త్రోబ్యాక్: 3 లక్షల స్థలాన్ని లైబ్రరీకి అడిగితే చిరంజీవి ఇవ్వలేదా?
మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించినప్పుడు ఆయనపై ఒక సెక్షన్ మీడియా బురద జల్లడంపై చాలా చర్చ సాగింది.
By: Tupaki Desk | 20 Dec 2024 4:17 AM GMTమెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించినప్పుడు ఆయనపై ఒక సెక్షన్ మీడియా బురద జల్లడంపై చాలా చర్చ సాగింది. ఆయన సొంత ఊరు మొగల్తూరు కోసం ఏమీ చేయలేదని, సొంత ఊరికే చేయని వాడు ప్రజలకు ఏం చేస్తాడు? అంటూ కొన్ని మీడియాలు కథనాలు అల్లాయి. చిరంజీవి బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ సేవల్ని కూడా తప్పు పడుతూ కథనాలు ప్రచురితమయ్యాయి. తనను, తన కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ కొన్ని మీడియాలు విషం చిమ్మడంపై చిరంజీవి మాట్లాడిన ఓ త్రోబ్యాక్ వీడియో క్లిప్ అంతర్జాలంలో వైరల్ గా మారింది.
3 లక్షల ఖరీదు చేసే ఓ స్థలాన్ని మీ స్వస్థలం మొగల్తూరులో లైబ్రరీ నిర్మాణం కోసం మిమ్మల్ని అడిగితే ఇవ్వలేదు అని ప్రచారం జరిగింది. ప్రజారాజ్యం పార్టీపైనా అప్పట్లో ఇది కొంత ప్రభావం చూపించింది. అయితే ఈ ప్రచారంలో నిజం ఎంత? అని ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ప్రభు అడిగిన ప్రశ్నకు మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ఈ త్రోబ్యాక్ వీడియో క్లిప్ ఇప్పుడు మళ్లీ అంతర్జాలంలో వైరల్ గా మారుతోంది.
ఇలాంటి వాటికి సమాధానం ఇవ్వడం నాకు అదోలా ఉంటుంది. ఒకరు ఎదుటివారిపై బురదజల్లడానికి ఎంతకైనా దిగజారతారు. నిజానికి ఆ స్థలం కానీ ఆ ఇల్లు కానీ నాది కాదు. మా మావయ్య (అమ్మ తమ్ముడు) గారిది. నేను అక్కడ చదువుకునేందుకు ఒక అతిథిగా వెళ్లాను. అది అమ్మగారి ఊరు. నాన్నగారి సొంత ఊరు పెనుగొండ.. మొగల్తూరులో అమ్మ నన్ను ప్రసవించారు.. అలా నా సొంత ఊరుగా పాపులరైంది.
నాది కాని స్థలం నేను ఇవ్వలేను. అలాగే మొగల్తూరులో నేను నా స్నేహితుడి సహకారంతో లైబ్రరీ కూడా కట్టాను. కానీ ఆ ఇల్లు నేను అమ్ముకున్నాను అనే ప్రచారం నిజం కాదు. నాకు సంబంధం లేని దాని గురించి నేను ఎందుకు మాట్లాడతాను. అది నా ఇల్లు కాదు! అని నేను ఎవరికి జవాబివ్వాలి? అని చిరు ప్రశ్నించారు. ఇలాంటివి మాట్లాడేందుకు చికాగ్గా ఉంటాయని అన్నారు.
90లలో ఎదుగుతున్న తోటి కథానాయకుడు సుమన్ కెరీర్ ని తొక్కేసేందుకు కుట్ర చేసారనే ప్రచారంలో నిజం ఎంత? అని కూడా జర్నలిస్ట్ ప్రభు ప్రశ్నించగా.. ఇలాంటి తప్పుడు ప్రచారాలకు స్పందించడం ఇబ్బందికరమని చిరు అన్నారు. ``సుమన్ నేను చాలా మంచి స్నేహితులం.. మాపై తప్పుడు ప్రచారం చేసారు. సుమన్ కి నాకు మధ్య అసలు ఎలాంటి గొడవలు లేవు. మేం మంచి స్నేహితులం. ఇప్పటికీ మేం ఒకరికొకరు విషెస్ చెప్పుకుంటాం. స్నేహంగానే ఉన్నాము. 90ల నాటి స్నేహితులం కలిసే ఉన్నాం. ఇలాంటివి మాట్లాడటం కూడా సిగ్గు చేటు. అందుకే నేను ఎప్పుడూ మాట్లాడలేదు. ఎవరో అవాకులు చెవాకులు రాసారని దానికి స్పందించలేను`` అని అన్నారు. చాలా ఇంటర్వ్యూలలో చిరంజీవి తనకు స్నేహితుడు అని, అతడితో ఎలాంటి గొడవలు లేవని హీరో సుమన్ గతంలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.