కొత్త సమస్య... జనాభా విలువ చైనా కంటే బాగా ఎవరికి తెలుసు?
ఒకానొక సమయంలో భారత్ లో ఇద్దరు పిల్లలు ముద్దు, ముగ్గురు వద్దు అనేవారు! అనంతర కాలంలో... ఒక్కరు ముద్దు ఇద్దరు వద్దు అని అంటున్నారు
By: Tupaki Desk | 19 Jan 2024 5:52 AM GMTఒకానొక సమయంలో భారత్ లో ఇద్దరు పిల్లలు ముద్దు, ముగ్గురు వద్దు అనేవారు! అనంతర కాలంలో... ఒక్కరు ముద్దు ఇద్దరు వద్దు అని అంటున్నారు. ఈ సమయంలో అత్యంత ఎక్కువ యువత ఉన్న దేశంగా భారత్ మారుతుంది.. ఈ ఊపులో అభివృద్ధి చెందుతున్న కాకుండా.. అభివృద్ధి చెందిన దేశంగా త్వరలో మారబోతుందని చెబుతున్నారు. మారాలని కోరుకుంటున్నారు. ఈ సమయంలో చైనాకు ఇప్పుడు కొత్త కష్టమొచ్చింది.. జనాభా తగ్గిపోతుంది!
అవును... ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా దశాబ్దాల పాటు కొనసాగిన డ్రాగన్ కంట్రీ చైనాకు ఇప్పుడు అతిపెద్ద కష్టం వచ్చి పడింది! నిన్నమొన్నటివరకూ ఆ దేశానికి బలంగా ఉన్న జనాభా.. ఇప్పుడు మెల్లమెల్లగా తగ్గిపోతుంది. పిల్లలను కనడానికి దంపతులు ముందుకురాకపోవడంతో సమస్య మరింత పెరిగే అవకాశాలున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తుంది.
ప్రస్తుతం చైనా యువత పెళ్లి అనంతరం పిల్లలను కనడానికి ఏమాత్రం ఆసక్తి చూపించడం లేదని చెబుతున్నారు. అసలు వివాహ జీవితంలో అడుగు పెట్టడానికే ఆసక్తి కనబరచడం లేదని అంటున్నారు. ఇందులో భాగంగా ప్రధానంగా... కరోనా అనంతరం చైనా ప్రజానికం పిల్లలను కనే విషయంలో దాటవేత దోరణి అవలంభిస్తుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
వాస్తవానికి 2023లోనే చైనా జనాభా రెండు మిలియన్లు తగ్గిపోయిందని ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. 2022 లో కూడా ఈ తగ్గుదల బలంగానే ఉంది. మరోపక్క గత ఏడేళ్లుగా జననాల రేటు తగ్గిపోతుండటంతోపాటు కోవిడ్ తర్వాత మరణాల రేటు పెరుగుతోంది. ఫలితంగా మొత్తం జనాభా గతేడాది సుమారు 20 లక్షల మేర తగ్గిపోయినట్లు చైనా ప్రభుత్వం విశ్లేషించింది.
దీంతో జనాభా రేటు పెంచేందుకు సరికొత్త పథకాలను ప్రవేశ పెడుతుంది. కొత్తగా వివాహం అయిన దంపతులకు ముగ్గురు వరకూ పిల్లల్ని కనాలని కోరుతుందని తెలుస్తుంది. అయినప్పటికీ పిల్లలను కనే విషయంలో చైనాలోని దంపతులు ఆసక్తి చూపించడం లేదని అంటున్నారు.
ఇదే క్రమంలో... చైనాలో గతేడాది వార్షిక మరణాల సంఖ్య 6.9 లక్షల నుంచి దాదాపు రెట్టింపు స్థితికి చేరుకుంది. అందులో భాగంగా గతేడాది మరణాల సంఖ్య సుమారు 1 కోటీ 11 లక్షలకు చేరిపోయిందని ఘణాంకాలు చెబుతున్నాయి. మరోపక్క ఆ దేశ జనాభాలో వృద్ధుల సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతుందని.. కోవిడ్ వ్యాప్తి ఆ దేశ జనాభాపై తీవ్ర ప్రభావం చూపుతుందని అంటున్నారు.
గతేడాది మరణాల సంఖ్య అలా కోటీ పదకొండు లక్షలు ఉండాగా... అదే ఏడాది జననాల సంఖ్య మాత్రం సుమారు 5.4 లక్షలు తగ్గిపోయిందని తెలుస్తుంది. అంటే... గతేడాది చైనాలో మొత్తం 9 లక్షల పిల్లలు మాత్రమే పుట్టారట. దీంతో... జనాభా విషయంలో చైనా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుంది. పిల్లలను కనాలని దంపతులను కోరుతుంది.
కాగా... ప్రస్తుతం చైనా జనాభా 140 కోట్లుగా ఉందని గణాంకాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో గతేడాది భారత్ ఈ మార్క్ ను దాటేసి ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా అవతరించింది. అయితే... నాటి నుంచి చైనాలో జననాల రేటు ఆశించినంతగా పెరగకపోగా.. మరణాల సంఖ్య పెరుగుతోంది. దీంతో డ్రాగన్ కంట్రీకి ఇప్పుడు ఇది పెను సవాలుగా మారింది.