అందుకే 11 సీట్లు వచ్చాయట..
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ వ్యంగ్యస్త్రాలు సంధించారు.
By: Tupaki Desk | 3 Jan 2025 8:22 AM GMTమాజీ సీఎం జగన్ పై విమర్శలకు ఎవ్వరూ వెనక్కు తగ్గడం లేదు. ఎన్నికల ఫలితాలు వచ్చి ఏడు నెలలు అవుతున్నా, 11 సీట్లు వచ్చాయంటూ హేళన చేయడానికి రాజకీయ ప్రత్యర్థులు పోటీపడుతున్నారు. టీడీపీ, జనసేన నేతలు ఈ విషయంలో ఓ మాదిరిగా మాటల దాడిచేస్తుంటే, తామే తక్కువా అంటూ కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ వ్యంగ్యస్త్రాలు సంధించారు. అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ కు 11 సీట్లు రావడానికి కారణమేంటనే విషయంపై తనదైన విశ్లేషణ చేశారు చింతా మోహన్. జగన్ పై ఎన్ని కేసులు ఉంటే అన్ని సీట్లు వచ్చేవని... ప్రస్తుతం వైసీపీ అధినేతపై 11 కేసులు ఉన్నందున 11 సీట్లు వచ్చాయంటూ కామెంట్ చేశారు. ప్రజలు వైసీపీని, జగన్ ను అస్సలు పట్టించుకోవడం లేదని సీనియర్ నేత చింతా మోహన్ అభిప్రాయపడ్డారు.
జగన్ ఇచ్చిన డబ్బు కోసమే కొందరు కాంగ్రెస్ నాయకులు వైసీపీలో చేరారని చెప్పారు. తిరుపతి ఎంపీగా ఆరు సార్లు గెలిచారు. పీవీ, మన్మోహన్ సింగ్ ప్రభుత్వాల్లో కేంద్ర మంత్రగా పనిచేశారు. కాంగ్రెస్ వాదిగా బలమైన గొంతు వినిపించే చింతా మోహన్ వైసీపీపై తరచూ విమర్శలు చేస్తుంటారు. తాజాగా జగన్ కేసులతో పోల్చుతూ 11 సీట్లు గెలవడంపై ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.