చంద్రుడినీ వదలని చైనా!
ఇప్పుడు దేశాల మధ్య ఆధిపత్యం ప్రపంచంపైనే కాదు.. ఏకంగా అంతరిక్షానికి పాకింది.
By: Tupaki Desk | 18 April 2024 1:39 PM GMTఇప్పుడు దేశాల మధ్య ఆధిపత్యం ప్రపంచంపైనే కాదు.. ఏకంగా అంతరిక్షానికి పాకింది. అంతరిక్షంపైన ఆధిపత్యం కోసం అగ్ర దేశాలు పోటీ పడుతున్నాయి. ఒకప్పుడు అమెరికా, రష్యాలు అంతరిక్షంలో ఆధిపత్యం కోసం పోటీ పడ్డాయి. అంతరిక్షంలోకి రష్యా తొలిసారి మనిషిని పంపితే అమెరికా ఏకంగా చంద్రుడిపైకే మనిషిని పంపి సంచలనం సృష్టించింది.
కొన్ని దశాబ్దాలపాటు అమెరికా, రష్యాలు అంతరిక్షంపైన ఆధిపత్యానికి పోటీ పడ్డాయి. అయితే ఇప్పుడు ప్రపంచ ఆధిపత్యం కోసం అర్రులు చాస్తున్న చైనా కూడా తాను తక్కువేమీ తినలేదని దూసుకొస్తోంది. గత కొన్ని దశాబ్దాలుగా చైనా అంతరిక్ష రంగానికి భారీ ఎత్తున వ్యయం చేస్తోంది. సొంత అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసుకునే పనుల్లో ఉంది. ఇది అందుబాటులోకి వస్తే చైనా అంతరిక్ష కార్యక్రమాలు మరింత వేగవంతం కానున్నాయి.
ఈ నేపథ్యంలో చైనా అంతరిక్ష కార్యక్రమాల పట్ల అమెరికా ఆందోళన వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా చంద్రుడిపై చైనా కార్యక్రమాలపైన అనుమానాలు ఉన్నాయంటోంది. చంద్రుడిపైన చైనా పాగా వేసిందంటే అక్కడ కూడా చైనీస్ పేర్లు పెట్టేసి ఇదంతా తమదని అన్నా అంటోందని అమెరికా చెబుతోంది.
తాజాగా చైనా అంతరిక్ష కార్యక్రమాలపై అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ.. నాసా అధిపతి బిల్ నెల్సన్ పలు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. చైనా తన అంతరిక్ష కార్యక్రమాలను రహస్యంగా ఉంచుతోందని ఆయన బాంబుపేల్చారు. చైనా చంద్రుడిపైన సైనిక కార్యకలాపాలకు సిద్ధమవుతోందని.. వాటిని ఎవరికీ తెలియనీయకుండా రహస్యంగా దాచిపెడుతోందని బిల్ నెల్సన్ అంటున్నారు.
చంద్రుడిపైకి చైనా ముందుగా వెళ్తే.. ఇది తమ ప్రాంతం అని.. మిగతా వారికి ఇక్కడ కాలు పెట్టడం కుదరదని అంటోందని బిల్ నెల్సన్ చెబుతున్నారు. అందుకే చంద్రుడిపై అమెరికా కార్యకలాపాలు విస్తృతం కావాలని ఆయన తమ చట్ట సభ సభ్యులకు వివరించారు. వచ్చే సంవత్సరానికి సంబంధించి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా)కు బడ్జెట్ కేటాయింపుల అంశంలో భాగంగా అమెరికా ప్రతినిధుల సభకు చెందిన కమిటీకి బిల్ నెల్సన్ వివరణ ఇచ్చారు. దానిలో భాగంగానే చైనా కార్యక్రమాల పట్ల తన ఆందోళనలను వెలిబుచ్చారు.
గత పదేళ్లుగా అంతరిక్ష రంగంలో చైనా అద్భుతమైన ప్రగతిని సాధించిందని.. ఈ నేపథ్యంలో చైనాను తక్కువ అంచనా వేస్తే మొదటికే మోసం వస్తుందని బిల్ నెల్సన్ చెబుతున్నారు. ప్రజలకు సంబంధించిన విషయాలపైన అని చెబుతూ చైనా సైనిక కార్యకలాపాలను చంద్రుడిపైన చేపడుతోందని ఆయన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇందుకోసం ప్రపంచంలో ఏ దేశం చేయనంత వ్యయాన్ని చైనా చేస్తోందని పేర్కొంటున్నారు.
కాగా చంద్రుడిపై శాశ్వత నివాసాలను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా నాసా ఆర్టెమిస్ ప్రాజెక్టును చేపట్టిన సంగతి తెలిసిందే. దీని ద్వారా చంద్రుడిపైకి మనుషులను పంపనుంది. ఇప్పటికే ఆర్టెమిస్–1ను అంతరిక్షంలోకి పంపింది. రానున్న రోజుల్లో ఆర్టెమిస్–2, 3లను ప్రయోగించడానికి ఏర్పాట్లు చేస్తోంది.