Begin typing your search above and press return to search.

హాట్ టాపిక్... పిఠాపురంలో ప్రచారానికి చిరంజీవి రెడీ!

తన తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం అన్న మెగాస్టార్ చిరంజీవి ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉందని జనసేన పార్టీ సన్నిహిత వర్గాల్లో చర్చ నడుస్తుంది.

By:  Tupaki Desk   |   23 April 2024 4:29 AM GMT
హాట్  టాపిక్... పిఠాపురంలో ప్రచారానికి చిరంజీవి రెడీ!
X

ఎన్నికల వేళ ఏపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. "రాజకీయాలకు దూరంగా ఉన్నాను.. కానీ రాజకీయం నా నుంచి దూరం కాలేదు" అన్నట్లుగానే, ఎన్నికల సమయం దగ్గరపడటంతో రాజకీయంగా చిరు వ్యవహారం తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. పైగా ఇటీవల కూటమి నేతలకు మద్దతిస్తూ.. టీడీపీ-బీజేపీ-జనసేన కలిసి కూటమిగా ఏర్పడటం శుభపరిణామం అని చేసిన వ్యాఖ్యల అనంతరం ఈ వ్యవహారం మరింత హాట్ టాపిక్ గా మారింది.

అవును... సుమారు దశాబ్ధకాలం తర్వాత రెండు రోజుల క్రితం ఒక రాజకీయ ప్రకటన చేశారు మెగాస్టార్ చిరంజీవి. దీంతో... ఏపీ రాజకీయాల్లోకి చిరంజీవి ఎంట్రీపై రకరకాల ఊహాగాణాలు మొదలైపోయాయి. ఇందులో భాగంగానే... బహుశా మే మొదటి వారంలో పిఠాపురంలో తన తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం అన్న మెగాస్టార్ చిరంజీవి ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉందని జనసేన పార్టీ సన్నిహిత వర్గాల్లో చర్చ నడుస్తుంది.

ఇందులో భాగంగా... కచ్చితమైన తేదీ ఇంకా ఖరారు కానప్పటికీ, చిరంజీవి పిఠాపురంలో బహిరంగ సభ లేదా రోడ్‌ షోలో చేరడానికి అంగీకరించారని.. తన సోదరుడికి ఓటు వేయాలని, అతడి రాజకీయ జీవితానికి మద్దతు ఇవ్వాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేస్తారని అంటున్నారు. ఇప్పటికే జనసేనకు ఆర్థిక సహాయం అందించడంతోపాటు.. కూటమి నేతలకు బహిరంగంగా మద్దతు పలకడంతో.. ఇక పూర్తిగా ఓపెన్ అయిపోయే అవకాశాలున్నాయనే చర్చ తెరపైకి వచ్చింది.

ఇదే సమయంలో... మే మొదటి వారంలో, ఎన్నికల ప్రచారాలు పీక్స్ కి చేరిన సమయంలో చిరంజీవి ప్రచారం చేస్తే ఆ ఎఫెక్ట్ పోలింగ్ తేదీ వరకూ ఉంటుందని భావిస్తున్నారంట. అయితే... చిరంజీవి, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ప్రచారానికి మాత్రమే పరిమితమవుతారా.. లేక, తనకు చిరకాల మిత్రులు అయిన సీఎం రమేష్ కోసం అనకాపల్లి లోక్‌ సభ నియోజకవర్గంలోనూ, తన బ్లెస్సింగ్స్ తో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన పంచకర్ల రమేష్ కోసం పెందుర్తిలోనూ కూడా ప్రచారం చేసే అవకాశం ఉందా అనేది మాత్రం అస్పష్టంగానే ఉంది.

అయితే... బీజేపీ, టీడీపీ అభ్యర్థుల కోసం ప్రచారం చేసినా చేయకపోయినా.. అసలు సిసలు జనసేన అభ్యర్థులకు అతని మద్దతు ఉంటుందని.. ఈ నేపథ్యంలోనే పెందుర్తిలో ప్రచారాన్ని కూడా కొట్టిపారేయలేమని అంటున్నారు పరిశీలకులు. ఏది ఏమైనా... ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి కోసం చిరంజీవి ప్రత్యక్ష మద్దతు, కుదిరితే ప్రచారం అనేవి ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు తీవ్ర ఆసక్తిగా మారాయి!