Begin typing your search above and press return to search.

చిరంజీవి రాజకీయం...లైట్ తీసుకున్నారా ?

ఉమ్మడి ఏపీలో బలమైన థర్డ్ పొలిటికల్ ఫోర్స్ గా మెగాస్టార్ నిలుస్తారని అప్పటి సంప్రదాయ పార్టీల కోటలను బద్ధలు కొడతారని అంతా అంచనా వేశారు.

By:  Tupaki Desk   |   13 Feb 2025 2:30 AM GMT
చిరంజీవి రాజకీయం...లైట్ తీసుకున్నారా ?
X

మెగాస్టార్ చిరంజీవి 2008లో పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆయన అదే ఏడాది ఆగస్టు నెలలో ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. ఆ తర్వాత 2009 ఎన్నికల్లో పోటీ చేయడం అతి పెద్ద సంచలనం. ఆనాడు ఉమ్మడి ఏపీలో ప్రజారాజ్యం పార్టీ ఎంట్రీ గురించి సాగిన చర్చ అంతా ఇంతా కాదు. ఉమ్మడి ఏపీలో బలమైన థర్డ్ పొలిటికల్ ఫోర్స్ గా మెగాస్టార్ నిలుస్తారని అప్పటి సంప్రదాయ పార్టీల కోటలను బద్ధలు కొడతారని అంతా అంచనా వేశారు.

కానీ జరిగింది వేరు. దానికి గల కారణాలు అనేకం ఉన్నాయి. ఎందుకంటే చిరంజీవి మీద ఉన్న హైప్ ఒక రేంజిలో సాగింది, కానీ కొత్త పార్టీగా గ్రౌండ్ లెవెల్ లో బాలారిష్టాలను అధిగమించలేకపోవడం, సరైన వ్యూహాలు లేకపోవడం వల్లనే చతికిలపడింది. అయినా కానీ ప్రజారాజ్యం ఉమ్మడి ఏపీలో సాధించిన 71 లక్షల ఓట్లు 18 సీట్లు ఒక భారీ రికార్డు గానే నేటికీ ఉంది.

ఒక వైపు కాంగ్రెస్ కి చెందిన ముఖ్యమంత్రి వైఎస్సార్ ఉంటే మరో వైపు టీడీపీ అధినేత చంద్రబాబు ఉన్నారు. ఈ ఇద్దరి మధ్యన మెగాస్టార్ ఒంటరిగా సాగించిన రాజకీయ పోరాటంలో ఆ సీట్లూ ఓట్లూ అంటే దటీజ్ మెగాస్టార్ పొలిటీకల్ విక్టరీ అని చెప్పాలి. కేవలం ఎనిమిది నెలలలో చిరంజీవి ఉమ్మడి ఏపీలో చేసిన రాజకీయ అలజడి అది.

ఓడినా చిరంజీవి అంటే ఇతర పార్టీలు భయపడే పరిస్థితి నాడు ఉండేది. ఆ పార్టీని అలా ఉంచితే 2014 ఎన్నికల్లో ఏమి జరిగేది అన్నది ఒక ఊహాతీతమైన ఆలోచన. కానీ ప్రజారాజ్యం పార్టీకి 2009 కి మించి మంచి ఫలితాలే వస్తాయి తప్ప అంతకు తగ్గి రావు అన్నది మరో విశ్లేషణ. ఎపుడైతే చిరంజీవి పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారో నాటి నుంచే మెగా పొలిటికల్ ఇమేజ్ ఒక్కసారిగా డౌన్ అయింది అన్నది ఒక కఠిన విశ్లేషణ.

ఈ నేపథ్యంలో చూసినపుడు మెగా పాలిటిక్స్ కి ఆనాడే క్రేజూ మోజూ తగ్గడం మొదలైంది. ఇక చిరంజీవి తన రాజ్యసభ సభ్యత్వం ముగించుకుని సినిమాలు మళ్ళీ స్టార్ట్ చేశాక ఆయన రాజకీయాల గురించి చర్చ అయితే జన సామాన్యంలో లేదు అని చెబుతారు. అయితే పొలిటికల్ పార్టీలలో మాత్రం ఆయనను ఏదో విధంగా ఉపయోగించుకోవాలని ఆశ ఆరాటం కనిపిస్తోంది.

ఈ నేపథ్యంలో అనేక రూమర్స్ చిరంజీవి చుట్టూ వ్యాపిస్తూనే ఉన్నాయి. చిరంజీవిని ఎలాగైనా పాలిటిక్స్ లోకి తీసుకుని రావాలని చూసే పార్టీలకు కొదవ లేదు. కానీ చిరంజీవి మాత్రం రాజకీయాల విషయంలో దూరం అని చెబుతున్నారు. దాని మీద మరోసారి ఆయన ఒక సినిమా ఫంక్షన్ లో క్లారిటీ ఇచ్చారు.

అయితే అదే ఫంక్షన్ లో చిరంజీవి తనకు వారసుడిగా మనవడు రావాలని చేసిన కామెంట్స్ మాత్రమే సోషల్ మీడియాలో హైలెట్ అయి వైరల్ అయ్యాయి తప్ప ఆయన రాజకీయాల జోలికి పోను, అవి నాకు వద్దు అంటూ చేసిన సంచలన ప్రకటన మాత్రం జనంలోకి పెద్దగా ఎక్కలేదు. దాని అర్ధం ఏమిటి అంటే చిరంజీవి రాజకీయాన్ని జనాలు లైట్ తీసుకున్నారనే అంటున్నారు.

ఒకనాడు చిరంజీవి రాజకీయలలోకి వస్తే సీఎం సీటు ఖాయమన్న భావన ఇదే తెలుగు జనాల్లో ఉండేది. ఆ ఆకాంక్షలకు తగిన విధంగా ప్రజారాజ్యం పనిచేసి ఉంటే కధ వేరేగా ఉండేదని అంటారు. కానీ ఆ పార్టీ విలీనం తోనే చిరు రాజకీయం మీద అంతగా జనాలు మొగ్గు చూపడం లేదు అని అంటున్నారు. ఆయనను తమ పార్టీలలో తీసుకోవాలని ఆయా పార్టీల అధినేతలు ఆసక్తిని చూపుతున్నా గ్రౌండ్ రియాలిటీ మాత్రం వేరేగా ఉందని అంటున్నారు.

చిరంజీవి ఒకసారి రాజకీయాల్లోకి వెళ్ళి వచ్చారు. ఇపుడు ఆయన తన సినీ జీవితానికే జనాలు నూరు శాతం మార్కులేసి పద్మ విభూషణ్ స్థాయి దాకా తీసుకుని వచ్చారు కాబట్టే ఆయన కూడా సినీ రంగానికే చివరి వరకూ సేవ చేస్తాను అని అంటున్నారు. మొత్తం మీద చూస్తే నేను పాలిటిక్స్ లోకి జీవితాంతం రాను అన్న మెగాస్టార్ స్టేట్ మెంట్ ఎంతటి సంచలనం రేకెత్తించాలి. కానీ ఒక సాధారణ వార్తగా మిగిలిపోయింది అంటే ఆలోచించాల్సిందే మరి.