Begin typing your search above and press return to search.

జగన్ కి రెండో చాన్స్ ఉంటుందా... ఉండదా ?

అలా దానిని కనుక వర్తమాన ఆంధ్రా రాజకీయ మహాభారతానికి అప్లై చేస్తే జగన్ 2019 ఎన్నికల ముందు ప్రజలను ఒక్క చాన్స్ అని మాత్రమే అడిగారని అంతా గుర్తు చేస్తూంటారు.

By:  Tupaki Desk   |   1 Feb 2025 2:45 AM GMT
జగన్ కి రెండో చాన్స్ ఉంటుందా...  ఉండదా ?
X

మహాభారతంలో దుర్యోధనుడు పాండవులను ఉద్దేశించి ఒక మాట చెబుతారు. ద్రౌపది తన తండ్రిని వరాలు కోరినపుడు తన గురించి ఏమీ కోరలేదని అందువల్ల ఇప్పటికీ ఆమె తమకు దాసీనే అని లాజిక్ పాయింట్ చెబుతారు. అలా దానిని కనుక వర్తమాన ఆంధ్రా రాజకీయ మహాభారతానికి అప్లై చేస్తే జగన్ 2019 ఎన్నికల ముందు ప్రజలను ఒక్క చాన్స్ అని మాత్రమే అడిగారని అంతా గుర్తు చేస్తూంటారు.

ప్రజలు కూడా వైఎస్సార్ అబ్బాయి కాబట్టి ఒక్క చాన్స్ ఇస్తే పోలా అని ఇచ్చారని అలా ఆయన కోరినది జనం ఇచ్చినదీ రెండూ పూర్తి అయిపోయాయని అంటారు. ఇదే విషయం చంద్రబాబు అయిదేళ్ళ పాటు ప్రతిపక్షంలో ఉంటూ చెప్పుకొచ్చారు కూడా. జగన్ కి ఒక్క చాన్స్ ఇచ్చారు. ఇక ఆయనకు ఏమీ ఇచ్చేది లేదని బాబు ధాటీగా విపక్షంలో ఉన్నపుడు ప్రచారం చేసేవారు. అదే జనం మాట కూడా అయింది. అందుకే వరసగా జగన్ రెండోసారి అధికారంలోకి రాలేకపోయారు అని కూడా ఉంది.

ఇదిలా ఉంటే తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ వైసీపీ మీద జగన్ రాజకీయ భవిష్యత్తు మీద కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ జగన్ కేవలం ఒక్క చాన్స్ మాత్రమే అడిగారు ప్రజలు ఇచ్చారు అని గుర్తు చేశారు. ఇపుడు ఆయన రెండవ చాన్స్ అడిగినా జనాలు ఇవ్వరని ఆయన క్లారిటీగా చెప్పేశారు. ఏపీలో రాజకీయ పరిణామాలు చూస్తే కనుక జగన్ బలపడే అవకాశాలు ఎంతమాత్రం లేవని చింతా మోహన్ తనదైన శైలిలో విశ్లేషించారు. ప్రజలు మరోసారి జగన్ కి అధికారం ఇచ్చేది కల్ల అని ఆయన తనదైన రాజకీయ జోస్యం చెప్పారు.

అంటే జగన్ విషయంలో ప్రజలకు అన్నీ అర్ధం అయ్యాయని ఇక ఆయనను మళ్ళీ నెత్తికెక్కించుకోరు అన్నది ఈ కాంగ్రెస్ సీనియర్ నేత చెబుతున్న దాని భావమా అన్న చర్చ సాగుతోంది. మరో వైపు చూస్తే జగన్ పాలన మీద జనాలకు మోజు అన్నది తీరిపోయింది అని అంటున్న వారూ ఉన్నారు.

