Begin typing your search above and press return to search.

అధ్యక్షుడి సన్నిహితుడు అరెస్ట్... చైనాలో ఏమి జరుగుతోంది?

చైనా సైన్యంలో అత్యంత కీలక స్థానాల్లో ఉంటూ, అధ్యక్షుడు జిన్ పింగ్ కు అత్యంత సన్నిహితమైన వ్యక్తుల అరెస్ట్ ఇప్పుడు సంచలనంగా మారింది.

By:  Tupaki Desk   |   18 March 2025 5:00 PM IST
అధ్యక్షుడి సన్నిహితుడు అరెస్ట్... చైనాలో ఏమి జరుగుతోంది?
X

చైనాలో గత ఏడాది మియావో లి అనే ఉన్నతస్థాయి సైనిక అధికారిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆయన నాడు పొలిటికల్ వర్క్ డిపార్ట్ మెంట్ డైరెక్టర్ గా ఉన్నారు. అంతక ముందు చైనా రక్షణ మంత్రిని అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా చైనా సైన్యంలో అధ్యక్షుడు జిన్ పింగ్ కు అత్యంత సన్నిహితమైన ఫుజియాన్ నాయకులు, జనరల్స్ పై చర్యలు మొదలయ్యాయి.

అవును... చైనా సైన్యంలో అత్యంత కీలక స్థానాల్లో ఉంటూ, అధ్యక్షుడు జిన్ పింగ్ కు అత్యంత సన్నిహితమైన వ్యక్తుల అరెస్ట్ ఇప్పుడు సంచలనంగా మారింది. ఇందులో భాగంగా... అత్యంత కీలకమైన సెంట్రల్ మిలటరీ కమిషన్ వైస్ ఛైర్మన్ హివైడాంగ్ అరెస్టయ్యారు. ఇటీవల కాలంలో చైనా కీలక పదవుల్లో ఉన్న వ్యక్తులను మార్చెస్తున్న క్రమంలో ఈ అరెస్ట్ వైరల్ గా మారింది.

వాస్తవానికి అత్యంత కీలకమైన ఈ కమిషన్ కు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ఛైర్మన్ కాగా.. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీలో సెంట్రల్ మిలటరీ కమిషన్ వైస్ ఛైర్మన్ పదవి అత్యున్నతమైంది! అలాంటి వ్యక్తి అరెస్ట్ అవ్వడంతో.. మరికొంతమందిని కూడా అదుపులోకి తీసుకోనున్నారని అంటున్నారు. ఇప్పటికే అదుపులోకి తీసుకున్నవారిలో ఉన్న ప్రముఖుల వివరాలు వెలువడుతున్నాయి.

ఇందులో భాగంగా... పీ.ఎల్.ఏ. జనరల్ లాజిస్టిక్స్ డిపార్ట్ మెంట్ మాజీ మంత్రి ఝూవో కేషిని కూడా కస్టడీలోకి తీసుకొన్నట్లు కథనాలొస్తున్నాయి. ఈయన కూడా నాన్ జింగ్ మిలటరీ రీజియన్ లో జనరల్ లాజిస్టిక్స్ లో అధిపతిగా పనిచేశారు. దీంతోపాటు సైనిక బడ్జెట్, వనరుల కేటాయింపులు, రక్షణ పరిశ్రమలపై అతడి ప్రభావం ఉందని చెబుతారు.

ఇదే సమయంలో... వెస్టర్న్ థియేటర్ కమాండ్ డిప్యూటీ కమాండర్, ఫుజియాన్ లో పనిచేసే చాలామంది జనరల్స్ ను అదుపులోకి తీసుకొన్నట్లు తెలుస్తోంది. అయితే... ఈ అరెస్టులను ఆ దేశ రక్షణశాఖ ధృవీకరించాల్సి ఉంది.