Begin typing your search above and press return to search.

"కుర్చీ మడత" లోకి చినబాబు ఎంట్రీ... అతి సర్వత్ర వర్జయేత్!

ఆ సంగతి అలా ఉంటే... ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో "కుర్చీ మడత పెట్టి"న విమర్శలు పెరిగిపోతున్నాయి.

By:  Tupaki Desk   |   16 Feb 2024 12:35 PM GMT
కుర్చీ మడత లోకి చినబాబు ఎంట్రీ... అతి సర్వత్ర వర్జయేత్!
X

ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతుంది. ఈ సమయంలో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చేరుకుంటుంది. ఇదే సమయంలో ఎవరి స్థాయిలో వారు ప్రత్యర్థులపై విమర్శల బాణాలు ఎక్కిపెడుతున్నారు. అందులో కొన్ని నేరుగా వెళ్లి ప్రత్యర్థులకు దిగుతుంటే... మరికొన్ని మాత్రం అటు తిరిగి ఇటు తిరిగి వచ్చి ఎక్కుపెట్టిన వారికే దిగుతున్నాయని అంటున్నారు. ఆ సంగతి అలా ఉంటే... ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో "కుర్చీ మడత పెట్టి"న విమర్శలు పెరిగిపోతున్నాయి.

అవును... “వాలంటీర్లకు వందనం” సభలో ఏపీ సీఎం వైఎస్ జగన్... “చొక్కా చేతులు మడత బెట్టి రంగంలోకి దిగాలి” అని వైసీపీ క్యాడర్ ని కోరారు. అంటే... ఎన్నికల సంగ్రామంలోకి ఉత్సాహంగా పాలుపంచుకోవాలని కార్యకర్తలను కోరుతూ ఆ డైలాగ్ చెప్పారన్నమాట. దీంతో ఆ మాటలోని "మడత బెట్టి" అనే విషయాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకున్నారో ఏమో కానీ... "మీరు చొక్కా చేతులు మడత బెట్టి వస్తే మేము ఊరుకుంటామా.. టీడీపీ, జనసేన కార్యకర్తలు కుర్చీలు మడత పెట్టి వస్తారు" అంటూ చంద్రబాబు మాస్ డైలాగ్ పేల్చారు.

జగన్ చెప్పిన చొక్క చేతుల మడతలకు.. చంద్రబాబు చెప్పిన కుర్చీ మడతలకూ ఉన్న వ్యత్యాసం సగటు ఓటరుకు అర్ధం కానంత క్లిషటమైనదేమీ కాదు. కాకపోతే... ఇక్కడ హుందాతనం అనేది కీలకమైన పాయింట్. దీంతో... ప్రజలను ప్రసంగాలతోనూ, ఎన్నికల వేళ హామీలతోనూ, తాము గతంలో నెరవేర్చిన హామీల వివరాలను వెళ్లడించడంతోనూ ఆకట్టుకోవాల్సిన చోట... సినిమా డైలాగులు చెప్పుకుని కార్యకర్తల్లో క్షణికానందాన్ని నింపాల్సిన పరిస్థితికి నేతలు దిగిపోయారనే కామెంట్లు ఈ సందర్భంగా వినిపిస్తున్నాయి.

రాజకీయ నాయకుల మాటలు వీలైనంత హుందాగా ఉండాలి.. పైగా ముఖ్యమంత్రి స్థాయి అభ్యర్థులు, పార్టీ అధినేతల మాటలు అదుపుగా ఉండాలి అని అంటుంటారు. అయితే... ఇప్పుడు వయసు, అనుభవం, హుందాతనం పక్కనపెట్టి మరీ "మడత" డైలాగులతో రాజకీయాలు చేస్తున్నారనే కామెంట్లు బలంగా వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో ఇవి ఏమాత్రం ఆమోదయోగ్యం కాదనే కామెంట్లూ తదనుగుణంగా చక్కర్లు కొడుతున్నాయి.

ఇదంతా ఒకెత్తు.. ఒకసారితో అయిపోయిందిలే.. మాటకు మాట... అనుకుని సరిపెట్టుకునే లోపు చినబాబు ఎంట్రీ ఇచ్చారు. "అతి సర్వత్ర వర్జయేత్" అనే విషయాన్ని ఏమాత్రం పట్టించుకునే ప్రయత్నం కూడా చేయరనే కామెంట్ ను సొంతం చేసుకున్న నారా లోకేష్... తాజాగా నెల్లిమర్లలో జరిగిన “శంఖారావం” సభలో వేదికపై ఒక రేకు కుర్చీనే పెట్టుకున్నారు. వేదికపై ఆ కుర్చీని మడతబెట్టి మరీ కార్యకర్తలకూ, అభిమానులకూ చూపించారు. దీంతో.. అక్కడున్న కొంతమంది చప్పట్లు కొడుతూ కేకలు వేశారు.

దీంతో చినబాబు ఫుల్ హ్యాపీగా ఫీలయినట్లు కనిపించారు. అనంతరం తన ప్రసంగంలో భాగంగా... "మేము ఎవ్వరినీ వదిలిబెట్టం.. మా పసుపు సైనికులు, జనసైనికులు ఒక్కసారి చిటిక వేస్తే మీ కుర్చీ మడతబెట్టే బాధ్యత మేము తీసుకుంటాం" అని అన్నారు. అనంతరం... "జగన్ ని హెచ్చరిస్తున్నా... పొరపాటున కూడా మా జోలికి రావొద్దు. వస్తే... నీ కుర్చీ మడత బెట్టి.. నీకు సీటు లేకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటాం" అని మరో డైలాగ్ వేశారు.

ఈ మాటల వల్ల పార్టీకి, లోకేష్ కి, అక్కడ వింటున్న ప్రజానికానికి ఏమిటి ఉపయోగం అనే సంగతి కాసేపు పక్కనపెడితే... జగన్ ట్రాప్ లో టీడీపీ నేతలు పడుతున్నారా అనే చర్చ కూడా తెరపైకి వస్తుంది. “మీ బిడ్డ జగన్ వల్ల మేలు జరిగితేనే వైసీపీకి ఓటు వేయండి” అని జగన్ ప్రధానంగా ప్రచారం చేసుకుంటూ.. గ్యాప్ లో చిన్న చిన్న డైలాగులు వేస్తుంటే... తమ్ముళ్లు మాత్రం పూర్తిగా మాస్ డైలాగులు చెప్పుకుంటూ కాలం గడుపుతూ... ఓటర్లకు ఎమోషనల్ గా దగ్గరవ్వకుండా పోతున్నారనే చర్చ కూడా తెరపైకి వస్తుంది.

ఏది ఏమైనా... ఏపీ రాజకీయాల్లో.. ప్రధానంగా టీడీపీ సభల్లో ఇప్పుడు సోఫా, ప్లాస్టిక్ కుర్చీలతో పాటు ఒక రేకు కుర్చీని కూడా పెట్టబోతున్నారని మాత్రం స్పష్టం అవుతుంది! దాన్ని ఒకసారి మడతబెట్టి చూపిస్తూ కార్యకర్తల్లో ఉత్సాహం చూపించబోతున్నారని అభిప్రాయపడుతున్నారు పరిశీలకులు. మరి... నేతలను ప్రజలు కుర్చీ మడతబెట్టి వెంటాడే రోజు ప్రజాస్వామ్యంలో ఎప్పుడు వస్తుందో కదా అనే కామెంట్లు ఈ గ్యాప్ లో కొసమెరుపు!