Begin typing your search above and press return to search.

చైనా కోసం అమెరికా కత్తి.. బంగాళాఖాతంలో భారత్ పక్కలో బల్లెం

సెయింట్ మార్టిన్స్.. కేవలం 3 చదరపు కిలోమీటర్ల వైశాల్యం ఉన్న దీవి.. కానీ.. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది.

By:  Tupaki Desk   |   28 Aug 2024 8:30 AM GMT
చైనా కోసం అమెరికా కత్తి.. బంగాళాఖాతంలో భారత్ పక్కలో బల్లెం
X

సెయింట్ మార్టిన్స్.. కేవలం 3 చదరపు కిలోమీటర్ల వైశాల్యం ఉన్న దీవి.. కానీ.. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. అంతమాత్రాన అక్కడేదో బంగారు గనులు లేవు.. కానీ, అంతకుమించిన ప్రాధాన్యం ఉంది. ఇటు మయన్మార్.. అటు బంగ్లాదేశ్.. బంగాళాఖాతం మధ్యలో సెయింట్ మార్టిన్స్. దీంతో అమెరికా కన్ను పడింది. అది బంగ్లాదేశ్ లో బలమైన నాయకురాలు షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూల్చేవరకు వెళ్లింది అని చెబుతున్నారు.

అమెరికా కన్నుపడితే.. అంతే

‘అమెరికా ఫస్ట్’.. అంటే ‘ఏ విషయంలోనైనా అమెరికా ముందు’ అనేది వారి నినాదం. అలాంటి అమెరికా కన్నుపడితే ఇక ఏదైనా అంతే.. సెయింట్ మార్టిన్ ను గనుక ఆ దేశానికి అప్పగిస్తే.. బంగ్లా ఎన్నికలను సజావుగా సాగేలా చూస్తామనే ప్రతిపాదన తనకు వచ్చిందంటూ సాక్షాత్తు షేక్ హసీనానే చెప్పడం గమనార్హం. ఇక్కడ నౌకా స్థావరాన్ని ఏర్పాటు చేయాలనేది అమెరికా ఆలోచన. తద్వారా చైనాను దెబ్బకొట్టాలనేది వ్యూహం. ఈ నేపథ్యంలో భారత్ అప్రమత్తం కావాల్సి ఉంది.

బంగాళా అఖాతం.. దక్షిణ చైనా గండం

బంగాళాఖాతం.. హిందూ మహాసముద్రంలో అంతర్భాగం. కానీ, నౌకాపరంగా అత్యంత కీలకం. దీనికి చేరువలోనే ఉంటుంది మలక్కా జలసంధి. దీని ద్వారానే చైనా, జపాన్‌ లకు, ఇతర తూర్పు ఆసియా దేశాలకు చమురు, సరకులు ఎగుమతి-దిగుమతి అవుతాయి. మలక్కా.. ఎంత ప్రముఖమైనది అంటే.. ప్రపంచ సముద్ర వాణిజ్యంలో 30 శాతం దీనిద్వారానే నడుస్తుంది. దీనిని దాటాక వచ్చేది అత్యంత వివాదాస్పదమైన

దక్షిణ చైనా సముద్రం. ఈ ప్రాంతంపై ఆధిప్యతం కోసం చైనా.. పలు దేశాలతో ఘర్షణలకు దిగుతోంది. ఇండో-పసిఫిక్‌ గా పేర్కొనే హిందూ మహా సముద్రం- పసిఫిక్‌ మహా సముద్రాల్లో చైనా దూకుడును ఆపడం చాలా కీలకం. అందుకనే ఇండియా, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా క్వాడ్‌ పేరిట కూటమిగా ఏర్పాడ్డాయి. అదే క్రమంలో సెయింట్‌ మార్టిన్స్‌ లో పాగా వేయాలని అమెరికా ఎత్తుగడ.

ఇరుగు-పొరుగు భారత్ కు కంగారు

భారత్-బంగ్లా-శ్రీలంక-మయన్మార్.. బంగాళాఖాతం చుట్టూ ఉన్న దక్షిణాసియా దేశాలివి. వీటిలో భారత్‌ తప్ప అన్నిచోట్లా కల్లోల పరిస్థితులే. దీనిని ఆసరాగా చేసుకుని బంగాళాఖాతంపై ప్రధాన దేశాలు కన్నేశాయి. అంతేకాదు.. బంగాళాఖాతం, దక్షిణ చైనా సముద్రం, హిందూ మహా సముద్రాల్లో రెండో ప్రపంచ యుద్ధం నుంచి అమెరికా నౌకా దళానిదే పెత్తనం. ప్రచ్ఛన్న యుద్ధం జరిగిన సమయంలో సోవియట్‌ యూనియన్ యుద్ధ నౌకలు ఈ ప్రాంత సముద్ర జలాల్లో తిరిగేవి. కానీ, సోవియట్‌ పతనం.. చైనాకు కలిసొచ్చింది. అప్పటినుంచి బంగాళాఖాతం, దక్షిణ చైనా సముద్రం, హిందూ మహా సముద్రాల్లో చైనా హవా సాగిస్తోంది. దీంతో భారత్ కూడా అప్రమత్తమై బలం పోగేసుకుంటుంది. సోవియట్‌ యూనియన్ కుప్పకూలాక.. హిందూ మహాసముద్రంలో రష్యా కార్యకలాపాలు తగ్గాయి. చైనా దూకుడును అడ్డుకోవడానికి భారత్, జపాన్, ఆస్ట్రేలియా వంటి తీర దేశాలను కలుపుకోవడం అమెరికా వ్యూహంగా ఉంది.

అంతర్జాతీయ జలాల్లో అన్ని దేశాలకూ స్వేచ్ఛగా సంచరించే హక్కును చైనా గౌరవించడం లేదు. దక్షిణ చైనా సముద్ర తీర దేశాలు ప్రధాన ఆరోపణ ఇదే. అయితే, అంతర్జాతీయ ఒప్పందాలకు కట్టుబడిన దేశాలను ఏకం చేసి చైనాను ఓడించాలనేది అమెరికా ఆలోచన. అందుకే బంగాళాఖాతంలోని సెయింట్‌ మార్టిన్స్‌లో స్థావరం ఏర్పాటు చేయాలనుకుంది. అయితే, ఇప్పటికే హిందూ మహాసముద్రంలో ఆ దేశానికి కొన్ని స్థావరాలు ఉన్నాయి. దీనికి బదులు భారత్‌ వంటి ప్రాంతీయ భాగస్వాములే మరింత క్రియాశీల పాత్ర పోషించేలా ప్రోత్సహించవచ్చు.