Begin typing your search above and press return to search.

పెళ్లి చేసుకోకపోతే ఉద్యోగం తీసేస్తారా?... ఎక్కడైనా ఉందా ఇది?

ఆఫీసుకు సక్రమంగా రాకపోతేనో.. సరిగా పనిచేయకపోతేనో.. సంస్థ కష్టాల్లో, నష్టాల్లో ఉంటేనే ఉద్యోగాలు తీసేయడం తెలిసిందే.

By:  Tupaki Desk   |   26 Feb 2025 2:30 AM GMT
పెళ్లి చేసుకోకపోతే ఉద్యోగం తీసేస్తారా?... ఎక్కడైనా ఉందా ఇది?
X

ఆఫీసుకు సక్రమంగా రాకపోతేనో.. సరిగా పనిచేయకపోతేనో.. సంస్థ కష్టాల్లో, నష్టాల్లో ఉంటేనే ఉద్యోగాలు తీసేయడం తెలిసిందే. అయితే.. పెళ్లి చేసుకోకపోతే ఉద్యోగం తీసేస్తామని ఓ సంస్థ ప్రకటించింది. ఈ నిర్ణయం తీవ్ర వివాదాస్పదమైది. ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. ఈ సమయంలో వారి నుంచి కఠినమైన హెచ్చరికలు అందుకుంది ఓ సంస్థ!

అవును.... చైనాలోని షాన్డాంగ్ ప్రావిన్స్‌ కు చెందినటువంటి షుంటియన్ కెమికల్ గ్రూప్ అనే కంపెనీ రాబోయే సెప్టెంబర్ నెల లోపల పెళ్లి చేసుకోని ఉద్యోగులను తొలగిస్తామని ప్రకటించింది. అయితే... ఈ వివాదాస్పద నిర్ణయాన్ని తీసుకుని దేశ ఉన్నత అధికారులు నుండి కఠినమైన హెచ్చరికలు అందుకుంది.

వివరాల్లోకి వెళ్తే.... తాజాగా ఈ కంపెనీ ఒక వివాదాస్పద విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా... 28 నుండి 58 సంవత్సరాల వయస్సు ఉన్న పెళ్లికానివారు, విడాకులు పొందిన ఉద్యోగులు ఈ నిబంధన పరిధిలోకి వస్తారని ప్రకటించింది. అటువంటి వారు ఎవరైనా సెప్టెంబర్ వరకు పెళ్లి చేసుకోకపోతే ఉద్యోగం పోతుందని హెచ్చరించింది.

ఈ నిబంధనల ప్రకారం... మార్చి నాటికి పెళ్లి కాని వారు ఓ లెటర్ సమర్పించాల్సి ఉంటుంది. ఆ తర్వాత జూన్ నాటికి పెళ్లి కాని వారిని విశ్లేషణ ప్రక్రియకు గురిచేస్తారు, ఇక చివరకు సెప్టెంబర్ నాటికి పెళ్లి చేసుకోని వారు ఉద్యోగం కోల్పోవాల్సి ఉంటుంది. ఇకపోతే, కంపెనీ తన నిర్ణయాన్ని సమర్థించుకునేందుకు చైనాలోని సాంప్రదాయ విలువలను ప్రస్తావించింది.

ఇందులో భాగంగా... పెళ్లి చేయకపోవడం అనైతికం అని పేర్కొంటూ.. ప్రభుత్వం వివాహాలను ప్రోత్సహిస్తుంటే దానికి సహకరించకపోవడం దేశానికి వ్యతిరేకమని పేర్కొంది. దీంతో ఈ విషయం ఒక్కసారిగా వైరల్ గా మారింది. తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

స్థానిక మనవ వనరుల & సామాజిక భద్రతా శాఖ ఫిబ్రవరి 13న కంపెనీని తనిఖీ చేయగా.. అత్యితే... కేవలం ఒక రోజులోనే కంపెనీ ఈ పాలసీని ఉపసంహరించుకుంది. అలాగే, ఇప్పటి వరకు ఏ ఉద్యోగినీ పెళ్లి కారణంగా తొలగించలేదని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని కొందరు న్యాయ నిపుణులు అసంబద్ధమైనది, రాజ్యాంగ విరుద్ధమైనది అని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా స్పందించిన పీటింగ్ విశ్వవిద్యాలయ న్యాయ విభాగానికి చెందిన ప్రొఫెసర్ యాన్ టియాన్... పెళ్లి స్వేచ్ఛను తీవ్రంగా ఉల్లంఘిస్తోందని అభిప్రాయపడ్డారు. చైనా ఉద్యోగ చట్టాల ప్రకారం ఉద్యోగ నియామక ప్రక్రియలో వివాహ సంబంధిత ప్రశ్నలు అడగడం అనుమతించబడదు. అయితే.. చైనాలో పెళ్లిళ్ల సంఖ్య తగ్గిపోతున్న తరుణంలో ప్రాముఖ్యత సంతరించుకుంది.