దానికి ఎన్నో ఉదంతాలు చెబుతున్నారు 2014లో వైసీపీ ఓటమి పాలు అయినా జగన్ క్రేజ్ అయితే తగ్గలేదు. దానికి కారణం ఆయన అధికారంలోకి వస్తే ఏమి చేస్తారో అన్న ఉత్కంఠ అలా కంటిన్యూ కావడమే అని అంటున్నారు. అదే జగన్ 2024లో ఓడి మాజీ సీఎం అయినా తొమ్మిది నెలలుగా వైసీపీలో పొలిటికల్ యాక్టివిటీ అయితే పెరగలేదు అని గుర్తు చేసేవారూ ఉన్నారు.

నిజానికి ఇపుడే జగన్ కి పెను సవాల్ అని అంటున్నారు. ఎందుకంటే జగన్ పాలన ఏమిటో జనాలు చూశారు. దానిని ఎంత మంది నచ్చుకున్నారు ఎంతమంది నచ్చుకోలేదు అన్నది ఎన్నికల్లో తీర్పుగా వెలువడింది. అయితే నలభై శాతం ఓటు షేర్ అయితే వైసీపీకి వచ్చింది. అక్కడే వైసీపీ ఆశలు కూడా ఉన్నాయి. ఏపీలో రాజకీయ చైతన్యం బాగా పెరిగింది. పార్టీలు కూడా ఎక్కువ అయ్యాయి.

అధికారం కోసం భీకర పోరాటం ప్రతీసారి సాగుతోంది. దాంతో గతంలో మాదిరిగా నలభై అయిదు శాతం గా కాకుండా యాభై శాతం ఓటు షేర్ ఏ పార్టీ సాధిస్తే వారిదే అధికారంగా ఉంది. మరి వైసీపీ ఇపుడున్న ఓటు షేర్ ని గట్టిగా పదిలం చేసుకుంటూ మరో పది శాతం ఓటు షేర్ ని సాధించాల్సి ఉంది. ఇది చూడబోతే బిగ్ టాస్క్ అని అంటున్నారు.

ఎందుకంటే ఒక వైపు కూటమిలోని అన్ని పార్టీలు ఏకమై వైసీపీని గట్టిగా టార్గెట్ చేస్తున్నాయి. ఆ పార్టీ నుంచి బడా నేతలు బిగ్ షాట్స్ ని దూరం చేస్తున్నాయి. అలా వైసీపీ ఓటు బ్యాంక్ 40 శాతాన్ని ఎంత వీలు అయితే అంతగా తగ్గించేలా చూస్తున్నాయి. ఈ తొమ్మిది నెలలలో వైసీపీ నుంచి ఎంతో మంది నాయకులు బయటకు వెళ్ళిపోయారు. దాంతో వైసీపీ ఓటు బ్యాంక్ మీద ఎంతో కొంత ఈ ప్రభావం ఉంటుందని అంటున్నారు.

అదే సమయంలో వైసీపీ తన ఓటు బ్యాంక్ ని కాపాడుకుంటూ కొత్తగా ఓటు షేర్ ని సాధించడం మీద ఇప్పటిదాకా అయితే నిర్మాణాత్మకమైన కార్యాచరణ అయితే ఏదీ జరగలేదని అంటున్నారు. దాంతోనే వైసీపీ పని అయిపోయింది రెండో చాన్స్ లేదు అని చాలా మంది చెబుతున్నారని అంటున్నారు.

అయితే ఇపుడున్న పరిస్థితులలో ఈ విధంగా జనంలోకి వెళ్ళినా ఉపయోగం లేదని అంటున్న వారూ ఉన్నారు. గతంలో తమ పాలనలో పొరపాట్లు జరిగాయని అంగీకరించాలి. వాటిని సరిదిద్దుకుంటామని కూడా చెప్పి జనాలో భరోసా పెంచుకోవాలి. అంతే కాదు, రాష్ట్ర రాజధానితో పాటు ఏపీ అభివృద్ధి మీద వైసీపీ తన స్టాండ్ ఏమిటి అన్నది కచ్చితంగా ప్రకటించాలి. అది జనాభిప్రాయాలకు దగ్గరగా ఉండాలని అంటున్నారు. ఇవన్నీ చేయకపోతే చింతా మోహన్ లాంటి వారు చెబుతున్నదే నిజం అవుతుందా అన్న చర్చ మాత్రం జరుగుతోంది.