Begin typing your search above and press return to search.

చిరు దండం... పెద్ద వివాదం

ఇక మర్యాదకు మారు పేరుగా చిరంజీవి ఉంటారు. ఆయన ఎవరిని అయినా అప్యాయంగా పలకరిస్తారు.

By:  Tupaki Desk   |   17 Sep 2024 4:15 PM GMT
చిరు దండం... పెద్ద వివాదం
X

మెగా స్టార్ చిరంజీవి వివాద రహితుడు. ఆయన ఎపుడూ అలాగే ఉంటారు. కానీ ఆయన చుట్టూ వివాదాలు అల్లే ప్రయత్నాలు మాత్రం ఎపుడూ జరుగుతూ ఉంటాయి. ఆయన రాజకీయాల్లో లేకపోయినా ఆయన గురించి ప్రత్యక్షంగా పరోక్షంగా చర్చ సాగిస్తూ ఆయనను ముగ్గులోకి లాగుతూ ఏదో విధంగా ఆయన పేరుని తలచే వారూ ఎపుడూ ఉంటారు.

ఇక మర్యాదకు మారు పేరుగా చిరంజీవి ఉంటారు. ఆయన ఎవరిని అయినా అప్యాయంగా పలకరిస్తారు. అంతే కాదు వారిని గౌరవిస్తారు. లేటెస్ట్ గా చూస్తే చిరు మర్యాద మంచితనమే మరో మారు సోషల్ మీడియా వేదికగా వివాదానికి దారి తీసేలా కొందరు సబ్జెక్ట్ గా చేసుకుని రచ్చ చేస్తున్నారు.

తెలంగాణా సీఎం రేవన్ రెడ్డిని తాజాగా మెగా స్టార్ చిరంజీవి కలసి ఆయనకు తుఫాను బాధితులను ఆదుకునేందుకు సాయం పేరిట చెక్కుని అందించారు. ఈ సందర్భంగా తన చాంబర్ కి వచ్చిన మెగా స్టార్ ని శాలువతో రేవంత్ రెడ్డి సత్కరించారు. అదే సమయంలో చిరంజీవి రేవంత్ రెడ్డికి రెండు చేతులూ జోడించి నమస్కారం పెట్టారు.

ఇపుడు అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మెగాస్టార్ తన కంటే పన్నెండు ఏళ్ళు చిన్న అయిన రేవంత్ రెడ్డికి నమస్కరించారని ఆ సమయంలో రేవంత్ రెడ్డి నవ్వుతూ కెమెరా వైపు చూస్తున్న విజువల్ బయటకు వచ్చింది. దాంతో స్టార్ట్ అయింది రచ్చ. ఆనాడు ఏపీ సీఎం జగన్ కి మెగా స్టార్ దండం పెడితే గొడవ చేశారని ఇపుడు ఏమంటారు అని ఒక సెక్షన్ సోషల్ మీడియాలో దూకుడు చేస్తూంటే మరో సెక్షన్ అయితే చిరంజీవికి రేవంత్ రెడ్డి శాలువా కప్పుతున్నారు కాబట్టి ఆయన రెండు చేతులూ ప్రతి నమస్కారానికి అవకాశం ఇవ్వలేదని సమర్ధిస్తున్నారు.

అంతే కాదు రేవంత్ రెడ్డి బాడీ లాంగ్వేజ్ వేరుగా ఉందని అప్పట్లో జగన్ బాడీ లాంగ్వేజ్ వేరుగా ఉందని పోలిక తెస్తున్నారు. కోరి మరీ జగన్ చిరంజీవి నుంచి దండం పెట్టించుకున్నారని నాడూ నేడూ అదే వాదనను మళ్ళీ తెస్తున్నారు.

సరిగ్గా మూడేళ్ళ క్రితం అనాడు ఏపీ సీఎం గా ఉన్న జగన్ వద్దకు తెలుగు చలన చిత్ర పరిశ్రమ ప్రముఖులు అంతా చిరంజీవి నాయకత్వంలో వెళ్ళి కలిశారు. ఈ సందర్భంగా చలన చిత్ర సమస్యలను చెబుతూ మెగాస్టార్ దండం పెట్టారు జగన్ కి. అయితే జగన్ మాత్రం తన రెగ్యులర్ బాడీ లాంగ్వేజ్ తోనే రెండు చేతులూ కట్టుకుని నవ్వుతూ చూస్తున్నారు. ఆ ఫోటో బయటకు రావడం ఏంటి రచ్చ అయింది.

ఏకంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా అన్నయ్యను అవమానించారు అని ప్రతీ సభలో చెబుతూ ఉండేవారు. ఒక బలమైన సామాజిక వర్గం కూడా దీని మీద బాగా హర్ట్ అయింది. అయితే ఆ డ్యామేజ్ ని కంట్రోల్ చేయడానికి మళ్లీ చిరంజీవిని ఇంటికి పిలిచి జగన్ ఆయనకు రెండు చేతులూ జోడించి నమస్కరించి సాదరంగా ఆహ్వానించిన ఫోటోలు కూడా వచ్చాయి. తన ఇంట్లో విందును కూడా మెగాస్టార్ కి జగన్ ఆ రోజున ఇచ్చారు.

అయితే చెడు వెళ్ళినంతగా మంచి వెళ్లదు కాబట్టి ఆ విధంగా జగన్ కోరి సినీ ప్రముఖుడు వయసులో పెద్దవారు అయిన చిరంజీవి చేత నమస్కారం పెట్టించుకున్నారు అన్నది అప్పటికీ ఇప్పటికీ అంతా నమ్ముతూనే ఉన్నారు.

ఇక ఇపుడు రేవంత్ రెడ్డికి కూడా చిరంజీవి దండం పెట్టడంతో పాత వివాదం కొత్తగా మిక్స్ చేసి మళ్ళీ సోషల్ మీడియా వార్ కి కొందరు తెర తీశారు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే చిరంజీవి అక్కడ ఎదురుగా ఉన్న వారి వయసు చిన్న అయినా వారు సీఎం అన్న కారణంగా రెస్పెక్ట్ ఇచ్చి దండం పెడుతున్నారు

అయితే దాని మీద కూడా వివాదాలు చోటు చేసుకోవడంతో చిరు దండానికి ఒక దండం అన్నట్లుగానే సీన్ క్రియేట్ చేస్తున్నారు. వివాదాలు అసలు ఇష్టం లేని మెగా స్టార్ విషయంలో ఇలా రచ్చ చేయడం ఎందుకు అంటే ఏపీలో ఉన్న రాజకీయ పార్టీలు వారి మధ్య పోటీ తత్వం ఇదన్న మాట. అందుకే ఆయా పార్టీలకు చెందిన సోషల్ మీడియా యాక్టివిస్టులు ఇలా రచ్చ చేస్తూనే ఉంటున్నారు. ఎవరు ఏమనుకున్నా మెగా దండం మాత్రం నిజంగా అతి పెద్ద దండమే సుమా అని సెటైర్లూ పడుతున్నాయి.