చంద్రబాబుకు 20 ప్రశ్నలు.. సీఐడీ రెడీ
సుమారు 20 ప్రశ్నలకు చంద్రబాబు నుంచి సమాధానాలు రాబట్టాలని సీఐడీ అధికారులు నిర్ణయించిన ట్టు తెలిసింది.
By: Tupaki Desk | 9 Sep 2023 3:28 PMశనివారం ఉదయం నంద్యాలలో అరెస్టు చేసిన టీడీపీ అధినేత చంద్రబాబును ప్రశ్నించేందుకు ఏపీ సీఐడీ అధికారులు అస్త్ర శస్త్రాలతో రెడీ అయ్యారు. నంద్యాల నుంచి రోడ్డు మార్గంలో వివిధ ప్రాంతాల మీదుగా విజయవాడలోని సీఐడీ కార్యాలయానికి చంద్రబాబును తీసుకువచ్చిన అధికారులు కొంత సేపు విశ్రాంతి తీసుకునేందుకు అనుమతి ఇచ్చారు. అనంతరం చంద్రబాబును ప్రశ్నించేందుకు రెడీ అయ్యారు.
సుమారు 20 ప్రశ్నలకు చంద్రబాబు నుంచి సమాధానాలు రాబట్టాలని సీఐడీ అధికారులు నిర్ణయించిన ట్టు తెలిసింది. ఈ ప్రశ్నల్లో ప్రధానంగా కేబినెట్ అనుమతి లేకుండా ఎందుకు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటైంది? గంటా సుబ్బారావుకు పదవులు, వాటి ప్రాతిపదిక ఏమిటి? సీమెన్స్ ఒక్క రూపాయైనా ఖర్చు చేయకుండా ప్రభుత్వం ఎలా రూ.371 కోట్లు రిలీజ్ చేసింది? వంటి ప్రశ్నలు ఉన్నాయని సమాచారం.
అడ్వొకేట్లకు అనుమతి నో!
మరో వైపు చంద్రబాబును కలిసేందుకు ఆయన తరఫున ప్రత్యేకంగా ఢిల్లీ నుంచి వచ్చిన సిద్దార్థలూథ్రా నేతృత్వంలోని అడ్వొకేట్ల బృందం(నలుగురు) ప్రయత్నించింది. అయితే, సీఐడీ పోలీసులు ఈ బృందాన్ని అనుమతించలేదు. అధికారుల తీరుపై అడ్వకేట్ ల బృందం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రభుత్వ అడ్వకెట్లను అనుమతించిన అధికారులు, చంద్రబాబు తరఫు లాయర్లు నలుగురిని నిలిపివేయడంపై చంద్రబాబు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం అరెస్ట్ నుంచి ఇప్పటి వరకు అన్నిటిలో నిబంధనలకు విరుద్ధం గా దర్యాప్తు అధికారులు పని చేస్తున్నారని ఆరోపించారు.
గవర్నర్‌ను కలిసేందుకు కూడా నో!
మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు ను అక్రమంగా అరెస్టు చేశారంటూ.. టీడీపీ నేతలు ఏపీ గవర్నర్ అపాయింట్‍మెంట్ తీసుకున్నారు. టీడీపీ ఏపీ చీఫ్ అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడుతో పాటు పలువురు టీడీపీ నేతలు గవర్నర్‌కు ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. అయితే, గవర్నర్ దగ్గరకు వెళ్లకుండా టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో విజయవాడలో టీడీపీ నేతలు రోడ్డుపైనే నిరసన తెలిపారు.