నిన్న వైవీ.. ఇప్పుడు ఏకంగా 'బ్రహ్మంగారు' ఎంట్రీ.. రాజధానిపైనే!
''మళ్లీ తిరుపతి రాజధానిగా మారుతుందని భావిస్తున్నాం. ప్రజలందరూ తిరుపతి రాజధాని కావాలని కోరుకుంటున్నారు
By: Tupaki Desk | 15 Feb 2024 9:20 AM GMTఏపీ రాజధాని విషయంపై రెండు రోజుల కిందట.. వైసీపీ సీనియర్‌నాయకుడు వైవీ సుబ్బారెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలే రాజకీయాల్లో ఇంకా దుమారం రేపుతున్నాయి. మరో రెండేళ్లపాటు హైదరాబాద్‌నే ఉమ్మడిగా ఉంచాలని వైవీవ్యాఖ్యానించారు. దీనిపై ప్రతిపక్ష నేతల నుంచితీవ్ర విమర్శలు వచ్చాయి. దీని వెనుక రెండు రాష్ట్రాల్లోనూ చిచ్చును మరింత రేపాలనే ఉద్దేశం ఉందంటూ.. చాలా మంది నాయకులు వ్యాఖ్యానించారు. ఈ వివాదం ఇలా కొనసాగుతుండగానే.. మరోవైపు తాజాగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు.. చింతా మోహన్.. బ్రహ్మంగారి కాలజ్ఞానాన్ని తెరమీదికి తెచ్చారు.
బ్రహ్మం గారి కాలజ్ఞానంలో తిరుపతి రాజధాని అవుతుందని రాసి ఉందని మోహన్ చెప్పారు. అంతేకాదు.. బ్రహ్మంగారి కాలజ్ఞానం.. ఇప్పటికే అనేక రూపాల్లో నిరూపితం అయిందని.. కాబట్టి ఇప్పటికైనా.. దీనిని నిజం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తే.. తిరుపతి రాజధాని అవుతుందన్న ఆశలు ఉన్నాయన్నారు.
''మళ్లీ తిరుపతి రాజధానిగా మారుతుందని భావిస్తున్నాం. ప్రజలందరూ తిరుపతి రాజధాని కావాలని కోరుకుంటున్నారు. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో తిరుపతి ఎప్పటికైనా రాజధాని అవుతుందని రాశారు. అందుకే ఇక్కడి ప్రజలు రాజధానిని చేయాలని కోరుకుంటున్నారు. రాయలసీమలో ఎప్పుడు కరవు, కష్టాలు, కన్నీళ్లే కనిపిస్తాయి. రాయలసీమ అభివృద్ధి చెందాలంటే.. తిరుపతి రాజధాని కావాలి'' అని చింతా మోహన్ భారీ డిమాండ్ చేశారు
అంతేకాదు.. తిరుపతి రాజధాని అయ్యేందుకు ఉన్న పారామీటర్లను కూడా ఆయన వెల్లడించారు. ''తిరుపతిలో లక్ష ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. నీరు సమృద్ధిగా పారుతుంది. రహదారులు ఉన్నాయి. పైగా ఆధ్యాత్మికంగా లక్షల మంది వస్తూ పోతూ ఉంటారు. భూకంపాలకు దూరంగా ఉంటుంది. ప్రభుత్వ కార్యాలయాలకు కూడా ఇబ్బంది లేదు. రేణిగుంట విమానాశ్రయం ఉంది'' అని చింతా మోహన్ లెక్కలు చెప్పుకొచ్చారు.