లద్దాఖ్ పై లొల్లి.. అరుణాచల్ పై పేచీ.. చైనా దొంగాట
వాస్తవానికి ఇప్పుడున్న చైనా భౌగోళిక స్వరూపంలో చాలావరకు ఆక్రమిత ప్రాంతాలతో కూడుకున్నదే. టిబెట్ ఒకనాడు స్వతంత్ర దేశం
By: Tupaki Desk | 31 Aug 2023 11:25 AM GMT''హిందీ చీనీ బాయి బాయి..'' అంటే వెన్నుపోటు పొడించింది.. కొవిడ్ కు కారణమని ప్రపంచం అంతా నిందిస్తుంటే లద్దాఖ్ లో కాలుదువ్వి సమస్యను పక్కదారి పట్టించాలని చూసింది.. తరచూ అరుణాచల్ మాదేనంటూ పేచీకి దిగుతోంది. ఇదంతా జగడాల మారి చైనా గురించి.. అసలు చైనా అంటేనే పేచీకోరు. దాని పక్కన ఏ దేశం ఉన్నా ఆక్రమణ బారినపడాల్సిందే. అది భారత్ వంటి పెద్ద దేశమైనా.. భూటాన్ వంటి బుల్లి దేశమైనా..? చైనా డ్రాగన్ కోరలు ఎక్కడివరకు విస్తరించాయంటే.. పాకిస్థాన్ శ్రీలంక వరకు పాకాయి.
నెహ్రూకు మనో వ్యథ మిగిల్చి..
భారత తొలి ప్రధాని నెహ్రూకు తీవ్ర మనో వ్యథ మిగిల్చి ఆయన మరణానికి కారణమైన దేశం చైనా. హిందీ చీనీ బాయి బాయి అని నినాదం ఇచ్చిన నెహ్రూ.. అదే సోదర దేశం ఆక్రమణకు దిగడాన్ని, దాని చేతిలో యుద్ధంలో ఓడడాన్ని తట్టుకోలేకపోయారు. 60 ఏళ్ల కిందటే దాని బుద్ధి బయటపడింది.
మళ్లీ ఇప్పుడు
దాదాపు 70 ఏళ్ల కిందట టిబెట్ బౌద్ధ గురువు దలైలామాకు భారత్ ఆశ్రయం ఇచ్చినందుకు అక్రోశం పెంచుకున్న చైనా లద్దాఖ్ లో యుద్ధానికి దిగి అక్సాయ్ చిన్ ను ఆక్రమించింది. ఇప్పుడు జి-20 వంటి శిఖరాగ్ర సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇవ్వనున్న సమయంలో అరుణాచల్ ప్రదేశ్ తమదేనంటూ కయ్యానికి కాలుదువ్వుతోంది.
చైనాదంతా 'పటా'టోపమే..
వాస్తవానికి ఇప్పుడున్న చైనా భౌగోళిక స్వరూపంలో చాలావరకు ఆక్రమిత ప్రాంతాలతో కూడుకున్నదే. టిబెట్ ఒకనాడు స్వతంత్ర దేశం. అక్సాయ్ చిన్ మన లద్దాఖ్ లోనిది. ఇవే కాదు.. జపాన్, దక్షిణ కొరియా, భూటాన్, నేపాల్, ఫిలిప్పీన్స్ భూమినీ చైనా కబళించిందనే వాదన ఉంది. ఒకప్పుడు సొంత దేశంగా ఉన్న టిబెట్ ను కలిపేసుకుని బౌద్ధ గురువు దలైలామాను బంధించాలని చూసింది. మన అరుణాచల్ ప్రదేశ్ పైనా డ్రాగన్ కన్నేసింది.పేర్లు మార్చి తమ భూభాగం అని చెబుతోంది.
అరుణాచల్ ఎందుకంటే..?
ఈశాన్య భారతంలో కీలక రాష్ట్రం అరుణాచల్. దీనికి టిబెట్, మయన్మార్, భూటాన్ దేశాలతో సరిహద్దులున్నాయి. అంతేకాదు.. మొత్తం ఏడు ఈశాన్య రాష్ట్రాలకు పెద్ద దిక్కు. చైనా తమది అని ప్రకటించే తైవాన్ భూభాగానికి అరుణాచల్ మూడు రెట్లు పెద్దది. అందుకనే దక్షిణ టిబెట్ అని పేర్కొంటూ తమ భాష మాండరిన్ లో జంగ్నామ్ అని పేరు పెటింది. వాస్తవానికి మొత్తం అరుణాచల్ కంటే.. తవాంగ్ జిల్లాపైనే చైనా ఎక్కువగా కన్నేసింది. ఆ రాష్ట్రంలో నైరుతి దిక్కునుండే తవాండ్ కు భూటాన్, టిబెట్ తో సరిహద్దులున్నాయి. అంటే భౌగోళికంగా కీలకం. ఈశాన్య భారతంలోకి అడుగుపెట్టడానికి.. టిబెట్ తో పాటు, బ్రహ్మపుత్ర లోయ మధ్యన ఇది కీలకం. అందుకనే అక్కడి గాండెన్ బౌద్ధారామంను చూపించి అరుణాచల్ తమదే అంటోంది. టిబెట్ లోని బౌద్ధారామం తర్వాత తవాంగ్ గాండెన్ అతి పెద్దది. 1680లో దీన్ని ఐదో దలైలామా కోరిక మేరకు నిర్మించారు. టిబెట్ ఆరామానికి, తవాంగ్ కు మధ్య సంబంధాలున్నాయి. అయితే, అసలు టిబెట్టే చైనాది కానప్పుడు అరుణాచల్ లోని తవాంగ్ దానిది ఎలా అవుతుందన్నది ప్రశ్న.
వాస్తవాధీన రేఖను కాదని..
టిబెట్ ను చైనా 1950లలో కబళించింది. బ్రిటీష్ వారి హయాంలో 1914లోనే భారత్ , టిబెట్, చైనా మధ్య వాస్తవాధీన రేఖ (ఎల్ ఏసీ) నిర్ణయమైంది. దీనిని చైనా ఒప్పుకొంది. కానీ, భారత్ స్వాతంత్ర్యం పొందిన తొలినాళ్లలో అటు చైనాలో 1949లో కమ్యూనిస్టు పార్టీ అధికారంలోకి వచ్చాక ఎల్ ఏసీని గుర్తించటానికి నిరాకరిస్తోంది. అరుణాచల్ ను తమ పురాతన పట్టణంగా కూడా పేర్కొంటోంది.
ఆ కసి ఇప్పుడు..?
అణచివేత నేపథ్యంలో దలైలామా 1959లో టిబెట్ మీదుగా తవాంగ్ ద్వారా భారత్ లోకి వచ్చారు. తవాంగ్ లో టిబెట్ బుద్ధిజాన్ని పాటించే వారు తమకు ఎప్పటికైనా ముప్పని చైనా భావిస్తోంది. వీరు ప్రజాస్వామ్య ఉద్యమం ఆరంభిస్తాయన్నది దాని అనుమానం. దీంతోపాటు భారత్ పై ఎప్పుడైనా దాడి చేయాలంటూ అరుణాచల్ ముఖ్యం. ఇప్పటికే ఎగువన అనేక నీటి పారుదల ప్రాజెక్టులు కట్టిన చైనా నీటిని నియంత్రిస్తోంది. దీనికితోడు సైన్యం-తమ పౌరుల మధ్య సమన్వయానికి ల్యాండ్ బోర్డర్ లా పేరిట 2022లో కొత్త చట్టం తీసుకొచ్చింది.