వేలాది స్కూల్స్ మూసేస్తున్నారు.. చైనాలో మళ్లీ ఏమైంది..?
ఇప్పుడు చైనాకు మరో భారీ సమస్య వచ్చింది.. అయితే... అది వాళ్ల ఇంటర్నల్ సమస్య!
By: Tupaki Desk | 28 Oct 2024 3:53 AM GMTసమస్యను - చైనాను పక్కపక్కనే పెట్టి చూస్తే ప్రపంచం మొత్తం ఒక్కసారి ఉలిక్కిపడుతుంది. కరోనా మహమ్మారి నుంచి ప్రపంచ వ్యాప్తంగా ఈ మేరకు అభిప్రాయాలు ఏర్పడ్డాయనే చెప్పొచ్చు. అయితే... ఇప్పుడు చైనాకు మరో భారీ సమస్య వచ్చింది.. అయితే... అది వాళ్ల ఇంటర్నల్ సమస్య!
అవును... చైనాకు ఇప్పుడు ఓ భారీ సమస్య వచ్చింది. ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశంగా ఉన్న చైనా.. ఇప్పుడు రెండు రకాల జనాభా సంక్షోభాలను ఎదుర్కొంటుంది. ఇందులో ఒకటి జననాలు, సంతానోత్పత్తి రేటు తగ్గిపోవడం కాగా.. మరొకటి వృద్ధ జనాభా పెరిగిపోవడం.
చైనా ఇప్పుడు ఈ రెండు సంక్షోభాలను ఎదుర్కొంటుంది. దీని ప్రభావం విద్యతోపాటూ అనేక రంగాలపైనా పడుతుంది. ప్రధానంగా జననాల రేటు గణనీయంగా తగ్గిపోతుండటంతో వేలాది పాఠశాలలు మూసివేసినట్లు చెబుతున్నారు. ఇక్కడ పనిచేసే టీచర్లు వృద్ధులకు సంరక్షకులుగా ప్రొఫెషన్ మార్చుకుంటున్నారని అంటున్నారు.
ఈ క్రమంలో గత ఏడాదిలో దేశవ్యాప్తంగా 14,808 కిండర్ గార్డెన్లు మూతపడినట్లు చైనా విద్యాశాఖ తాజా నివేదిక వెల్లడించింది. పాఠశాలల్లో చేరేవారి సంఖ్య 11 శాతం తగ్గడమే దీనికి కారణం అంటున్నారు. ఇదే సమయంలో... 5,645 ప్రాథమిక పాఠశాలలు కూడా 2023వ సంవత్సరంలో మూతపడినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్న పరిస్థితి.
దీంతో... వీటిలో పనిచేసే టీచర్లు, సిబ్బంది ఇతర పనులు ఎంచుకుంటున్నారని అంటున్నారు. అందులో ఒకటి.. వృద్ధులకు సంరక్షకులుగా ఉండటం. కారణం... 2023 నాటికి 60 ఏళ్లు పైబడిన వారి సంఖ్య 30 కోట్లకు చేరుకోగా.. 2035 నాటికి ఈ సంఖ్య 40 కోట్లకు చేరుకుంటుందని అంచనాయే!
ఇక 2050 నాటికైతే చైనాలో వృద్ధ జనాభా 50 కోట్లకు చేరుకుంటుందని ఇటీవల ఓ నివేదిక అంచనా వేసింది. దీంతో... కిండర్ గార్డెన్, ఆయా పాఠశాలల సిబ్బంది వృద్ధులకు సంరక్షకులుగా విధులు నిర్వర్తించేందుకు సిద్ధమవుతున్నారని అంటున్నారు.