అలెర్ట్ అంటున్న కేంద్రం : చైనాలో కొత్త వైరస్... మరో కరోనా....?
కరోనా మహమ్మారి అంటేనే జనాలకు నిలువెల్లా వణుకు పుడుతుంది. ఉన్న వారిని ఉన్నఫళంగా తీసుకుని పోయిన విష పిశాచి ఆ వైరస్
By: Tupaki Desk | 26 Nov 2023 3:54 PM GMTకరోనా మహమ్మారి అంటేనే జనాలకు నిలువెల్లా వణుకు పుడుతుంది. ఉన్న వారిని ఉన్నఫళంగా తీసుకుని పోయిన విష పిశాచి ఆ వైరస్. అందుకే నాలుగేళ్లు గడచినా కరోనా అన్న మూడు అక్షరాలు వింటే చాలు జనాల గుండెలలో రైళ్ళు పరగెడతాయి. అందుకే వైరస్ అన్న చెవిన పడితే కలవరపడతారు.
ఇదిలా ఉంటే చైనా వైరస్ లకు పుట్టిల్లుగా మారింది. పూటకో వైరస్ అక్కడ పుడుతూనే ఉంటుంది. అందులో డేంజరస్ గా ఉన్నవి ఎన్ని అంటే ఎవరూ ఏమీ చెప్పలేరు. ఆ మాటకు వస్తే కరోనాను కూడా లైట్ తీసుకున్నారు. కానీ అది మొత్తం భూగోళాన్నే అతలాకుతలం చేసింది. దాంతో చైనాలో కొత్త వైరస్ ఏది పుట్టుకుని వచ్చినా కూడా ఇతర దేశాలు అప్రమత్తం అవుతాయి.
పొరుగున ఉన్న భారత్ అయితే ఇంకా జాగ్రత్తగా ఉంటుంది. ఇపుడు అలాంటి పరిస్థితులే తలెత్తుతున్నాయి. చైనాలో కొత్త వైరస్ వ్యాప్తి చెందింది. ఇది చిన్న పిల్లల్లో శ్వాసకోశ వ్యాధిగా వస్తోంది. ఆ మీదట ప్రాణాంతకం అవుతోంది అని తెలుస్తోంది. కేవలం చిన్న పిల్లలలోనేనా లేక పెద్ద వారికి కూడా వ్యాపిస్తుందా అన్నది కూడా ఇంకా తేలలేదు కానీ దీనికి వేగంగా వ్యాపించే గుణం ఎక్కువగా ఉండడంతో భారత్ ఇపుడు అప్రమత్తం అయింది.
కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అయితే అలెర్ట్ అంటూ అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. కరోనా నాటి డైరెక్షన్స్ ని మార్గదర్శకాలని మరోమారు పూర్తిగా అనుసరించాలని సూచిస్తోంది. అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో బెడ్స్ తో పాటు మందులు ఇతర పరికరాలు రోగులను తట్టుకునే స్తోమతను కూడా సంపాదించుకోవాలని సూచించింది.
మరో వైపు చూస్తే చైనాలో వచ్చిన కొత్త వైరస్ చిన్నారులలో నిమోనియగా వ్యాప్తి చెందుతోంది. సహజంగా చలికాలంలో పెద్ద వాళ్ళల్లో వృద్ధులు జబ్బు పడిన వారిలో నిమోనియా రావడం సహజం. కానీ చైనాలో చిన్న పిల్లాలలో ఈ వ్యాధి రావడం మీదనే అంతా ఆలోచిస్తున్నారు. ఇది ఎటు తిరిగి ఎటు వైపుగా పరిణమిస్తుందో అన్న కలవరం కూడా పొరుగు దేశాలకు ఉంది.
ఎందుకంటే కరోనా ఒక చేదు అనుభవం కాబట్టి ఎవరికి వారు జాగ్రత్త పదుతున్నారు. ఇక ప్రపంచ దేశాలు కూడా చైనాలో వ్యాప్తి చెందుతున్న కొత్త వైరస్ ని గమనిస్తూ ఆందోళన చెందుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ అయితే ఈ కొత్త వైరస్ వివరాలను కూడా చైనా నుంచి కోరి మరీ నివేదికగా తెప్పించుకుంది.
అయితే భారత్ మాత్రం ఈ కొత్త వైరస్ గురించి నిశితంగా పరిశీలిస్తున్నామని ఎవరూ ఆందోళన చెందాల్సినది అయితే లేదని అంటోంది. అయితే అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం మాత్రం ఉందని అంటోంది. వివిధ రాష్ట్రాలు అందుబాటులో ఉన్న మానవ వనరులు, అలాగే అవసమైన మందులు, ఆక్సిజన్, యాంటీ బాడీస్, పీపీ ఈ టెస్ట్ కిట్లు వంటివి అందుబాటులో ఉంచుకోవాలని కోరింది. ఇక ఆక్సిజన్ ప్లాంట్లతో పాటు వెంటిలేటర్ల పనితీరుని కూడా అధ్యయనం చేయాలని కోరింది.
ఎప్పటికపుడు ఇన్ఫెక్షన్ వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని సూచించింది. ఇదిలా ఉంటే చైనాలోని నిమోనియా బాధితులలో కొత్త రకం వైరస్ అయితే ఏదీ కనుగొనబడలేదని చైనా అధికార పత్రిక రాసుకొచ్చింది. బీజింగ్ లియోనోంగ్ లో చేసిన పరీక్షల్లో ఈ విషయం తేటతెల్లమైంది అని కూడా వెల్లడించింది.
అయితే చైనా ఇస్తున్న సమాచారం ఎలా ఉన్నా ప్రపంచం మాత్రం కొత్త వైరస్ అందులో చైనా లో అంటేనే వణుకుతోంది. ఇక పొరుగుదేశం భారత్ కూడా ఎటువంటి పరిస్థితిని అయినా తట్టుకునేందుకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చూతోంది. మళ్లీ కరోనా భయాలు అయితే ఉన్నాయి. అవి నిజాలు కాకూడదనే అంతా గట్టిగా కోరుకుంటున్నారు.