Begin typing your search above and press return to search.

బ్రిటన్‌ రాజ కుటుంబీకుల క్రిస్మస్‌ మెనూ ఇదే!

అవును... క్రిస్మస్ వేళ బ్రిటన్ రాజకుటుంబీకుల విందు వినోదాలపై మాజీ చెఫ్‌ డారెన్‌ మెక్‌ గ్రాడీ కీలక విషయాలు వెల్లడించారు.

By:  Tupaki Desk   |   25 Dec 2023 9:32 AM GMT
బ్రిటన్‌  రాజ కుటుంబీకుల క్రిస్మస్‌  మెనూ ఇదే!
X

ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు మొదలైపోయాయి. ఆదివారం అర్ధరాత్రి నుంచి క్రిస్మస్ సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. ఈ క్రమంలో క్రిస్మస్‌ రోజు బ్రిటన్‌ రాజకుటుంబం చాలా సంప్రదాయంగా వ్యవహరించే మెనూ విషయం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. ఈ సందర్భంగా క్రిస్మస్ వేళ బ్రిటన్ రాజ కుటుంబీకుల విందు వ్యవహారాలపై మాజీ చెఫ్‌ డారెన్‌ మెక్‌ గ్రాడీ కీలక విషయాలు వెల్లడించారు.

అవును... క్రిస్మస్ వేళ బ్రిటన్ రాజకుటుంబీకుల విందు వినోదాలపై మాజీ చెఫ్‌ డారెన్‌ మెక్‌ గ్రాడీ కీలక విషయాలు వెల్లడించారు. ఇందులో భాగంగా... క్రిస్మస్‌ రోజు రాజకుటుంబం విందు వినోదాలతో చాలా ఖరీదైన వంటకాలను ఆరగిస్తారని చాలా మంది అనుకోవచ్చు కానీ... అందులో నిజం లేదు. పండగ రోజు బ్రిటన్‌ లోని సామాన్యుల ఇళ్లలో ఏ వంటలైతే ఉంటాయో అవే రాజ కుటుంబీకులూ స్వీకరిస్తారని మెక్ తెలిపారు.

వాస్తవానికి 1980, 90లలో శాండ్రింగ్‌ హాంలో క్రిస్మస్‌ వేడుకల్లో రాజకుటుంబీకులకు డారెన్‌ మెక్‌ గ్రాడీ స్వయంగా వంట చేసి వడ్డించేవారు. ఈ క్రమంలో ఇటీవల ఆ సంగతులకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఇందులో భాగంగా... క్రిస్మస్‌ ముందురోజు రాజకుటుంబీకులంతా శాండ్రింగ్‌ హాంకు చేరుకోవటంతో వేడుకలు ప్రారంభమవుతాయని అన్నారు.

ఇక విందు భోజనాల విషయానికొస్తే... ఆరోజు మధ్యాహ్నం తేనీరు, రుచికరమైన శాండ్‌ విచ్‌ లు, కేక్‌ లతో ప్రారంభమవుతాయని తెలిపారు. ఈ క్రమంలో కుటుంబ సభ్యుల ఆత్మీయ పలకరింపుల అనంతరం రాత్రి భోజనంలో చేపల వంటకాలు, సలాడ్‌, శాండ్రింగ్‌ హాం ఎస్టేట్‌ లో పెంచిన లేడి మాంసం వంటివి ఉంటాయని వెల్లడించారు. ఇక డెజర్ట్‌ కింద రాణి ఎలిజబెత్‌-2కు అత్యంత ఇష్టమైన "చాకొలెట్‌ పర్ఫెక్షన్‌ పై" ఉండేవని తెలిపారు.

ఇదే సమయంలో డ్రింక్స్‌ విషయంలోనూ రాయల్‌ ఫ్యామిలీ చాలా సంప్రదాయంగా ఉండేదని చెబుతున్నారు డారెన్ మెక్. ఇందులో భాగంగా సాయంత్రం "జిన్‌", "డుబోనెట్‌"తో డ్రింక్స్‌ ప్రారంభిస్తారని.. రాయల్‌ సెల్లార్‌ లోని సైనికుడొకరు రాత్రి భోజన సమయంలో షాంపైన్‌, ఫైన్‌ వైన్స్‌ సర్వ్‌ చేసేవారని అన్నారు.

ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సిన వాటిలో భోజన సమయంలో రాణీకి ఇచ్చే గౌరవ మర్యాదల గురించి మొదలుపెట్టిన మెక్... భోజన సమయంలో వారంతా కొన్ని నియమాలను కచ్చితంగా ఆచరించేవారని.. అందులో ప్రధానంగా.. రాణి వచ్చే వరకు ఎవరూ డైనింగ్ టేబుల్ వద్ద కూర్చునేవారు కాదని తెలిపారు.

ఇదే సమయంలో... ఆమె టేబుల్ వద్దకు వచ్చి కూర్చున్న తర్వాతే మిగిలిన వారంతా కూర్చుంటారని తెలిపారు. ఇక ఆమె తినడం ప్రారంభించేవరకు మిగతా ఎవరూ భోజనాన్ని స్వీకరించేవారు కాదన్ని తెలిపారు. వీటిలో చాలా నియమాలు ప్రస్తుత రాజు ఛార్లెస్‌-3 హయాంలోనూ కొనసాగుతాయని అనుకుంటున్నట్లు వెల్లడించారు.

ఇక క్రిస్మస్‌ రోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్ తో విందు కార్యక్రమాలు ప్రారంభమయ్యేవని.. రాజకుటుంబంలోని మహిళలంతా వాళ్ల వాళ్ల బెడ్ రూంస్ లోనే తర్వాతి కార్యక్రమాలకు సిద్ధమవుతూ అల్పాహారాన్ని స్వీకరించేవారని తెలిపారు. అనంతరం మధ్యాహ్నం సరిగ్గా 1:15 గంటలకు భోజనానికి కూర్చునేవారని అన్నారు.

ఇందులో ప్రత్యేక ఆకర్షణగా స్థానికంగా నోర్ఫోక్‌ ప్రాంతంలో పెంచిన టర్కీ కోళ్లతో చేసిన వంటకం ఉండేదని తెలిపారు. ఫైనల్ గా క్రిస్మస్‌ రోజు రాత్రి ఏదైనా స్వీట్‌ తో విందు భోజనాలు ముగిసేవని మెక్ వెల్లడించారు. ప్రస్తుత రాజు ఛార్లెస్‌-3 కూడా ఈ సంప్రదాయాలన్నింటినీ కొనసాగిస్తారని అనుకుంటున్నట్లు తెలిపారు. ముఖ్యంగా సేంద్రియ ఉత్పత్తులతో చేసిన ఆహారాన్ని ఆయన ఎక్కువగా ఇష్టపడతారని అన్నారు.