అనన్నా చిన్నమ్మా.. ఏ మంటరేమంటిరి!
అంతేకాదు.. బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాల్లో వందల కోట్ల అవినీతికి కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్పడుతున్నారని పురందేశ్వరి ఆరోపించారు
By: Tupaki Desk | 10 Dec 2023 2:30 AM GMTరాజకీయ నాయకులు ఏం మాట్లాడినా ప్రజలు వినేస్తారులే అనుకుంటే పొరపాటే! ఎందుకంటే.. మునుప టిలా ప్రస్తుత రాజకీయాలు లేవు. వాటిని ఫాలో అయ్యేవారు.. చాలా సైలెంట్‌గా ఉన్నారు. తాజాగా బీజేపీ ఏపీ అధ్యక్షురాలు.. పురందేశ్వరి.. ఉరఫ్ చిన్నమ్మ చేసిన ఒకే ఒక్క కామెంట్ వైరల్‌గా మారింది. ``కాంగ్రెస్ అంటేనే అవినీతి పార్టీ. దానిని కూకటి వేళ్లతో పెకలించి వేయాలి`` అని పురందేశ్వరి వ్యాఖ్యానించారు.
అంతేకాదు.. బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాల్లో వందల కోట్ల అవినీతికి కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్పడుతున్నారని పురందేశ్వరి ఆరోపించారు. నాటు సారాతో కోట్ల సొమ్ము సంపాదిస్తున్నారని విమర్శ లు గుప్పించారు. ఇదంతా నల్లధనమే అన్నవిషయం ప్రజలకు అర్ధం అవుతోందన్నారు. ఛత్తీస్‌ఘడ్, ఒరిస్సా, జార్ఖండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ధీరజ్ సాహూ కుటుంబ సభ్యుల ఇళ్లపై జరుగుతున్న దాడుల్లో లెక్కకు మించిన నల్లధనం వెలుగు చూస్తున్నదంటే.. అది కాంగ్రెస్ అవినీతి వల్లేనన్నారు.
ఇక, పురందేశ్వరి చేసిన ఈ వ్యాఖ్యలపై నెటిజన్ల నుంచి ఆసక్తికర రియాక్షన్ వస్తోంది. గతం మరిచిపోయా రు మేడం అనికొందరు అంటే.. అనన్నా.. చిన్నమ్మా.. ఏమంటిరేమంటిరి? అని మరికొందరు ప్రశ్నించా రు. ఎందుకంటే.. గతంలో సుమారు 8 సంవత్సరాల పాటు.. పురందేశ్వరి.. ఏ అవినీతి పార్టీ అని ఆమె ముద్ర వేశారో.. అదే కాంగ్రెస్ లో కేంద్ర మంత్రిగా పనిచేశారు. కీలక నాయకురాలిగా ఎదిగారు. సోనియమ్మ దర్శనం కోసం గేటు దగ్గర వేచి ఉన్నారు. రాహుల్ అప్పాయింట్‌మెంట్ కోసం.. ఎదురు చూశారు. ఇదే విషయాలను ఇప్పుడు నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. మరి దీనిపై చిన్నమ్మ ఏమంటారో చూడాలి.