పవన్‌కు రూ.5 కోట్ల విరాళం.. సరే.. ప్రచారం చేయండి 'అన్నయ్యా': నెటిజన్ల టాక్
ఈ క్రమంలో హైదరాబాద్‌లోని ముచ్చింతలో విశ్వంభర షూటింగ్‌లో ఉన్న చిరంజీవిని నాగబాబుతో కలిసి.. పవన్ భేటీ అయ్యారు.
By: Tupaki Desk | 9 April 2024 3:00 AM GMTజనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఆయన సోదరుడు చిరంజీవి.. రూ.5 కోట్ల విరాళం అందించారు. పార్టీకి కీలక సమయంలో ఈ సొమ్ము సహకరిస్తుందని.. అవసరాలకు పనికి వస్తుందని చిరు పేర్కొన్నారు. ప్రస్తుతం అనారోగ్యం కారణంగా.. పవన్ తన ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారు. హైదరాబాద్ లో రెస్టు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని ముచ్చింతలో విశ్వంభర షూటింగ్‌లో ఉన్న చిరంజీవిని నాగబాబుతో కలిసి.. పవన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా లొకేషన్‌లో ముగ్గురు కలియ దిరిగారు.
ఈ సందర్భంగా చిరు ఆశీస్సులు తీసుకున్న పవన్ కు చిరంజీవి రూ.5 కోట్ల విరాళానికి సంబంధించిన చెక్కును అందించారు. అయితే.. ఇంత పెద్దమొత్తంగా చిరంజీవి తొలిసారి విరాళం ఇవ్వడంపై నెటిజన్లు ఆసక్తికర ప్రశ్నలు సంధించారు. దీనిపై చిరు స్పందిస్తూ.. తన తమ్ముడు మనసున్న మనిషి అని.. తన స్వార్జితంతో రైతులకు మేలు చేయాలన్న సంకల్పంతో ముందుకు సాగుతున్నారని తెలిపారు. ఇప్పటికే ఏపీలో మృతి చెందిన కౌలు రైతుల కుటుంబాలను పవన్ ఆదుకున్నారని తెలిపారు.
ఇప్పుడు కీలక ఎన్నికల సమయంలో పార్టీకి ఆర్థికంగా సాయం చేయడం తన ధర్మంగా భావిస్తున్నామని చిరు ప్రకటించారు. తన స్వార్జితాన్ని సమాజం కోసం ఖర్చు చేస్తున్న పవన్‌కు.. జనసేన పార్టీకి ఇతోధికంగా సాయం చేయాలన్న ఉద్దేశంతోనే తాను రూ.5 కోట్లు ఇచ్చానని చిరు వివరించారు. అయితే.. నెటిజన్లు మాత్రం విరాళం సరే.. ఎన్నికల్లోనూ ప్రచారం చేసి.. తోడ్పాటు అందించండి అంటూ.. కామెంట్లు చేశారు. గత ఎన్నికల్లోనూ చిరు ప్రచారానికి దూరంగా ఉన్నారు.
ఇక, ఇప్పుడు అయినా.. తమ్ముడి తరఫున ప్రచారం చేయండి.. అని మెజారిటీ నెటిజన్లు అభిప్రాయపడడం గమనార్హం. దీనిపై మాత్రం చిరు మౌనం వహించారు. ఇక, చిరు తనయుడు, మరో మెగా స్టార్ రాం చరణ్ గత ఎన్నికల్లోనే మెగా అభిమానులకు పిలుపునిచ్చారు. జనసేన తరఫున పనిచేయాలన్నారు. పవన్ బాబాయి పిలిస్తే..తాను ప్రచారానికి రెడీ అన్నారు. కానీ, అప్పట్లో పవన్ ఆయనను పిలవలేదు. మరి ఇప్పుడైనా పిలుస్తారో లేదో చూడాలి.