తైవాన్ తోక తొక్కుతున్న డ్రాగన్..153 విమానాల చక్కర్లు..మరో యుద్ధమే?
ఇంతకూ తైవాన్ స్వతంత్ర దేశమా? ఈ మాటంటే తోక తొక్కిన చైనా అంతెత్తున లేస్తుంది.
By: Tupaki Desk | 15 Oct 2024 8:30 PM GMTఇంతకూ తైవాన్ స్వతంత్ర దేశమా? ఈ మాటంటే తోక తొక్కిన చైనా అంతెత్తున లేస్తుంది. రెండేళ్ల కిందట అమెరికా చట్ట సభల స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్ సందర్శనకు వెళ్తే నానా బీభత్సం రేపింది చైనా. అయితే, తర్వాత ఎటువంటి చర్యకూ దిగలేదు. కానీ, తైవాన్ తమదే అని చాటేందుకు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తుంటుంది.
వన్ చైనా నినాదంతో ఊగిపోతూ..
1997లో హాంకాంగ్ ను బ్రిటన్ నుంచి సొంతం చేసుకుంది చైనా. ఇక టిబెట్ ను కలుపుకొన్నట్లే తైవాన్ నూ కలిపేసుకోవాలనేది దాని ఆలోచన. అందుకే ‘వన్ చైనా (ఒక్కటే చైనా)’ అంటూ తరచూ నినాదాలు చేస్తుంది. అయితే, అమెరికా మాత్రం తైవాన్ కు పూర్తి మద్దతు. దీంతో తైవాన్ స్వతంత్రతను పదేపదే ప్రశ్నిస్తూ చైనా భారీ సైనిక విన్యాసాలు చేపడుతుంది. అంటే.. తమ శక్తిని చూపి తైవాన్ ను లోబర్చుకోవాలని చూడడం అన్నమాట. కాగా, కొద్ది నెలల కిందట తైవాన్ లో జరిగిన ఎన్నికల్లో చైనా వ్యతిరేక నాయకుడు లై చింగ్ తైవాన్ అధ్యక్షుడిగా గెలుపొందారు. అప్పట్లోనూ డ్రాగన్ హడావుడి చేసింది.
అన్నివైపులా చుట్టేసి..
శ్రీలంకలాగా తైవాన్ ద్వీప దేశం. చిన్నదే అయినా ప్రపంచ చిప్ రాజధానిగా తైవాన్ ను పేర్కొంటారు. చైనా సరుకుల్లా కాకుండా తైవాన్ తయారీ వస్తువులకు మంచి పేరుంది. అలాంటి తైవాన్ పై చైనా కన్ను ఎప్పటినుంచో ఉంది. తాజాగా సోమవారం తైవాన్ చుట్టూ ఆర్మీ, నేవీ, వాయుసేన, క్షిపణి బలగాలను మోహరించింది. తైవాన్ సముద్ర జలాల్లో విమాన వాహక నౌకలను దించింది. అంటే.. పూర్తిగా తైవాన్ ను దిగ్బంధం చేసింది. ‘జాయింట్ స్వార్డ్-2024బి’ పేరుతో ఓ రకంగా యుద్ధ అభ్యాసాలను సాగించింది. వీటిని తైవాన్ కు హెచ్చరిక అని చెప్పడం గమనార్హం.
తైవాన్ అధ్యక్షుడి ప్రకటనతోనే..
మా దేశం ఏ దేశానికీ అధీనం కాదు అంటూ నాలుగు రోజుల క్రితం జాతీయ దినోత్సవం సందర్భంగా తైవాన్ అధ్యక్షుడు లై చింగ్ ప్రసంగించారు. దీంతోనే డ్రాగన్ తోక తొక్కినట్లయింది. తైవాన్ గగనతల హద్దులను కూడా ఉల్లంఘించి.. ఎన్నడూ లేని విధంగా ఒకే రోజు 125 యుద్ధ విమానాలతో
చైనా విన్యాసాలు చేసింది. మంగళవారంతో కలిపితే తమ దేశం చుట్టూ 153 చైనా సైనిక విమానాలు చక్కర్లు కొట్టాయని తైవాన్ రక్షణ శాఖ పేర్కొంది. 14 చైనా నౌకలను నమోదు చేశామని పేర్కొంది.
జపాన్ కూ కంగారే..
రెండో ప్రపంచ యుద్ధం తర్వాత శాంతి కాముక దేశంగా మారిపోయిన జపాన్ కూ చైనా దూకుడు కంగారు పుట్టిస్తోంది. తమ యోనాగుని ద్వీపం సమీపంలో చైనా కసరత్తులు చేసిందని ఆరోపించింది. కాగా, తాజా ఉదంతాలపై జపాన్, తైవాన్ లకు అండగా నిలిచే అమెరికా స్పందించింది. చైనా చర్యలు ఉద్రిక్తతలను పెంచుతాయని, సంయమనంతో వ్యవహరించాలని కోరింది.