Begin typing your search above and press return to search.

చిరంజీవికి కాంగ్రెస్ బర్త్ డే గిఫ్ట్ అదేనా ?

మెగాస్టార్ చిరంజీవి ఇష్టపడే రాజకీయాల్లోకి వచ్చారు. కానీ కష్టపడి మాత్రం కొనసాగ దలచుకోలేదు.

By:  Tupaki Desk   |   23 Aug 2024 3:41 AM GMT
చిరంజీవికి కాంగ్రెస్ బర్త్ డే గిఫ్ట్ అదేనా ?
X

మెగాస్టార్ చిరంజీవి ఇష్టపడే రాజకీయాల్లోకి వచ్చారు. కానీ కష్టపడి మాత్రం కొనసాగ దలచుకోలేదు. ఆయన ప్రజా సేవ చేయాలని తపించిన వారే. ఆయనలో ఆ సేవాభావం లేకపోతే బ్లడ్ బ్యాంక్ ఐ బ్యాంకులను ఎందుకు స్థాపిస్తారు. అది కూడా సినిమాల్లో బిజీగా ఉంటూ ఆయన చేసిన సేవా కార్యక్రమాలు అవి.

అయితే రాజకీయాల్లో హుందాతనం లేకపోవడంతో పాటు చిరంజీవి మృదువుగా వ్యవహరించే నేచర్ వల్ల కొనసాగలేక పోయారు. పైగా ఆయన రాజకీయ అరంగేట్రం సమయం కూడా రాంగ్ గా ఉంది. ఒక వైపు వైఎస్సార్ మరణం చెందడం, మరో వైపు ఉమ్మడి ఏపీ రెండుగా చీలడంతో ఆయన ఏ వైపు ఉండాలో ఏమి చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి అని అనుకున్నారు అంతా.

అయితే చిరంజీవి తెలివిగా చేసింది ఏంటి అంటే తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి రాజ్యసభ సభ్యుడు అయ్యారు. కేంద్ర మంత్రి అయ్యారు. అలా తన రాజకీయ ప్రస్థానానికి అందమైన ముగింపు ఇచ్చారు. అంతే 2018లో చిరంజీవి రాజ్యసభ సభ్యత్వం ముగిసిన తరువాత ఆ వైపు తొంగి చూడలేదు, వంగి వాలలేదు.

అది గత కాలం ముచ్చట అని సరిపెట్టుకున్నారు. ఇక ఆయన ఇంట్లో కూడా ఒక రాజకీయ పార్టీ ఉంది. అయినా ఆయన జనసేనలోనూ చేరలేదు. అలాంటి చిరంజీవిని కాంగ్రెస్ మాత్రం తమ వాడే అని క్లెయిం చేసుకుంటోంది. చిరంజీవి కాంగ్రెస్ కి రాజీనామా చేయలేదు అన్న టెక్నికల్ రీజన్ ను పట్టుకుని ఆ పార్టీ చిరంజీవిని తమ సొంతం అంటోంది.

చిరంజీవి కాంగ్రెస్ వైపు ఎక్కడా చూడలేదు, పైగా ఆయన రాజకీయాలకు అతీతంగా ఉంటున్నారు. తన సినిమాలూ తానేంటో అన్నట్లుగా ఉన్నారు. కానీ కాంగ్రెస్ మాత్రం సరిగ్గా చిరంజీవి బర్త్ డే నాడు ఆయన సభ్యత్వాన్ని మరో మూడేళ్ళు అంటే 2027 దాకా పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు చిరంజీవికి ఐడెంటిటీ కార్డు కూడా జారీ చేసింది.

చిరంజీవి కాంగ్రెస్ సభ్యత్వాన్ని రెన్యూవల్ చేస్తున్నట్లుగా కాంగ్రెస్ ప్రకటించడమే ఆయన పుట్టిన రోజు వేళ ఒక విశేషం. అంటే చిరంజీవిని కాంగ్రెస్ అయితే వదలడం లేదు. ఆయన తమ పార్టీలో ఉండాలని కోరుకుంటోంది. కానీ తాజా పుట్టిన రోజు తరువాత 70వ పడిలో పడిన చిరంజీవి తన జీవితం సినిమాలకే అంకితం అని చెప్పకనే చెబుతున్నారు.

మరి కాంగ్రెస్ మాత్రం వెంటపడుతున్నట్లుగానే ఉంది. దీని మీద చిరంజీవి ఏమంటారో ఎలా రియాక్ట్ అవుతారో. చిరంజీవి కాంగ్రెస్ కి రాజీనామా చేయడమే మార్గం అని కొందరు అంటూంటే ఆయన ఎపుడో వదిలేసిన పార్టీకి కొత్తగా రాజీనామా ఎందుకు అన్న వాదన కూడా ఉంది. ఏది ఏమైనా మెగాస్టార్ ని హస్తం నీడకు చేర్చాలని ప్రయత్నాలు గట్టిగానే సాగుతున్నాయని అంటున్నారు.