాంకాల బ్యూరో పబ్లిష్ చేసిన చైనా స్టాటిస్టికల్ ఇయర్ బుక్ ద్వారా వెల్లడించారు.
ఒకప్పటి జనాభా ప్రభావంతో గతంలో చైనాలో అక్కడి ప్రభుత్వం ఒకే బిడ్డ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. విదేశీయులకు దత్తత ఇచ్చే వెసులు బాటును కల్పించింది. దాంతో చైనీయులు తమ బిడ్డలను ప్రపంచవ్యాప్తంగా దత్తత ఇచ్చారు. అలా.. 1,60,000 మంది చైనా చిన్నారులు ఇతర దేశాల్లో ఉండిపోయారని లెక్కలు చెబుతున్నాయి. ఒక్క అమెరికాలో వారే 82,000 మంది చిన్నారులను దత్తత తీసుకున్నారని చైనాస్ చిల్డ్రన్ ఇంటర్నేషనల్ చెబుతోంది. అందులోనూ ఎక్కువ సంఖ్యలో బాలికలే ఉన్నారు.
ఆ తరువాత 1980 నుంచి 2015 వరకు ఆ దేశంలో పెళ్లి చేసుకున్న కొత్త జంటలు ఒక్క బిడ్డకు మాత్రమే జన్మనివ్వాలంటూ నిబంధన తీసుకొచ్చారు. దాంతో అక్కడి జననాల రేటు తగ్గుతుండగా.. వృద్ధులు పెరిగిపోయారు. ఇక రియలైజ్ అయిన అక్కడి ప్రభుత్వం 2016లో ఆ నిబంధనను ఎత్తివేసింది. పెళ్లిళ్లు చేసుకోండి.. బిడ్డల్ని కనండి అంటూ కొత్త చట్టం చేసింది. జనాభా వృద్ధి రేటును ఎదుర్కొంటుండడంతో పాత నిబంధనను ఎత్తేసింది. అంతేకాదు.. కొత్తగా పిల్లల్ని కనేవారికి ఆర్థిక ప్రోత్సాహాకాలను సైతం ప్రకటించింది. ఇక ఇప్పుడు కొత్తగా.. తమ దేశం పిల్లల్ని ఏ ఇతర దేశాలకు దత్తత ఇవ్వడానికి వీలు లేదని ఆదేశాలిచ్చింది. ఈ చట్టం ద్వారా ఆ దేశం పిల్లలు అక్కడే ఉండిపోనున్నారు.