అమాంతం అడ్డుకుని..తలుపులు మూసేసి.. దేశాధ్యక్షుడి సెక్యూరిటీకే కష్టాలు..
ఆయన మామూలుగానే శక్తిమంతమైన నేత. ఇటీవల మరింత శక్తిమంతం అయ్యారు.. రేపోమాపో ప్రపంచ నంబర్ వన్ కాబోయే చాన్సున్న దేశానికి అధినేత.
By: Tupaki Desk | 25 Aug 2023 8:08 AM GMTఆయన మామూలుగానే శక్తిమంతమైన నేత. ఇటీవల మరింత శక్తిమంతం అయ్యారు.. రేపోమాపో ప్రపంచ నంబర్ వన్ కాబోయే చాన్సున్న దేశానికి అధినేత. మూడేళ్లుగా ఆ దేశం పేరు మరింత వివాదాస్పదమైంది. అందులోనూ వారి దేశంలో ఇటీవల ఆయనపైనే పెద్ద కుట్ర జరిగినట్లు కథనాలు వచ్చాయి. ఇలాంటి నేపథ్యంలోనే ఆయన ఎక్కడకు వెళ్లినా అది చర్చనీయాంశమే. కట్టుదిట్టమైన రక్షణ మధ్య కానీ అడుగు వేయలేని పరిస్థితి. అలాంటి అధినేతకు ఊహించని పరిణామం ఎదురైంది.
బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌతాఫ్రికా.. ఇవీ బ్రిక్స్ దేశాలు. ఆయా దేశాల పేరులోని మొదటి అక్షరాన్ని కలిపి ఈ కూటమికి పేరు పెట్టారు. జి-7 దేశాలకు పోటీగానా అన్నట్లు ఈ కూటమి ఎదుగుతోంది. అందులోనూ రష్యా, భారత్, చైనా అంటే మిగతా పాశ్చాత్య దేశాలకు ఎలాగూ కాస్త పోటీనే. కాగా, నిన్నటివరకు దక్షిణాఫ్రికాలో బ్రిక్స్ సదస్సు జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ కు ఊహించని పరిస్థితి ఎదురైంది. సదస్సుకు వెళ్తున్న ఆయన సహాయకుడిని భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు.
వెంట వస్తున్నవారు కనిపించక..
బ్రిక్స్ లో పలు అంశాలపై సదస్సులు జరిగాయి. ఇలా సదస్సుకు వెళ్తున్న క్రమంలో జిన్ పింగ్ కు ఊహించని పరిస్థితి ఎదురైంది. సహజంగా దేశాధ్యక్షుడు ఎక్కడికి వెళ్లినా భారీ బందోబస్తు ఉంటుంది. రక్షణ సిబ్బంది ఒక దశ వరకు వచ్చినా.. కీలకమైన నాయకులు/ దేశాల అధినేతలు పాల్గొనే సమావేశాల వేదిక వద్దకు సహాయకులను అనుమతిస్తారు.
ఇలానే జిన్ పింగ్ వెంట బ్రిక్స్ సదస్సుకు వెళ్తున్న సహాయకుడిని భద్రతా సిబ్బంది బలవంతంగా అడ్డుకున్నారు. జిన్ పింగ్ ముందు నడుస్తుండగా ఆయనకు కొద్దిగా వెనుక సహాయకుడు వస్తున్నాడు. పింగ్ సదస్సు గదిలోకి వెళ్లాక అతడూ ప్రవేశించే సమయంలో భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. అంతేగాక ఆ సహాయకుడు ఉరుకుతూ వస్తుండడంతో వారికి అనుమానం వచ్చినట్లుంది. దీంతోనే ముందుకు సాగకుండా బలవంతంగా చేతులు అడ్డుపెట్టారు. ఆపై తలుపులు కూడా మూసేశారు.
వెనుక ఏం జరుగుతుందో చూసుకోలే
యథాలాపంగా సదస్సు హాల్ లోకి వెళ్లి జిన్ పింగ్.. తన వెనుక ఏం జరుగుతోందో చూసుకోలేదు. హాలులోకి వచ్చాక తిరిగి చూస్తే వెనుక సహాయకుడు లేడు. అప్పటికీ.. నాలుగు అడుగులు వేశాక రెండోసారి కూడా జిన్ పింగ్ ఆగి మళ్లీ వెనక్కు చూశారు. అయినా ఏం జరుగుతోందో తెలియక కొద్దిసేపు అయోమయానికి గురయ్యారు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతోంది. మొత్తానికి పరిస్థితిని గమనించిన జిన్ పింగ్ కాస్త ఇబ్బందిగానే ముందుకెళ్లినట్టు కనిపించింది. తప్పదన్నట్లు నడుస్తూ ముందుకు వెళ్లిపోయారు. అయితే, చైనా ప్రతినిధిని ఎందుకు అడ్డుకున్నారన్నది తెలియరాలేదు.