ఏపీలో హాట్ టాపిక్ గా షర్మిల క్రిస్మస్ గిఫ్టు!
కొన్నిసార్లు చిన్న అంశాలే ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంటాయి. తాజాగా అలాంటిదే ఒకటి ఏపీ రాజకీయాల్లో చోటు చేసుకుంది
By: Tupaki Desk | 25 Dec 2023 4:56 AM GMTకొన్నిసార్లు చిన్న అంశాలే ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంటాయి. తాజాగా అలాంటిదే ఒకటి ఏపీ రాజకీయాల్లో చోటు చేసుకుంది. దీన్ని.. చిలువలుపలవులుగా చిత్రీకరిస్తున్న వైనం చూసినప్పుడు.. ఏపీ రాజకీయాలు ఇలా ఉన్నాయేమిటి? అన్న భావన కలుగక మానదు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ కు క్రిస్మస్ గిఫ్టు పంపించారు షర్మిల. ఈ సందర్భంగా ఆమెకు సోషల్ మీడియాలో థ్యాంక్స్ చెప్పారు. ‘క్రిస్మస్ గిప్ట్స్ అందించినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీకు, మీ కుటుంబసభ్యులకు నారా కుటుంబం క్రిస్మస్, న్యూఇయర్ శుభాకాంక్షలు తెలియజేస్తోంది’ అంటూ ట్వీట్ చేశారు లోకేశ్.
రాజకీయాలు అన్నంతనే ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవటం.. విరుచుకుపడటం.. ఘాటు ఆరోపణలు చేయటం తప్పించి.. పరస్పరం మర్యాదగా వ్యవహరించటం.. అభిమానాన్ని చూపటం లాంటివి అస్సలు లేనట్లుగా చేస్తున్నారు. క్రిస్మస్ సందర్భంగా గిఫ్ట్స్ పంపితే.. అదేదో జరగరానిది జరిగిపోయినట్లుగా ఎందుకు భావించాలి? అన్నదిప్పుడు ప్రశ్న. క్రిస్మస్ సందర్భంగా లోకేశ్ కు షర్మిల క్రిస్మస్ గిఫ్టు పంపటానికి సంబంధించి బోలెడన్ని వాదనల్ని వినిపిస్తున్నారు.
కొందరేమో మొన్న పీకే.. ఇప్పుడు షర్మిల క్రిస్మస్ గిఫ్ట్స్ పంపటమంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి షాకుల మీద షాకులు తగులుతున్నాయని చెబుతున్నారు. ఇలాంటివి చెప్పే వారు.. మొన్నటికి మొన్న సీఎం జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా విపక్ష నేత నారా చంద్రబాబునాయుడు జన్మదిన శుభాకాంక్షలు చెప్పటాన్ని వదిలేస్తున్నారెందుకు? ఆ మాటకు వస్తే చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా సీఎం జగన్ పుట్టినరోజు అభినందనలు తెలియజేయటం చేస్తున్నాం.
అలాంటివేళ.. పుట్టినరోజు సమయాన అభినందనలు తెలిపిన చందంగానే.. క్రిస్మస్ పర్వదినాన బహుమతిని పంపటంలో ప్రత్యేకత ఏముంది? ఆ మాటకు వస్తే.. రాజకీయ విరోధాల్ని పక్కన పెట్టి.. బహుమతుల్ని ఇచ్చి పుచ్చుకోవటాన్ని సానుకూల అంశంగా ఎందుకు చూడటం లేదు? ప్రతి అంశంలోనూ సంచలనం.. అదేదో జరిగిపోతుందన్నట్లుగా వ్యాఖ్యలు చేసుకోవటం ఏమిటి? అలాంటి ప్రశ్నలే తప్పించి.. జరిగిన విషయాన్ని ఇలా జరిగిందన్నట్లుగా చూసే ధోరణి కనిపించకపోవటం గమనార్హం. మొత్తంగా..లోకేశ్ కు షర్మిల క్రిస్మస్ గిఫ్టు పంపటం ఒక రాజకీయ సంచలనంగా మార్చేస్తున్న వైనం చూస్తే.. గుడ్డు మీద ఈకలు పీకిన చందంగా అనిపించక మానదు. ఈ ఉదంతం మరోసారి ఏపీ రాజకీయాలు ఎలా ఉన్నాయో అర్థమయ్యేలా చేస్తుందని చెప్పక తప్పదు.