Begin typing your search above and press return to search.

పవన్ పదవి విషయంలో చిరంజీవి కోరిక ఇదేనా?

ఆంధ్రప్రదేశ్ లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ - జనసేన - బీజేపీ కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   10 Jun 2024 11:23 AM GMT
పవన్  పదవి విషయంలో చిరంజీవి కోరిక ఇదేనా?
X

ఆంధ్రప్రదేశ్ లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ - జనసేన - బీజేపీ కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ విజయంలో మెజారిటీ క్రెడిట్ పవన్ కే దక్కుతుందనే మాటలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే పవన్ ను తుఫాను తో పోల్చారు ప్రధాని మోడీ. ఇక, ఇప్పటికే కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరిన వేళ.. ఈ నెల 12న ఏపీలోనూ కూటమి ప్రభుత్వం కొలువుదీరనుంది.

కూటమిలో భాగంగా కేంద్రంలో రెండు మంత్రి పదవులను టీడీపీ సాధించుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఇకపై ఏపీలోని తన కేబినెట్ లో ఎవరెవరికి మంత్రి పదవులు, ఎవరి ఏ పదవి అనే విషయంపై చంద్రబాబు కసరత్తులు చేస్తున్నారని అంటున్నారు. ఈ సమయంలో లోకేష్ నిర్ణయాలు కూడా కీలకం కాబోతున్నాయని చెబుతున్నారు. ఆ సంగతి అలా ఉంటే.. పవన్ పదవిపై ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ తెరపైకి వచ్చింది.

అవును... ఏపీలో ఈ నెల 12న ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయబోతున్న వేళ కేబినెట్ మంత్రులు ఎవరెవరు అనే చర్చ మొదలైంది. ఈ క్రమంలో జనసేనకు కనీసం నాలుగు మంత్రి పదవులు దక్కుతాయని చెబుతున్నారు. పవన్ కూడా ఆ నలుగురి ఎంపికపైనే ఉన్నారని అంటున్నారు. అయితే మరి పవన్ కల్యాణ్ ను ఏ పదవి వరించబోతుందనేది ఇప్పుడు ఆసక్తిగా మరింది.

ఈ క్రమంలో జనసేన అధినేత, తన తమ్ముడు పవన్ కల్యాణ్ ను డిప్యూటీ సీఎంగా చూడాలని మెగాస్టార్ చిరంజీవి కోరిక అనే చర్చ ఇప్పుడు వైరల్ గా మారింది. తన తమ్ముడు పడిన కష్టానికి, అతనిపై ఒక వర్గం పెట్టుకున్న నమ్మకానికి ఆ మాత్రం హోదా అవసరం అని, అతడు దానికి నూటికి నూరుశాతం అర్హుడని చిరంజీవి పూర్తిగా విశ్వసిస్తున్నారని ఒక చర్చ నెట్టింట వైరల్ గా మారింది.

"కొణిదెల పవన్ కల్యాణ్ అను నేను... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్నాను" అనే సౌండ్ వినాలని మెగాస్టార్ చిరంజీవితో పాటు యావత్ జనసైనికులు, మెగా అభిమానులు, పలువురు కూటమి పార్టీల కార్యకర్తలు కోరుకుంటున్నారని అంటున్నారు. దీంతో... ఇదే చిరు కోరికైతే దీన్ని చంద్రబాబు మన్నిస్తారా, పవన్ ను డిప్యూటీ సీఎం చేయడానికి ఒప్పుకుంటారా లేదా అనేది ఆసక్తిగా మారింది!

అయితే... ఏపీలో ఈ దఫా డిప్యూటీ సీఎం లు ఉండరు.. ఆ పదవిని జగన్ సర్కార్ ఆరో వేలు మాదిరి చేసేసింది.. కాకపోతే పవన్ కు కచ్చితంగా బలమైన మంత్రిపదవే దక్కుతుంది.. ప్రభుత్వంలో తగిన గుర్తింపు ఇవ్వబడుతుంది.. ఈ విషయంలో చంద్రబాబుని ఇబ్బంది పెట్టకపోవడమే బెటర్ అని మరికొంతమంది వ్యాఖ్యానిస్తున్నారని అంటున్నారు.

దీంతో... జూన్ 12న ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారోత్సవం వేళ ఆయనతో పాటు ఎవరెవరు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేస్తారు.. జనసేన అధినేత, కూటమి కీ పర్సన్ అయిన పవన్ కల్యాణ్ ఏ పదవి కోసం ప్రమాణం చేస్తారు అనేది ఆసక్తిగా మారింది.