Begin typing your search above and press return to search.

ఓపెన్ అయిపోయిన చింతలపూడి ఎమ్మెల్యే... కీలక వ్యాఖ్యలు!

అధికార వైసీపీ చేపట్టిన ఇన్ ఛార్జ్ ల మార్పు కార్యక్రమం ఆ పార్టీలో చిన్న సైజు అంతర్యుద్ధాన్ని రగిలిస్తుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

By:  Tupaki Desk   |   12 Jan 2024 9:23 AM GMT
ఓపెన్  అయిపోయిన చింతలపూడి ఎమ్మెల్యే... కీలక వ్యాఖ్యలు!
X

అధికార వైసీపీ చేపట్టిన ఇన్ ఛార్జ్ ల మార్పు కార్యక్రమం ఆ పార్టీలో చిన్న సైజు అంతర్యుద్ధాన్ని రగిలిస్తుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ దఫా టిక్కెట్లు రాని నేతలు ఎవరి స్టైల్లో వారు పార్టీపై తిరుగుబాటు జెండా ఎగురవేస్తూ, సంచలన విషయాలు వెల్లడిస్తున్నారు. ఈ సమయంలో ఇప్పటికే తిట్టడం, కొట్టడం తనకు రాదని.. దాన్ని పార్టీ తన అసమర్ధతగా భావించి ఉండొచ్చని పార్థసారథి తనదైన శైలిలో స్పందిస్తే... తాజాగా చింతలపూడి ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు.

అవును... కొన్ని స్థానాల్లో ఇన్ ఛార్జ్ ల మార్పులు చేర్పులు మార్పులు చేర్పుల కార్యక్రమం అధికార వైసీపీలో చిచ్చుపెడుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే పలువురు నేతలు సైలంటుగా రాజీనామాలూ చేస్తుంటే... మరికొంతమంది పార్టీలు మారాలని ప్లాన్స్ చేస్తుంటే.. ఇంకొంతమంది తమ ఆవేదనను మీడియా ముందు ప్రజలకు, పార్టీకీ వెల్లడిస్తున్నారు. ఇందులో భాగంగానే చింతలపూడి వైసీపీ ఎమ్మెల్యే ఎలీజా స్పందించారు.

ఇందులో భాగంగా... ఓపెన్ అయిపోయిన ఎలీజా... "పార్టీ నన్ను మోసం చేసింది" అని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఐఆరెస్ ఆఫీసర్ గా ఉన్నత ఉద్యోగాన్ని వదిలి పార్టీలో చేరినట్లు తెలిపిన ఎలీజా.. నాటి నుంచి నిత్యం జనంలో ఉన్నప్పటికీ... పెత్తందార్ల మాట కోసం తనను పక్కనబెట్టారని అసహనం వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా... నియోజకవర్గంలో వాస్తవంగా ఏం జరుగుతుందో పార్టీ అధినేత వైఎస్‌ జగన్ దృష్టికి వెళ్లడంలేదని ఎలీజా తెలిపారు.

ఈ సందర్భంగా... చింతలపూడిలో పెత్తందార్లకు పేదలకు మధ్య యుద్ధం జరిగిందని.. అయితే ఆ యుద్ధంలో పెత్తందారులకే వైఎస్ జగన్ ప్రాధాన్యత ఇచ్చారని ఎలీజా సంచలన వ్యాఖ్యలు చేశారు. పెత్తందారుల కాళ్లపై పడలేదు కాబట్టే తనను పక్కనబెట్టారని ఫైర్‌ అయ్యారు. ఈ సందర్భంగా సిట్టింగ్ ఎంపీ కోటగిరి శ్రీధర్ కు, తనకు మధ్య విభేదాలు ఉన్నాయని వెల్లడించారు.

ఏమైనా అంటే రిపోర్టులు బాగాలేదు అని అంటున్నారని.. తాను నియోజకవర్గంలో పని చేశానో లేదో జనాన్ని అడిగితే చెప్తారని అన్నారు. ఇదే సమయంలో... పార్టీ చెప్పిన అన్ని పనులు తాను చేసినా, రిపోర్టులు బాగాలేదు అనడం అంటే పొమ్మనలేక పొగ పెట్టడమే అని ఎలీజా అభిప్రాయపడ్డారు. ఒక పథకం ప్రకారం పార్టీ పెద్దలకు తనపై లేనిపోనివి చెప్పి తప్పుడు రిపోర్టులు ఇచ్చారని మండిపడ్డారు!

పార్టీ చేసే సర్వేలో రిపోర్టులు మంచిగా చెప్తున్నా కొంతమంది సీఎం వైఎస్‌ జగన్‌ ను తప్పుదారి పట్టించారని.. నిజంగా తనకు వ్యతిరేకంగా ఏవైనా రిపోర్టులు ఉంటే వాటిని బయట పెట్టాలని డిమాండ్‌ చేశారు. ఇదే సమయంలో తమవద్ద కూడా రిపోర్టులు ఉన్నాయని.. బయట పెడతానని సవాల్‌ చేశారు.