Begin typing your search above and press return to search.

ఇండియా పేరు మార్పుపై అక్కసు వెల్లగక్కిన చైనా... కీలక వ్యాఖ్యలు!

ఇదే సమయంలో... పేరు కంటే ఇతర ముఖ్య విషయాలపై దృష్టి సారించాలని చైనా ప్రభుత్వ అధికారిక పత్రిక "గ్లోబల్‌ టైమ్స్‌" తాజా కథనంలో వెల్లడించడం గమనార్హం.

By:  Tupaki Desk   |   7 Sep 2023 1:44 PM GMT
ఇండియా పేరు మార్పుపై  అక్కసు వెల్లగక్కిన చైనా... కీలక వ్యాఖ్యలు!
X

ప్రస్తుతం దేశవ్యాప్తంగా "భారత్" పేరు మార్పుపై తీవ్ర చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నిర్ణయాన్ని పలువురు ఆక్షేపిసుండగా.. మరికొంతమంది సమర్దిస్తున్నారు. ఈ క్రమంలో త్వరలో జీ20 సమావేశాలు కూడా ఉండటంతో ఈ పేరు మార్పుపై దేశం ఆవల కూడా చర్చ జరుగుతుందని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో చైనా స్పందించింది.

అవును... భారత్‌ పేరు మార్పు విషయంపై దేశంలో తీవ్ర చర్చ జరుగుతుండగా.. అటు చైనా ఈ అంశంపై స్పందించింది. అంతర్జాతీయంగా ప్రభావాన్ని పెంచుకునేందుకు జీ20 వేదికను అవకాశంగా మార్చుకోవాలని భారత్‌ కోరుకుంటోందని పేర్కొంది. దీంతో... చైనా తన అక్కసు వెల్లగక్కుతుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఇదే సమయంలో... పేరు కంటే ఇతర ముఖ్య విషయాలపై దృష్టి సారించాలని చైనా ప్రభుత్వ అధికారిక పత్రిక "గ్లోబల్‌ టైమ్స్‌" తాజా కథనంలో వెల్లడించడం గమనార్హం. ఈ కథనంలో మరిన్ని కీలక విషయాలు ప్రస్థావించిన గ్లోబల్ టైమ్స్‌... విప్లవాత్మక సంస్కరణలు లేకుండా.. భారత్‌ విప్లవాత్మక అభివృద్ధిని సాధించలేదని తెలిపింది.

మరోపక్క పెరుగుతున్న అంతర్జాతీయ దృష్టిని భారత్‌ సద్వినియోగం చేసుకొని.. అభివృద్ధికి చోదక శక్తిగా మార్చుకోగలదని కాంక్షిస్తున్నట్లు పేర్కొంది. ఇదే సమయంలో జీ20 సదస్సులో ప్రపంచానికి ఏం చెప్పాలనుకుంటోందని ప్రశ్నించిన చైనా... కేవలం వలసవాదంగా భావిస్తున్న పేరును తొలగించే ప్రయత్నంగా కనిపిస్తోందని ఆ కథనంలో పేర్కొంది.

ఇండియా పేరు మార్పుపై ఐరాస:

ఇండియా అనే పేరును భారత్‌ గా మారబోతోందంటూ జరుగుతున్న ఊహాగానాలపై విస్త్రృత స్థాయిలో చర్చ నడుస్తున్న వేళ ఐక్యరాజ్య సమితి (ఐరాస) స్పందించింది. అలాంటి విజ్ఞప్తి ఏదైనా తమ వరకూ వస్తే తప్పకుండా పరిశీలిస్తామని తెలిపింది. ఈ విషయాలపై తాజాగా ఐరాస సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెర్రస్‌ ఉపప్రతినిధి ఫర్హాన్‌ హక్‌ స్పందించారు.

చివరిసారిగా టర్కీ దేశం తుర్కీయేగా తమ పేరును మార్చాలని ఐక్యరాజ్య సమితికి విజ్ఞప్తి పెట్టుకుందని.. అదేవిధంగా ఇండియా కూడా అలాంటి విజ్ఞప్తి ఏదైనా చేస్తే తప్పకుండా పరిశీలిస్తామని.. ఇండియా మాత్రమే కాదు ఏ దేశం అలా రిక్వెస్ట్‌ పంపినా పరిగణలోకి తీసుకుని పరిశీలిస్తామని హక్‌ తెలిపారు.

కాగా.... ఈనెల 9-10 తేదీల్లో ఢిల్లీలో జరగబోయే జీ20 సదస్సు సందర్భంగా ఏర్పాటు చేసిన ఆహ్వానపత్రికల్లో "ప్రెసిడెంట్‌ ఆఫ్‌ ఇండియా"కు బదులుగా "ప్రెసిడెంట్‌ ఆఫ్‌ భారత్‌" అని ఉన్న సంగతి తెలిసిందే. దీంతో ఇవి ఒంటెద్దు పోకడలు అంటూ కాంగ్రెస్‌ తీవ్ర స్థాయిలో కేంద్రంపై విరుచుకుపడుతోంది.