Begin typing your search above and press return to search.

వైరల్ ఇష్యూ... పోసానితో సీఐడీ పోలీసుల ఫోటోలు!

చంద్రబాబు, పవన్ కల్యాణ్ లపై గతంలో అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు మార్ఫింగ్ చిత్రాలను విలేకరుల సమావేశంలో పోసాని ప్రదర్శించారని సీఐడీ పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   19 March 2025 8:38 AM IST
వైరల్  ఇష్యూ... పోసానితో సీఐడీ పోలీసుల ఫోటోలు!
X

చంద్రబాబు, పవన్ కల్యాణ్ లపై గతంలో అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు మార్ఫింగ్ చిత్రాలను విలేకరుల సమావేశంలో పోసాని ప్రదర్శించారని సీఐడీ పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. గుంటూరు జిల్లా పోన్నూరుకు చెందిన టీడీపీ నేత ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐడీ అధికారులు పోసానిపై కేసు నమోదు చేసి.. పీటీ వారెంట్ పై కర్నూలు నుంచి గుంటూరు తీసుకొచ్చారు.

ఈ నేపథ్యంలో.. గత బుధవారం స్థానిక కోర్టులో హాజరుపరచగా.. కోర్టు రిమాండ్ విధించింది. దీంతో.. పోసానిని గుంటూరు జైలుకు తరలించారు. ఈ క్రమంలో... పోసానిని కస్టడీకి ఇవ్వాలని ఇటీవల సీఐడీ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. ఇందులో భాగంగా... మంగళవారం ఉదయం 10 నుంచి 5 గంటల వరకూ సమయమిచ్చింది.

దీంతో.. మంగళవారం పోసాని కృష్ణమురళి ఒక్కరోజు సీఐడీ విచారణ ముగిసింది. ఈ విచారణ అనంతరం జీజీహెచ్ లో పోసానికి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం.. అధికారులు ఆయనను జిల్లా జైలుకు తరలించారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఇందులో భాగంగా.. పోసానిని తిరిగి జైలుకు పంపే ముందు సీఐడీ పోలీసులు పోసానితో ఫోటోలు దిగారు.

అవును... పోసాని ఒకరోజు విచారణ ముగిసిన అనంతరం సీఐడీ అధికారులు తిరిగి గుంటూరు జైలుకు తరలించారు. ఈ సమయంలో పోసాని జైలు లోపలికి వెళ్లేందుకు సిద్ధపడుతుండగా.. ఆయన వెంట వచ్చిన సీఐడీ అధికారులు ఓ ఫోటో కావాలంటూ పోసానిని కోరారు. అనంతరం సదరు సీఐడీ పోలీసు తన ఫోన్ ను సహోద్యోగికి ఇచ్చి పోసాని పక్కన నిలబడి ఫోటో తీయించుకున్నారు.

అనంతరం మరో సీఐడీ అధికారి కూడా ఇదే పనికి పూనుకున్నారు! దీంతో... ఈ వ్యవహారానికి సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది. ఓ రిమాండ్ ఖైదీతో సీఐడీ పోలీసులు ఫోటోలు దిగడం ఏమిటంటూ విమర్శలు మొదలయ్యాయని అంటున్నారు. దీంతో... ఈ వ్యవహారంపై ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారనేది ఆసక్తిగా మారింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి!

మరోపక్క పోసాని బెయిల్ పిటిషన్ పై విచారణను కోర్టు బుధవారానికి వాయిదా వేసింది. కాగా... ఈ నెల 26 వరకూ పోసానికి కోర్టు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే.