Begin typing your search above and press return to search.

రామోజీకి 'చిరు' బహుమతి... ప్రజారాజ్యం రోజులతో మెగాస్టార్!

రామోజీగ్రూప్ సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు (88) జూన్ 8 తెల్లవారు జామున తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   8 Jun 2024 1:46 PM GMT
రామోజీకి చిరు బహుమతి... ప్రజారాజ్యం రోజులతో మెగాస్టార్!
X

రామోజీగ్రూప్ సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు (88) జూన్ 8 తెల్లవారు జామున తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో నేటి ఉదయం నుంచి దేశవ్యాప్తంగా రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపాన్ని ప్రకటిస్తున్నారు. ఇదే క్రమంలో ఫిల్మ్ సిటీలోని ఆయన పార్థివదేహాన్ని సందర్శించి నివాళులు అర్పిస్తున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి మీడియాతో మాట్లాడారు.

అవును... రామోజీరావు పార్థివదేహాన్ని సందర్శిస్తూ పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు నివాళులు అర్పిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ, ఆయనతో తమకున్న జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఎమోషన్ అవుతున్నారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి... రామోజీరావుతో తనకున్న అనుభవాలను, అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.

ఇందులో భాగంగా అందరూ ఆయనలో ఒక గంభీరమైన వ్యక్తిని చూసి ఉంటారు కానీ... తాను మాత్రం ఆయనలో ఒక చిన్నపిల్లాడిని, పసిపిల్ల వాడినీ చూడటం జరిగిందని చిరంజీవి తెలిపారు. 2009 సమయంలో ప్రజారాజ్యం పార్టీకి సంబంధించి ఆయనను తరచూ కలుస్తూ ఉండేవాడినని చెప్పిన చిరంజీవి... ఆ సమయంలో తాను రామోజీకి ఒక పెన్నును బహుమతిగా ఇవ్వడం జరిగిందని తెలిపారు.

అయితే ఆ పెన్నును బహుమతిగా ఇచ్చినప్పుడు ఏమాత్రం వద్దని చెప్పకుండా చిన్నపిల్లాడికి ఒక బొమ్మ ఇస్తే ఎలా మురిసిపోతాడో అలా ఆయన మురిసిపోయారని తెలిపారు. ఈ సందర్భంగా తనకు పెన్నులు కలెక్ట్ చేయడం చాలా ఇష్టమని చెప్పిన రామోజీ.. తన కలెక్షన్స్ అన్నీ తనకు చూపించినట్లు చిరంజీవి గుర్తుచేసుకున్నారు.

వాటన్నింటితోనూ తన ఆలోచనలకు తగినట్లుగా వాటిని వినియోగిస్తూ.. అక్షర రూపం ఇచ్చేవారని.. ఆశయాలను నెరవేర్చుకోవడం కోసం ఆయన చేసే ప్రయత్నాలు అన్నీ ఇన్ని కాదని చిరు కొనియాడారు. ఈ క్రమంలో రామోజీరావు మృతి ఆయన కుటుంబానికే కాదు.. యావత్ తెలుగు జాతికీ తీరని లోటని, ఒక మహా వ్యక్తిని, శక్తిని కోల్పోయామని చిరంజీవి అన్నారు.