ఈ సారి ఈ రెండు దేశాల మధ్య యుద్ధం తప్పదా?
అప్పుడే చైనా – తైవాన్ యుద్ధం తప్పదని అందరూ అంచనాకొచ్చేశారు. అయితే అప్పట్లో తృటిలో ఈ విపత్తు తప్పిపోయింది.
By: Tupaki Desk | 19 Aug 2023 2:23 PM GMTఇప్పటికే రష్యా– ఉక్రెయిన్ యుద్ధం, ఉత్తర కొరియా అణ్వస్త్ర, క్షిపణి పరీక్షలతో ప్రపంచానికి కంటి మీద కునుకు ఉండటం లేదు. ఇప్పుడు పులి మీద పుట్రలా చైనా.. తైవాన్ పై దాడికి తెగబడటానికి ఏర్పాట్లు చేసుకుంటుండటం కలకలం రేపుతోంది. తైవాన్ తమ దేశంలో భాగమేనని బలంగా విశ్వసిస్తున్న చైనా.. దాన్ని దేశంగా గుర్తించడం లేదు. తమ 'ఒకే చైనా' విధానానికి అంగీకరించని దేశాలపై కస్సుమంటూనే ఉంది.
ఇప్పుడు ఇదే కోవలో మరోసారి చైనా ఒక్కసారిగా ఉద్రిక్తతలను పెంచేసింది. తైవాన్ ఉపాధ్యక్షుడు విలియం లాయ్ చెంగ్–తె పరాగ్వే పర్యటనకు వెళ్లొస్తూ దారి మధ్యలో అమెరికాలో ఆగడమే ఇందుకు కారణం. తైవాన్ చర్యపై అగ్గి మీద గుగ్గిలమైన చైనా.. తైవాన్ ద్వీపం చుట్టూ సైనిక్ డ్రిల్స్ నిర్వహించింది. వేర్పాటువాదులు, విదేశీ శక్తులు తమను కవ్విస్తున్నారని.. అందుకే ఈ సైనిక డ్రిల్స్ చేపట్టామని చైనా రక్షణ మంత్రి తమ చర్యను సమర్థించుకున్నారు.
గతంలోనూ అమెరికా చట్ట సభల స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్ లో పర్యటించడంపై చైనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తైవాన్ పైకి యుద్ధ విమానాలు, ఫైటర్ జెట్లు, క్షిపణులను మోహరించింది. మరోవైపు అమెరికాను కూడా తీవ్రంగా హెచ్చరించింది. చైనా అంతర్గత విషయాల్లో తలదూరిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని పేర్కొంది. అప్పుడే చైనా – తైవాన్ యుద్ధం తప్పదని అందరూ అంచనాకొచ్చేశారు. అయితే అప్పట్లో తృటిలో ఈ విపత్తు తప్పిపోయింది.
మరోవైపు శాశ్వత స్వతంత్ర దేశంగా ప్రకటించుకునేందుకు ప్రయత్నిస్తున్న తైవాన్.. పశ్చిమ దేశాలతో తమ దౌత్యబంధాన్ని బలోపేతం చేసుకోవాలని చూస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవల పరాగ్వే పర్యటనకు వెళ్లిన తైవాన్ ఉపాధ్యక్షుడు విలియం లాయ్.. మధ్యలో అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో, న్యూయార్క్ నగరాల్లో కొంత సమయం ఆగారు. అంతేకాకుండా అమెరికా మీడియా సంస్థ బ్లూమ్ బర్గ్‌కు ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. ఈ క్రమంలో 'తైవాన్ ఒక స్వతంత్ర దేశం' అని చెప్పారు.
తైవాన్ ఉపాధ్యక్షుడి వ్యాఖ్యలతో చైనా ఆగ్రహంతో నిప్పులు కక్కింది. తైవాన్ ద్వీపం తమ దేశంలోని భాగమని చెబుతున్న చైనా.. లాయ్ పరాగ్వే, అమెరికా పర్యటనలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది పూర్తిగా అమెరికా, అది చెప్పినట్టు ఆడుతున్న తైవాన్ అధికారిక డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ కలిసి చేస్తున్న రెచ్చగొట్టే చర్యగా అభివర్ణించింది. తమ భూభాగంలోని ప్రాంతాలకు విదేశాలతో సంబంధాలు నెరిపే హక్కు ఏమాత్రం లేదని చైనా తేల్చిచెప్పింది.
ఈ క్రమంలోనే తైవాన్ చుట్టూ సైనిక విన్యాసాలకు చైనా తెరతీసింది. సైనిక బోట్లు, యుద్ధ విమానాలను మోహరించింది. ఈ బోట్లు క్షిపణులను మోయగలవని చైనా చెబుతోంది. మరోవైపు చైనా సైనిక విన్యాసాలపై తైవాన్ మండిపడింది. చైనాకు చెందిన 42 యుద్ధ విమానాలు తమ గగనతలంలోకి చొచ్చుకొచ్చాయని ఆరోపించింది. 26 యుద్ధ విమానాలు తైవాన్ జలసంధి మధ్య లైన్ ను దాటుకొని వచ్చాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది పూర్తిగా తమను రెచ్చగొట్టే చర్యగా పేర్కొంది. చైనా సైన్యం నుంచి ముప్పును ఎదుర్కొనేందుకు, తమ స్వతంత్రతను కాపాడుకునేందుకు సదా సిద్ధంగా ఉన్నామని వెల్లడించింది. చైనా సైనిక విన్యాసాలకు పోటీగా తమ బలగాలను మోహరించామని పేర్కొంది.