Begin typing your search above and press return to search.

మాజీ ప్రజారాజ్యం నేతలకు మెగా పిలుపుగా ?

తన ఇంట్లో రాజకీయాలు ఉన్నా తాను మాతం దూరమని, ఎప్పటికీ అందులో దూరనని ఆయన ఒట్టేసి మరీ పదే పదే చెప్పుకున్నారు.

By:  Tupaki Desk   |   10 Feb 2025 6:30 PM GMT
మాజీ ప్రజారాజ్యం నేతలకు మెగా పిలుపుగా ?
X

మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలను వదిలేసి చాలా కాలం అయింది. ఆ విషయం ఆయనే స్వయంగా అనేకసార్లు చెప్పుకున్నారు. తన ఇంట్లో రాజకీయాలు ఉన్నా తాను మాతం దూరమని, ఎప్పటికీ అందులో దూరనని ఆయన ఒట్టేసి మరీ పదే పదే చెప్పుకున్నారు.

అటువంటి మెగాస్టార్ నోట పబ్లిక్ గా ఒక రాజకీయ నినాదం వినిపించింది జై జనసేన అని ఆయన అన్నారు. అంతే కాదు ఒకనాటి ప్రజారాజ్యం ఈనాటి జనసేన అని కూడా అన్నారు. అంటే తాను పెట్టిన పార్టీ తమ్ముడి పార్టీగా ఇప్పటికీ మనుగడలో ఉంది అని మెగాస్టార్ చాలా స్పష్టంగా చెప్పేసారు అన్న మాట.

మరి దీని భావమేమిటి అంటే మెగాస్టార్ ప్రజారాజ్యమే జనసేన అని సూత్రీకరించాక ఇక జనసేనలోకి మాజీ ప్రజారాజ్యం వాదులు అంతా వచ్చి చేరాలన్ని మేలైన మెగా పిలుపు అందులో ఇమిడి ఉందని అంటున్నారు. నిజానికి ప్రజారాజ్యం చాలా బిగ్ ఫోర్స్ గా ఉమ్మడి ఏపీలో వచ్చింది. దానిని అలాగే కొనసాగి ఉంటే ఈ రోజుకు ఏ స్థాయిలో ఉండేదో అన్న చర్చ ఎప్పటికీ అలాగే ఉంటుంది.

ప్రజారాజ్యం ఫోర్స్ ఈ రోజుకీ జనసేనకు అంత స్థాయిలో లేదన్నది ఒక చర్చ. ప్రజారాజ్యం ఒంటరిగా ఉమ్మడి ఏపీలో పోటీ చేసి ఏకంగా 18 అసెంబ్లీ సీట్లు 71 లక్ష్లకు పైగా ఓట్లను సాధించింది అంటే అది ఏ మాత్రం చిన్న విషయం కాదు. అదే విధంగా ఆనాడు బలంగా ఉన్న అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష టీడీపీలను ఢీ కొట్టి మరీ ప్రజా రాజ్యం జెండా ఎగరేయడం అంత మామూలు విషయం కానే కాదు.

మరో వైపు చూస్తే ప్రజారాజ్యం పార్టీ కొత్తగా ఒక మూడవ రాజకీయ శక్తిగా వస్తోందని అన్ని వర్గాలు సపోర్టు చేసారు. అయితే ఆ తరువాత దానిని కాంగ్రెస్ లో విలీనం చేయడంతో తమ్ముడు పెట్టిన జనసేనకు అంతటి ఆదరణ అయితే దక్కలేదు అన్నది ఉంది. అంతే కాదు 2019 ఎన్నికల్లో పోటీ చేస్తే పవన్ రెండు చోట్లా ఓటమి పాలు అయ్యారు. ఒకే ఒక్క సీటు దక్కింది.

ఇక 2024 ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకుని జనసేన పోటీ చేసి 21 సీట్లు సాధించడం గొప్ప విషయమే అయినా ఒంటరిగా జనసేన వెళ్తే ఈ స్థాయి విజయాలు దక్కుతాయా అన్నది కూడా చర్చగానే ఉంది. ఈ నేపథ్యంలో ప్రజారాజ్యం పార్టీకి పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చిన సామాజిక వర్గాలు కానీ నాయకులు కానీ జనసేనకు పూర్తి స్థాయిలో టర్న్ కాలేదు అన్నది కూడా ఒక చర్చగా ఉంది. ఈ క్రమంలో అనేక మంది ప్రజారాజ్యం పార్టీ నాయకులు వేరు వేరు పార్టీలలో ఉంటున్నారు. ఏపీలో చూస్తే జనసేన పటిష్టానికి చర్యలు తీసుకుంటోంది.

దాంతో మాజీ పీఆర్పీ నేతలకు మెగా పిలుపుతో ఆహ్వానించడం కోసమేనా జై జనసేన నినాదం వినిపించారు అన్నది కూడా కొత్త చర్చగా ఉంది. అలా వైసీపీలో ఉన్న మాజీ పీఆర్పీ నేతలను ఆకట్టుకోవడం వీలైతే ఇతర పార్టీలలో ఉన్న వారిని సమయం వచ్చినపుడు దరికి చేర్చుకోవడం అన్నది కూడా ఒక వ్యూహంగా ఉంది అని అంటున్నారు.

మరో వైపు చూస్తే మెగాస్టార్ ని కేంద్రంలోని బీజేపీ పెద్దలు బాగా గౌరవం ఇస్తున్నారు ఆయనను మళ్ళీ రాజకీయాల్లోకి తీసుకుని రావాలని చూస్తున్నారు అన్న ప్రచారం ఉంది. వీలైతే ఆయనను పెద్దల సభకు పంపించి ఏపీలో తాము కూడా బలోపేతం కావాలని చూస్తున్నారు. ఇలా అనేక రకాలైన ప్రచారాలు అయితే జై జనసేన నినాదాల వెనక వినిపిస్తున్నాయి. వీటిలో ఏది నిజం అన్నది ఎవరికీ ఇప్పట్లో తెలియదు. అంతే కాదు రాజకీయాల్లో ఇలాంటి పుకార్లు షికార్లు చేయడం కామన్ గానే చూడాలి.

మొత్తానికి అయితే రాజకీయాలకు దూరం అన్న మెగాస్టార్ నోట జై జనసేన అని రావడం అంటే మాత్రం అది మామూలుగా జరిగేది కాదని ఏదో వ్యూహం ఉండే ఉంటుందని అది ఢిల్లీ స్కెచ్ అని అంటున్న వారూ ఉన్నారు. సో చూడాలి మరి ఈ నినాదానికి తెలుగు నాట రాజకీయాల్లో బలమెంత ఉందో. దాని పరిణామాలు ఏ స్థాయిలో ఉంటాయో. వాటి ద్వారా ఏపీ పాలిటిక్స్ ఏ షేపునకు రూపు దిద్దుకుంటుందో.