Begin typing your search above and press return to search.

ఎన్నికల వేళ హెలికాప్టర్లకు డిమాండ్‌.. అద్దె ఎంతో తెలుసా?

ఇలా తక్కువ సమయంలో ఎక్కువ నియోజకవర్గాల్లో పర్యటించేందుకు అవకాశం ఉన్న ఏకైక సాధనం హెలికాప్టర్‌. దీంతో వీటికి ఎన్నికల వేళ డిమాండ్‌ ఏర్పడింది.

By:  Tupaki Desk   |   11 March 2024 8:04 AM GMT
ఎన్నికల వేళ హెలికాప్టర్లకు డిమాండ్‌.. అద్దె ఎంతో తెలుసా?
X

ఆంధ్రప్రదేశ్, అరుణాచల్‌ ప్రదేశ్, ఒడిశా అసెంబ్లీ ఎన్నికలతోపాటు పార్లమెంటుకు ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హెలికాప్టర్లకు, చాపర్లకు ఎక్కడ లేని డిమాండ్‌ నెలకొంది. ఆయా పార్టీలు విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించాలన్నా, రోజుకు రెండు మూడు సభల్లో పాల్గొనాలన్నా హెలికాప్టర్ల అవసరం ఉంటుంది. హెలికాప్టర్లు అయితే గంటలోపుగానే రాష్ట్రం నలుమూలలకు వెళ్లిపోవచ్చు. దీంతో సమయం పెద్ద ఎత్తున కలిసి వస్తుంది.

ఈ నేపథ్యంలో హెలికాప్టర్లకు మాండ పెరిగిపోయింది. అధికార, ప్రతిపక్ష పార్టీ ముఖ్య నేతలతో పాటు మధ్యలో వచ్చే జాతీయ నాయకులతోనూ ప్రచారం హోరెత్తించేందుకు అన్ని పార్టీలూ ఇదే మంత్రాన్ని జపిస్తున్నాయి. ఇలా తక్కువ సమయంలో ఎక్కువ నియోజకవర్గాల్లో పర్యటించేందుకు అవకాశం ఉన్న ఏకైక సాధనం హెలికాప్టర్‌. దీంతో వీటికి ఎన్నికల వేళ డిమాండ్‌ ఏర్పడింది.

మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో హెలికాప్టర్లను అద్దెకిచ్చే కంపెనీలకు విపరీతమైన డిమాండ్‌ ఏర్పడింది. ప్రస్తుతం హెలికాప్టర్‌ కు గంటకు రూ.1.50 లక్షలు నుంచి రూ.2 లక్షల వరకు అద్దె ఉంది. అలాగే చాపర్లకు గంటకు రూ.4.50 లక్షల నుంచి రూ.5.50 లక్షల వరకు ఉంది.

2019 ఎన్నికల సమయంలో ఒక్కో హెలికాప్టర్‌ కు గంటకు అద్దె రూ.55 వేలు నుంచి రూ.1.30 లక్షల వరకు ఛార్జీ చేసేవారు. ఇప్పుడది త్రిబుల్‌ రేటు అయిపోయింది. హెలికాప్టర్‌ రకాన్ని బట్టి గంటకు రూ.2 లక్షల నుంచి రూ.3.50 లక్షల వరకు పార్టీలు చెల్లిస్తున్నాయి. ఇవిచాలవన్నట్టు విమానశ్రయ ఛార్జీలు, ఎయిర్‌ పోర్ట్‌ హ్యాండ్లింగ్‌ ఛార్జీలు, ఫ్యూయల్‌ ట్రాన్స్‌ పోర్టేషన్, సిబ్బంది బస, ఆహారానికి అయ్యే ఖర్చు అదనం కావడం గమనార్హం.

ప్రస్తుతం మన దేశంలో 350 చార్టర్డ్‌ విమానాలు, 175కు పైగా హెలికాప్టర్లు ఉన్నట్టు సమాచారం. ముంబయికి చెందిన ప్రైవేటు ఛార్టర్‌ కంపెనీ ఫ్లయింగ్‌ బర్డ్స్‌ ఏవియేషన్‌ కు నాలుగు హెలికాప్టర్లు, ఆరు జెట్‌ విమానాలున్నాయి. ఎన్నికల నేపథ్యంలో మరో కొన్ని హెలికాప్టర్లను అద్దెకు తీసుకుని అట్టిపెట్టుకుంది.

2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో సగటున 70–100 హెలికాప్టర్లకు డిమాండ్‌ ఉండేది. కానీ 40 మాత్రమే అప్పట్లో అందుబాటులో ఉన్నాయి. ఈ ఏడాది హెలికాప్టర్ల డిమాండ్‌ 100–130కి పెరిగింది. అయితే కేవలం 50–60 విమానాలు మాత్రమే సమకూర్చగలుతున్నామని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. హెలికాప్టర్ల సంఖ్య తక్కువగా ఉండడం, డిమాండ్‌ ఎక్కువగా ఉండడంతో హెలికాప్టర్ల అద్దె ధరలు సైతం పెరిగాయి.