అయ్యన్న అరెస్ట్... తగ్గేదేలే...!
విశాఖ జిల్లాకు చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడుని క్రిష్ణా జిల్లా పోలీసులు విశాఖ దాకా వచ్చి అరెస్ట్ చేశారు
By: Tupaki Desk | 1 Sep 2023 7:17 AM GMTవిశాఖ జిల్లాకు చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడుని క్రిష్ణా జిల్లా పోలీసులు విశాఖ దాకా వచ్చి అరెస్ట్ చేశారు. హైదరాబాద్ నుంచి విశాఖకు వచ్చిన అయ్యన్నను ఎయిర్ పోర్టులో అరెస్ట్ చేయడం విశేషం.
ఇటీవల నారా లోకేష్ గన్నవరం సభలో అయ్యన్నపాత్రుడు మంత్రులు, మాజీ మంత్రులతో పాటు ముఖ్యమంత్రి జగన్ మీద అనుచిత కామెంట్స్ చేశారు అన్న దాని మీద మాజీ మంత్రి పేర్ని నాని పోలీసులకు అపుడే ఫిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదు తరువాత అయ్యన్న హైదరాబాద్ లో ఉన్నారు. నాలుగు రోజుల క్రితం ఎన్టీయార్ బొమ్మతో వెండి నాణెం విడుదల కార్యక్రమం ఢిల్లీలో జరిగినపుడు అక్కడ కూడా వెళ్లారు. ఇల సుదీర్ఘ విరామం తరువాత అయ్యన్న తన సొంత ఊరు నర్శీపట్నం చేరుకోవడానికి శుక్రవారం హైదరాబాద్ నుంచి విమానంలో బయల్దేరి వచ్చారు.
అయ్యన్న విశాఖ రాక విషయంలో ముందే సమాచారం తెచ్చిపెట్టుకున్న పోలీసులు ఈసారి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆయన్ని అరెస్ట్ చేయగలిగారు. నిజానికి అయ్యన్నను ఆయన ఇంటి వద్ద అరెస్ట్ చేయడానికి గతంలో పోలీసులు ప్రయత్నాలు చేసినపుడు అది పెద్ద రచ్చగా మారేది.
అయ్యన్నను అకారణంగా అరెస్ట్ చేస్తున్నారు అని తమ్ముళ్ళు పెద్ద ఎత్తున చేరి ఆందోళనలు నిర్వహించేవారు. ఈసారి మాత్రం ఆ తలనొప్పులు లేకుండా పోలీసులు జాగ్రత్తపడ్డారు. ఆయన నర్శీపట్నం చేరుకోకుండానే ఈ అరెస్ట్ జరగడం విశేషం.
ఇదిలా ఉంటే గన్నవరం మీటింగులో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ని పట్టుకుని వాడూ వీడూ అంటూ అయ్యన్న దుర్భాషలు ఆడారని ఫిర్యాదు అందింది. అలాగే మరో మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు, మంత్రి అంబటి రాంబాబు మీద అయ్యన్న ఆ సభలో కామెంట్స్ చేశారు.
ఇక మహిళా మంత్రి రోజాను రింగుల రాణి అని సంబోధించడమే కాకుండా ఆమె మేకప్ చూస్తే రాత్రి కాదు పగలే జడుసుకుంటారు అని సెటైర్లు వేశారు. టూరిజం ప్రాజెక్టుల గురించి చెప్పమంటే నా సొగసు చూడు మావా అంటుంది రోజా అని అయ్యన్న అసభ్య పదజాలం చేశారని ఫిర్యాదులు రావడంతో ఈ అరెస్ట్ అని అంటున్నారు. అయితే అయ్యన్న అరెస్ట్ చూపించినా ఆయన ముందస్తు బెయిల్ కూడా దక్కుతుంది అని అంటున్నారు.
ఇదిలా ఉంటే తన మీద పదుల సంఖ్యలో కేసులు పెట్టినా తాను తగ్గేదేలే అని అయ్యన్న ఎపుడూ అంటూంటారు. తాను వైసీపీ ప్రభుత్వం పనితీరునే తప్పుపడుతున్నాను అని ఆయన సమర్ధించుకుంటారు. వైసీపీ ఏలుబడిలో చాలా మంది మాజీ మంత్రులు అరెస్ట్ అయి జైలుకు వెళ్లారు కానీ అయ్యన్నపాత్రుడు మాత్రం ఇంతవరకూ పోలీసులకు సవాల్ చేస్తూనే ఉన్నారు.
ఈ అరెస్ట్ కూడా బెయిల్ తో సరి అని ఆయన అనుచరులు అంటున్నారు. అయ్యన్న ఇమేజ్ ని పెంచడానికి తప్ప ఇవి దేనికి ఉపయోగపడతాయని అంటున్న వారూ లేకపోలేదు. అయితే అయ్యన్న ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే కేసులు పెట్టాల్సివస్తుందని పోలీసులు అంటున్నారు. వైసీపీ నేతలు అయితే అయ్యన్న మారతారని అనుకోలేం కానీ చట్టం ఉందని చెప్పాలన్నదే తమ ప్రయత్నం అంటున్నారు.