చిత్తూరు మహిళకు శీల పరీక్ష.. మరిగే నూనెలో చెయ్యి పెట్టాలన్న భర్త.. తర్వాత ఏం జరిగింది?
ఆ నాడు సీతమ్మకు అగ్నిపరీక్ష పెట్టిన విషయం ఇప్పటికీ చర్చనీయాంశమే! అయితే.. కలియుగంలో కూడా ఇలాంటి పరిస్థితులు కొనసాగుతున్నాయి.
By: Tupaki Desk | 17 Nov 2023 4:48 PM GMTరామాయణ కాలంలో సీతమ్మకు రఘురాముడు శీల పరీక్ష పెట్టాడని చదువుకున్నాం. ఆరు మాసాలు రావణుడి చెంతన ఉన్న ఆమెను యుద్ధం చేసి మరీ చెరవిముక్తుడిని చేసినా.. సమాజం కోసం తప్పదని .. ఆ నాడు సీతమ్మకు అగ్నిపరీక్ష పెట్టిన విషయం ఇప్పటికీ చర్చనీయాంశమే! అయితే.. కలియుగంలో కూడా ఇలాంటి పరిస్థితులు కొనసాగుతున్నాయి.
రయ్యిరయ్యన రోదసీకి పరుగులు పెడుతున్న శాస్త్ర విజ్ఞానం అందుబాటులోకి వచ్చినా.. ఇంకా మూఢ నమ్మకాలు.. పుక్కిటి పురాణాల అగచాట్లు సాధారణ మానవ కాంతలకు తప్పడం లేదు. కొన్నాళ్ల కిందట బిహార్‌కు చెందిన ఓ వ్యక్తి తన భార్యపై అనుమానంతో కరెంటు వైరును పట్టుకోవాలని శాసించి అలజడి సృష్టించాడు. అయితే.. ఆమె తప్పించుకుని పోలీసులను ఆశ్రయించడంతో బతికి బట్టకట్టింది.
ఇక, ఇప్పుడు మన ఏపీలోనే తెరమీదకు వచ్చిన ఘటన అందరినీ విస్మయానికి గురిచేసింది. భార్య శీలాన్ని అనుమానించిన భర్త.. సలసల మరుగున్న నూనెలో చేతులు పెట్టి శీలాన్ని నిరూపించుకోవాలని ఆదేశించాడు. అయితే.. ఈ ఘటన ఆ నోటా ఈ నోటా బయటకు పొక్కి.. పోలీసుల వరకు చేరడంతో ఆ ఇల్లాలు ప్రాణాలతో బతికి బయట పడింది. భర్తకు కౌన్సెలింగ్ ఇచ్చిన పోలీసులు.. సదరు భార్యకు ధైర్యం చెప్పారు.
ఏం జరిగింది?
చిత్తూరు జిల్లా పూతలపట్టు ప్రాంతానికి చెందిన గుండయ్య, గంగమ్మ భార్యాభర్తలు. వీరికి నలుగురు పిల్లలు ఉన్నారు. నలుగు రు పిల్లల్లో ఇద్దరికి పెళ్లిళ్లు అయ్యి పిల్లలు కూడా ఉన్నారు. ఇలాంటి వయసులో ఉన్న గంగమ్మపై గుండయ్య అనుమానం పెంచుకున్నాడు. వేరేవారితో కలిసి తిరుగుతోందని.. తను లేనప్పుడు వేరేవారితో కలుస్తోందని ఎవరో చెప్పిన మాటలు విని.. అవే నిజమని నమ్మాడు. దీంతో సల సల మరిగే నూనెలో చెయ్యి పట్టి, శీలాన్ని నిరూపించుకోవాలని భార్యకు షరతు పెట్టాడు. ఇందులో భాగంగా గ్రామ పెద్దల సమక్షంలోనే అలంకరించిన మట్టి పాత్రలో నూనె పోసి రోడ్డుపై పాత్ర కింద మంట పెట్టాడు.
కాలుతున్న నూనెలో చేతులు పెట్టడానికి గంగమ్మ సిద్ధమయ్యారు. అయితే విషయం తెలిసుకున్న ఎంపీడీవో గౌరీ, ఇతర అధికారులు అక్కడికి చేరుకుని ఆ అరాచకాన్ని అడ్డుకున్నారు. గుండయ్యను పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోలీసులు అతనికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపారు. ఇక, ఈ చర్యలతో హడిలి పోయిన గంగమ్మకు ధైర్యం చెప్పారు. దీనిపై సామాజిక ఉద్యమ కారులు.. తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలను అడ్డుకోవాల్సి ఉందని అంటున్నారు.