Begin typing your search above and press return to search.

చింత‌మ‌నేని.. ఏమీ దాచుకోవ‌ట్లా ..!

టీడీపీ ఫైర్‌బ్రాండ్ నాయ‌కుడు, దెందులూరు ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్‌.. మాటిస్తే.. ఎలా ఉంటుందో మ‌రోసారి నిరూపించుకుంటున్నారు.

By:  Tupaki Desk   |   21 Feb 2025 6:54 AM GMT
చింత‌మ‌నేని.. ఏమీ దాచుకోవ‌ట్లా ..!
X

టీడీపీ ఫైర్‌బ్రాండ్ నాయ‌కుడు, దెందులూరు ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్‌.. మాటిస్తే.. ఎలా ఉంటుందో మ‌రోసారి నిరూపించుకుంటున్నారు. ఎక్క‌డా దాప‌రికం లేకుండా ఆయ‌న అడుగులు వేస్తున్నారు. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఉభ‌య ఉమ్మ‌డి గోదావ‌రి జిల్లాల్లో పేరాబ‌త్త‌లు రాజ‌శేఖ‌ర్ పోటీలో ఉన్న విష‌యం తెలిసిందే. ఈయ‌న త‌ర‌ఫున ప్ర‌చారం చేయాల‌ని పార్టీ అధినేత చంద్ర‌బాబు ప‌దే ప‌దే చెప్పారు. దీంతో కొంద‌రు నాయ‌కులు ప్ర‌చారంలో పాల్గొంటున్నారు.

మ‌రికొంద‌రు మాత్రం దూరంగానే ఉన్నారు. కార‌ణాలు ఏవైనా.. పార్టీ చెప్పినా.. విన‌ని నాయ‌కులు క‌నిపిస్తున్నారు. వీరి సంగ‌తి ఎలా ఉన్నా.. చింత‌మ‌నేని మాత్రం మ‌న‌సు పెట్టారు. పార్టీ అధినేత ఆదేశాల‌తో ఆయ‌న రంగంలోకి దిగారు. త‌న వెంట ఎవ‌రు వ‌స్తున్నారు? ఎవ‌రు రావ‌డం లేదు? అనే విష‌యాల‌ను ప‌క్క‌న పెట్టి.. నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌తి గ్రాడ్యుయేట్ ఇంటికి వెళ్తున్నారు. వారిని ఒప్పించి.. మెప్పించి.. కూట‌మికి అనుకూలంగా ఓటు వేసేలా మాన‌సికంగా సిద్ధం చేస్తున్నారు.

''ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీ మెజారిటీ తో కూటమి అభ్యర్థిని గెలిపించండి. రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న కూటమి ప్రభుత్వానికి గ్రాడ్యుయేట్లు అంతా కలిసి మీ మద్దతు తెలపండి. వైసిపి పాలనలో గాడి తప్పిన, తిరోగమనం పాలయిన రాష్ట్ర అభివృద్ధికి పునర్వైభం తీసుకురావటానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోంది. విజ్ఞత కలిగిన పట్టభద్రులంతా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పెరాబత్తుల రాజశేఖర్‌కు లి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించండి'' అని చింతమనేని ప్రభాకర్ ప్ర‌తి ఒక్క‌రికీ చెబుతున్నారు.

అంతేకాదు.. దెందులూరు నియోజకవరంలోని ప్ర‌తి మండ‌లంలోనూ ఉద‌యాన్నే ఆయ‌న కాన్వాయ్ ప‌రుగులు పెడుతోంది. దెందులూరు మండలంలోని పోలీస్ స్టేషన్, మండల అభివృద్ధి కార్యాలయం సహా పలు ప్రభుత్వ కార్యాలయాలలోని పట్టభద్రులకు పలు గ్రామాల్లోని పట్టభద్రులకు కర పత్రాలు అందించి స్వ‌యంగా ఓటు వేయాల‌ని అభ్య‌ర్థిస్తున్నారు. త‌న‌కు అందుబాటులో ఉన్న‌ నాయకులతో కలిసి విస్తృత స్థాయిలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ విష‌యంలో ఆయ‌న ఎక్క‌డా ఒళ్లు దాచుకోకుండా.. మ‌న‌సు దాచు కోకుండా..ప‌నిచేస్తుండ‌డం గ‌మ‌నార్హం.